ఆసుపత్రుల అభివృద్దేది :మధు

గుంటూరు, విజయవాడ ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రుల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని ఆధునాతన పరికరాలు ఏర్పాటు చేసి, మౌలిక సదుపాయాలను అభివృద్ధ్ది చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రికి ఆయన శుక్రవారం ఒక లేఖ రాశారు. రెండు నగరాల మధ్య రాష్ట్ర రాజధాని నిర్ణయించడంతో ఈ రెండు ఆసుపత్రులకు ప్రాధాన్యత మరింత పెరిగిందని తెలిపారు. ఈ ఆసుపత్రులకు రోజూ సుమారు 1500 మంది ఔట్‌ పేషెంట్లు వస్తుంటారని మధు పేర్కొన్నారు. విజయవాడ ఆస్పత్రిలో ఇన్‌ పేషెంట్ల కోసం 670 పడకలు మంజూరైనా, 412 పడకలు మాత్రమే వినియోగంలో ఉన్నాయని తెలిపారు. రోగుల సంఖ్యను బట్టి మరో 80 పడకలు అవసరమవుతాయన్నారు. మొత్తం 750 పడకల రోగులకు వైద్య సేవలు సరిగా అందాలంటే అందుకు అవసరమైన సిబ్బందిని నియమించాల్సి ఉంటుందన్నారు. సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టులు 2, కీలకమైన అడ్మినిస్ట్రేషన్‌ డాక్టర్‌ పోస్ట్టూ ఖాళీగా ఉన్నాయని తెలిపారు. గత మూడేళ్లుగా లిఫ్ట్‌ పనిచేయడం లేదని, ఆరు అంబులెన్స్‌లుండగా ఒక్కటే పనిచేస్తుందని వివరించారు. మంగళగిరి టిడి ఆస్పత్రి మూసి వేశాక 180 పడకలు ఇక్కడికి మార్చారని, కానీ అవసరమైన సిబ్బందిని సమకూర్చలేదని తెలిపారు. గుంటూరు ఆసుపత్రిలో కీలకమైన కార్డియాక్‌ విభాగంలో నలుగురు డాక్టర్లకు గాను ఒక్కరే ఉన్నారని, ఇన్‌పేషంట్లకు 1417 పడకలు ఉన్నా అవసరమైన సిబ్బంది లేరని తెలిపారు. ఇక్కడ 600 నర్సు పోస్టులకు గాను 180 మంది నర్సులే ఉన్నారన్నారు. ఈ రెండు ప్రముఖ ఆసుప్రతుల్లో నూ డాక్టర్లు, కాంపౌండర్లు, టెక్నీషియన్లు తదితర పోస్టుల ఖాళీలన్నీ వెంటనే భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు.