ఆశ నిరాశల మధ్య రాజధాని నిర్మాణం..

రాజధాని అమరావతి శంకుస్థాపనకు సర్వం సిద్ధమైంది. ప్రచారహోరు ఉధృతంగా ఉంది. మీడియా రాజధానిపైనే కేంద్రీకరించింది. ప్రభుత్వ పెద్దలు, తెలుగుదేశం నేతలు, అధికార యంత్రాంగమంతా నీరు-మట్టి, 5కె రన్‌ పేర్లతో హడావుడి చేస్తున్నారు. ప్రధానమంత్రి మోడీ సహా ప్రముఖ నేతలు, సెలబ్రిటీలు శంకుస్థాపనకు హాజరు కాబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. సందడి నెలకొన్నది. వందల కోట్ల రూపాయలు ఇష్టారాజ్యంగా ఖర్చు చేస్తున్నారు. ఆహ్వానపత్రిక మొదలు వంటకాల వరకు అన్నీ ప్రచార అంశాలుగా మార్చేశారు. ఈ నేపథ్యంలో రాజధాని గురించే సర్వత్రా చర్చ నెలకొన్నది.
రాష్ట్రం విభజించబడిన నేపథ్యంలో మంచి రాజధాని కావాలని ప్రజలందరి ఆకాంక్ష. తొలుత రాజధాని నిర్మించబోయే ప్రాంతం గురించి ఎంతో చర్చ జరిగినా చివరకు తుళ్ళూరు ప్రాంతం రాజధానిగా ఎంపిక చేయబడిన తరువాత ఒక విధంగా ఆ చర్చ ముగిసింది. ఏదో ఒక రూపంలో 33 వేల ఎకరాల భూమి సమీకరించబడింది. ప్రస్తుతం రాజధాని ఏ రీతిలో నిర్మించాలన్నదే ప్రధాన అంశం. కేంద్రీకరించబడిన హైదరాబాద్‌ నమూనా విఫలమైన స్థితిలో వికేంద్రీకరణ మోడల్‌ చర్చనీయాంశమైంది. మంచి రాజధాని, భవిష్యత్‌ అవసరాల కోసం పెద్దఎత్తున భూములు అవసరమనే వాదనలను పాలకులు ముందుకు తెచ్చారు. రాజధాని కోసం 33 వేల ఎకరాల భూమిని సమీకరించారు. మరో 20 వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నది. కృష్ణా-గుంటూరు జిల్లాలలో అటవీ భూములను డీనోటిఫై చేసి 55 వేల ఎకరాలను రాజధానికి కేటాయిస్తున్నారు. కృష్ణా జిల్లాలో నదీ తీరంలో మరో 10 వేల ఎకరాలు సమీకరించడానికి సన్నాహాలు చేస్తున్నారు. దాదాపు ఒక లక్షా ఇరవై వేల ఎకరాలు రాజధాని కోసం భూములు కేటాయిస్తున్నారు. ఇది కాకుండా రాజధాని నగరాన్ని మరో 170 చదరపు కిలోమీటర్లు అదనంగా విస్తరింపజేయడానికి మాస్టర్‌ప్లాన్‌లో పొందుపర్చారు. రాబోయే 10 సంవత్సరాల్లో బీజరాజధాని (సీడ్‌ కేపిటల్‌) మొత్తం నాలుగు వేల ఎకరాల్లోనే నిర్మాణమవుతుంది. అందులో అసెంబ్లీ, సెక్రటేరియట్‌, ఇతర ప్రభుత్వ కార్యాలయాలన్నీ 200 ఎకరాల్లో ఏర్పాటు చేయబడతాయి. మరి ఇన్ని వేల ఎకరాలు ఎందుకోసం? వాణిజ్యం, పరిశ్రమలు, పర్యాటకం పేరుతో వ్యాపారం చేయడానికి ఈ భూములను ఉపయోగిస్తారు. రాజధాని భూములను 99 సంత్సరాల పాటు ప్రైవేటు సంస్థలకు లీజుకు ఇవ్వడానికి 110 జీవో గత మే నెలలోనే విడుదల అయ్యింది. మూడు వేల ఎకరాల భూమి సింగ్‌పూర్‌ సంస్థలు కోరినట్లు మున్సిపల్‌ మంత్రివర్యులే వెల్లడించారు. ప్రభుత్వ భూమిని వాటాగా పెట్టి విదేశీ కంపెనీల పెట్టుబడులు సమకూర్చి జాయింట్‌ వ్యాపారం చేస్తామని, ఇందులో లాభాలు వస్తాయని ముఖ్యమంత్రే స్వయంగా ప్రకటించారు. మరోవైపు దళితులకు, బలహీనవర్గాలకు కేటాయించిన అసైన్డ్‌, లంక భూములకు పరిహారం చెల్లింపులో ఆలస్యం చేస్తూ అభద్రతా వాతావరణం కల్పించి పాలక పార్టీ పెద్దలే కారుచౌకగా ఆ భూములను రాజధానిలో కొనుగోలు చేసి వందల కోట్లు గడిస్తున్నారు.
