
పాఠ్యాంశాల్లో హిందూత్వాన్ని చొప్పించొద్దని స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్‌టిఎఫ్‌ఐ) జాతీయ కార్యదర్శి సి.ఎన్. బారతి సూచించారు. మంగళవారం పార్లమెంట్‌లో ఎస్‌టిఎఫ్‌టి ఉపాధ్యక్షులు ఎన్.నారాయణతో కలసి ఆయన కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీని కలిసి రెండు వినతి పత్రాలను సమర్పించారు. నూతన విద్యా విధానం-2015పై ఎస్‌టిఎఫ్‌ఐ సూచనలు, అభిప్రాయలను తీసుకోవాల్సిన మార్పులు ఆమెకు వివరించారు. అనంతరం ఆయన ఎపి భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ...మోడీ అధికారం చేపట్టిననాటి నుండి విద్య కాషాయీకరణ అమలుకు విధానాలను రూపొందిస్తున్నారని విమర్శించారు. బిజెపి పాలిత రాష్ట్రాల్లో హిందూత్వ భావాజలాన్ని పాఠ్యంశంగా చేర్చేందుకు విధానాలు వేగవంతం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవలి రాజస్థాన్‌లో 13 ఏళ్ల బాలికను అత్యాచారం చేసిన ఆశారాం బాపు జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చడం దారుణమని ధ్వజమెత్తారు.