ఆర్థిక సంక్షోభంలో ఏపీ..

అరకొర ఆదాయం! పెరుగుతున్న ఖర్చులు! కేంద్ర సాయం శూన్యం! నిధుల సర్దుబాటుకు తిప్పలు! తప్పని ఓవర్‌ డ్రాఫ్టులు! ఏపీ ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి ఇది! దీంతో నిధులు సర్దుబాటు చేయలేక ఆర్థిక శాఖాధికారులు తలపట్టుకుంటున్నారు. వారానికోసారి ఢిల్లీ వెళ్లి కేంద్రం నుంచి రావాల్సిన నిధుల కోసం చేస్తున్న ప్రయత్నాలు కూడా ఫలించడం లేదు. రూపాయి కూడా విదల్చకుండా చూద్దాం చేద్దాం అంటూ దాటవేస్తున్నారు. ఇక, బడ్జెట్‌లో పన్ను ఆదాయాన్ని రూ.3200 కోట్లుగా నిర్దేశించినా.. ఏ నెలా రూ.2800 కోట్లు మినహా రాలేదు. వసూలుకు, లక్ష్యానికి రూ.400 కోట్లు తేడా ఉంది. వచ్చే అరకొర ఆదాయాన్ని ఉద్యోగుల జీతాలు, పింఛన్లకే సర్దుబాటు చేయాల్సి వస్తోంది. డబ్బులు లేకపోవడంతో ఒక్క పని కూడా జరగడం లేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి త్రైమాసికానికి రూ.22 వేల కోట్లు రావాల్సి ఉండగా.. వసూలైంది 19700 కోట్లు మాత్రమే. ఇంకా లోటు 2300 కోట్లుగా ఉంది. తొలి త్రైమాసికానికి కేంద్రం నుంచి రూ.500 కోట్లు రావాల్సి ఉంటే.. ఇంతవరకూ ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదు. సీఎస్టీలో వాటా కూడా గత మార్చి వరకూ రావాల్సిన బకాయిలను పూర్తిగా చెల్లించలేదు. ఈ నేపథ్యంలోనే, వివిధ ప్రభుత్వ పథకాల అమలుకు రూ.4800 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుండడంతో ఆర్థిక శాఖాధికారులు ఓవర్‌ డ్రాప్టులకు వెళుతున్నారు. రిజర్వు బ్యాంకులో సెక్యూరిటీ బాండ్లను వేలం వేస్తున్నారు. వచ్చే ఆదాయానికి, ఖర్చులకు రూ.2000 కోట్ల లోటు ఉంటుండడంతో ప్రతి నెలా ఓడీలు, బాండ్ల విక్ర యం రూపంలో ఆ మొత్తాన్ని సమకూర్చుకోవాల్సి వస్తోంది. తొలి త్రైమాసికంలో వేస్‌ అండ్‌ మేన్స్‌, ఓడీ కింద తెచ్చుకున్న రుణం మొత్తం రూ.6500 కోట్లుగా లెక్క తేలింది.