రాజధాని నగరంలోని 29 గ్రామాల్లో భూములున్న ధనిక రైతులు కొందరు భూముల రేట్లు పెరిగి సంతోషిస్తున్నారు. కానీ, వేలాది మంది వ్యవసాయ కార్మికులు, కౌలు రైతులు, వృత్తిదారులు, ఇతర శ్రామికులు పనులు కోల్పోయి అల్లాడిపోతున్నారు. ఉపాధి కోసం సుదూర ప్రాంతాలకు వెళ్తున్నారు. సంవత్సరం పొడవునా ఉపాధి హామీ పనులు చూపిస్తామని ఇచ్చిన హామీలు కాగితాల్లోనే మిగిలిపోయాయి. 53 వేల మంది వ్యవసాయ కార్మికులు ఉండగా ఈ ఆరు నెలల్లో కేవలం 551 మందికి మాత్రమే పని చూపించారు. అదీ సగటున ఎనిమిది రోజులు మాత్రమే. 100 రోజులు పని కల్పించింది కేవలం ముగ్గురికి మాత్రమే. ఇది ఉపాధి పనుల భాగోతం. మరోవైపు భూమిలేని పేదలకు నెలకు 2,500 రూపాయల పెన్షన్‌ పంపిణీ అరకొరగా సాగుతోంది. ఆగస్టు నెలలో 29 వేల మంది లబ్ధిదారులను గుర్తించి అక్టోబర్‌ నాటికి 14 వేలకు కుదించారు. అందులోనూ పంపిణీ జరిగింది సగం మందికే. పనిచేసే మనిషికి రోజుకు 300 రూపాయల చొప్పున నెలకు తొమ్మిది వేల రూపాయలు పెన్షన్‌ ఇవ్వాలని పేదలు కోరుతుండగా కుటుంబానికి 2,500 రూపాయలతోనే సరిపెడుతున్నారు. అది కూడా అందరికీ అందడం లేదు. 22 వేల మందికి ఉపాధి శిక్షణ ఇస్తామని నమ్మబలికి ఇప్పటికి 250 మందికి మాత్రమే శిక్షణ ఇచ్చారు. వారికి కూడా ఉద్యోగ గ్యారెంటీ లేదు. 25 లక్షల వరకు స్వయం ఉపాధి కొరకు రుణాలిస్తామన్న హామీ ప్రకారం ఒక్కరికి కూడా మంజూరు చేయలేదు. ఉచిత విద్య, వైద్యం హామీలు, గ్రామ గ్రామాన అన్న కేంటీన్లు, వృద్ధాశ్రమాల ఏర్పాటు వంటి వాగ్దానాలు అమలుకు నోచుకోలేదు. ఇవన్నీ నోటిమాటతో ఇచ్చిన హామీలు కావు. ప్రభుత్వం చట్టబద్ధంగా ఇచ్చినవే. ఇప్పుడే ఈ గతి పడితే రాబోయే పదేళ్ళల్లో వీటి అమలుపై అందరిలోనూ అనుమానాలు నెలకొని ఉన్నాయి.
పూలింగ్‌లో భూములిచ్చిన రైతులకు ఇంటింటికీ వెళ్ళి చీరా, సారె ఇచ్చి శంకుస్థాపనకు ఆహ్వానం పలుకుతూ శిలాఫలకంలో పేర్లు కూడా పెడతామని ఊరిస్తున్న ప్రభుత్వం ఆ రైతులకు ప్యాకేజీ ప్రకారం భూమి ప్రత్యామ్నాయంగా ఎక్కడిస్తారో ఇంతవరకు తేల్చలేదు. అసలు భూమి ఇస్తారా, లేదా? నిర్మాణం అయిన కట్టడాలలో కొంత వాటా ఇస్తారా? అనే అనుమానాలు ఉన్నాయి. భూమి ఎప్పుడిస్తారు? ఎక్కడిస్తారు? ఈ భూమిలో మౌలిక సదుపాయాలు ఎవరు కల్పిస్తారు? ఎప్పుడు కల్పిస్తారు? అభివృద్ధి పనులు ఎప్పుడు జరుగుతాయి? ఎన్ని సంవత్సరాలకు ఈ భూమి విలువ పెరుగుతుంది? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు కరువవుతున్నాయి. మరోవైపు రోడ్ల వెడల్పు, మెట్రో ఏర్పాటు, మంచినీరు, డ్రైనేజీ లైన్లు, విద్యుత్‌ లైన్లు మరెన్నో సౌకర్యాల పేరుతో ఏ ఇల్లు ఎంత వరకు ఉంటుందో, పోతుందో అనే భయాందోళనలు జనంలో ఉన్నాయి. సీడ్‌ క్యాపిటల్‌లో గ్రామాలు, నివాసాలు ఉంటాయా? పూర్తిగా తరలిస్తారా? పొమ్మనకుండా పొగబెడతారా? ఇవి ప్రజల్లో ఉన్న ప్రశ్నలు. మంచినీరు, పారిశుధ్య నిర్వహణ, ఇతర పౌర సదుపాయాల కల్పనను ప్రైవేట్‌ కంపెనీలకు కట్టబెట్టి భారీగా పన్నులు విధిస్తారన్న భయాందోళనలు వెంటాడుతున్నాయి. భూములు ఇవ్వడానికి నిరాకరించిన కొన్ని గ్రామాల్లో బలవంతపు భూ సేకరణకు ప్రయత్నించి ప్రజా ప్రతిఘటనతో ప్రభుత్వం తాత్కాలికంగా వెనక్కు తగ్గింది. శంకుస్థాపన అనంతరం ఏదో ఒక రూపంలో భూ సేకరణకు ప్రభుత్వం మళ్ళీ ప్రయత్నిస్తుందనే అనుమానాలు రైతాంగంలో బలంగా ఉన్నాయి.
మట్టి-నీరు, రైతు వందనం, ప్రజల భాగస్వామ్యం అంటూ ఆర్భాటం చేస్తున్న ప్రభుత్వం ఇప్పటి వరకు రాజధాని మాస్టర్‌ప్లాన్‌లపై ప్రజల అభిప్రాయాలను సేకరించ లేదు. కనీసం ఎన్నికయిన స్థానిక సంస్థలను భాగస్వామ్యం చేయలేదు. రాజధాని సలహా కమిటీ బడా పారిశ్రామిక వేత్తలతో నింపి వేసింది. జన్మభూమి కమిటీలను తెలుగు దేశం పార్టీ కమిటీలుగా మార్చేశారు. రాజధాని నగరంలో 144 సెక్షన్‌, సెక్షన్‌ 30 పేరుతో ప్రజల గొంతు నొక్కి అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఇప్పటి వరకు పై నుంచి క్రింది వరకు ఏ స్థాయిలోనూ రాజధాని అంశంపై ఒక్క అఖిలపక్ష సమావేశం కూడా ప్రభుత్వం నిర్వహించలేదు.
ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు రాజధాని నిర్మాణానికి ఐదు లక్షల కోట్ల రూపాయల సహాయం అవసరమని డిమాండ్‌ చేసిన చంద్రబాబు ఇప్పుడు నోరు మెదపడం లేదు. శంకుస్థాపన సమయంలోనైనా ప్రధానమంత్రి మోడీ రాజధానికి అవసరమైన నిధుల విషయంపై నిర్దిష్టమైన ప్రకటన చేయాలన్న ఒత్తిడి రాష్ట్ర ప్రభుత్వం నుంచీ లేదు. కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధీ లేదు. శంకుస్థాపనకే 300 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేస్తూ మరోవైపు నిధులు లేవనే సాకుతో భూములను సింగపూర్‌ కంపెనీలకు ప్రభుత్వం కట్టబెడుతోంది. ఈ అంశంలో మోడీ-బాబులది ఒకే మాట. రాజధాని భూములకు రేట్లు పెరిగి విదేశీ, స్వదేశీ కార్పొరేట్‌ కంపెనీలకు లాభం కల్పించడమే పాలకుల లక్ష్యమా? ఇందుకేనా శంకుస్థాపన పేరుతో విస్తృత మార్కెట్‌? సామాన్యుల ప్రయోజనాలను, రాష్ట్ర సమగ్రాభివృద్ధిని పణంగా పెట్టి రాజధాని పైనే దృష్టి పెట్టడంలో అంతరార్థం ఇదేనా? అన్న విమర్శలు లేకపోలేదు. శంకుస్థాపన ఎంత ఘనంగా చేశామనే దానికంటే కేంద్రం నుంచి ఎంత ఎక్కువగా నిధులు రాబట్టామనేదే ముఖ్యమైన విషయం. ప్రజలలో నెలకొన్న సందేహాలను, భయాందోళనలను పోగొట్టి, హామీలు నెరవేర్చడం, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాజధాని నిర్మించడం ప్రభుత్వ బాధ్యత. కార్పొరేట్‌ వర్గాల ప్రయోజనాలు కాకుండా సామాన్య ప్రజలను సైతం భాగస్వాములను చేసే ప్రజా రాజధాని నిర్మించడం కీలకాంశం. ఈ ప్రధానాంశాల నుంచి దృష్టి మళ్ళించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. వాస్తవాలను గమనించి నిజమైన ప్రజా రాజధాని నిర్మాణానికై పోరు సాగించడమే ప్రజాకర్తవ్యం.
- సిహెచ్‌ బాబూరావు 
(వ్యాసకర్త సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు)