ఆర్థిక మాంద్యం

             ఆర్థికపతనం మరోసారి సంభవించ నుందనే భయం ఆర్థికాభివృద్ధిని పెంపొందిం చాలంటే ప్రభుత్వాలు ద్రవ్య విధానపరమైన చొరవ తీసుకోవాలనే వాదనకు బలం చేకూరు స్తున్నది. కాని ప్రభుత్వాలు అటువంటి చర్యలు తీసుకోవటాన్ని ప్రపంచ ద్రవ్య పెట్టుబడి తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. తన ప్రయోజనాలకు విఘాతం కలగనంత వరకే ప్రభుత్వాలు అప్పులు చేయటాన్ని ద్రవ్య పెట్టుబడి అనుమతిస్తుంది.
ఈ మధ్యనే జరిగిన అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐ.ఎమ్‌.ఎఫ్‌), ప్రపంచబ్యాంకుల వార్షిక సమావేశం ముగిసిన తర్వాత వచ్చిన ఒకేఒక్క వార్త అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థను సంయుక్తంగా నిర్వహిస్తున్న నాయకులలో భిన్నాభిప్రాయాలు, గందరగోళం ఉన్నట్లు వెల్లడి చేసింది. మరొకసారి తీవ్రమైన మాంద్యంలోకి జారిపోతున్న ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పునరుజ్జీవింపచేయటానికి ప్రభుత్వాలు తిరిగి ఆర్థిక విధానపరమైన చర్యలు తీసుకోవటానికి తిరిగివెళ్ళాలా, లేక ద్రవ్య పరమైన చర్యలకే పరిమితం కావాలా అనే అంశానికి సంబంధించి నాయకుల మధ్య ఏకాభిప్రాయలేమి, స్థిరమైన ఆలోచన లేకపోవటం అనేది ప్రత్యేకంగా కనిపించింది.
           సంవత్సరాల తరబడి అనుసరించిన పరిమాణాత్మక సడలింపులు, అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ బాండ్లు కొనుగోలు చేయటంద్వారా ఆర్థిక వ్యవస్థలోకి పెద్ద మొత్తంలో డబ్బును ప్రవహింపచేయటం, ఇతర అభివృద్ధి చెందిన పెట్టుబడిదారీ దేశాల్లో కూడా ఇదే విధమైన చర్యలు తీసుకోవటం సంక్షోభానికి కారణమైన బ్యాంకులు తిరిగి లాభాలు సంపాదించటానికి దోహదం చేశాయి. కాని అది అంతే ముఖ్య మైన, అంతకన్నా ప్రాధాన్యత కల ఇతర సమస్యల పరిష్కారానికి దోహదం చేయలేదు. ఉదాహరణకు అది వినియోగదారులకు, ఇళ్ళ యజమానులకు రుణాలు అందించటానికి లేదా డిమాండ్‌ను పెంపొందించటానికి దారితీయలేదు. ఫలితంగా ద్రవ్య పెట్టుబడులు అభివృద్ధి చెందుతుంటే నిజ ఆర్థిక వ్యవస్ధ సంక్షోభంలో కూరుకుపోతున్నది. ఆర్థికవ్యవస్ధలోకి అదనంగా డబ్బును పంపే విధానం వలన ద్రవ్య లభ్యత విస్తృతం కావటంతో దేశాల సరిహద్దులను దాటి అభివృద్ధి చెందుతున్న దేశాల మార్కెట్లలోకి వెల్లువెత్తుతున్న పెట్టుబడులు ఈ దేశాలలో మారకం రేట్లను, ద్రవ్య నిర్వహణను కష్టతరం చేస్తున్నాయి. సంక్షోభం ఎదురైనపుడు ఈ విధానాలు తమ ద్రవ్య, ఆర్థిక మార్కెట్ల స్థిరత్వాన్ని దెబ్బతీస్తాయని వారు భయపడు తున్నారు. 
           ఫలితంగా కొత్తగా సంభవించబోతున్న ఆర్థిక దిగజారుడును అరికట్టాలంటే ఆర్థిక విధానాలపై ఎక్కువగా ఆధారపడాలని గతంలో కొద్దిమంది మాత్రమే అంగీకరించిన అంశం చుట్టూ ఇపుడు ఎక్కువమంది సమీకరించబడు తున్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు చెందిన, అంతర్జాతీయ ద్రవ్యనిది, ఐ.ఎమ్‌. ఎఫ్‌లలో సభ్యులైన , అత్యంత శక్తివంతమైన దేశాలున్న అంతర్జాతీయ ద్రవ్య వ్యవహారాలు, అభివృద్ధికి చెందిన ఇరవై నాలుగు దేశాల ప్రభుత్వాల ప్రతినిధులున్న గ్రూపు (జి.24) తన ప్రకటనలో ఈ విధంగా చెప్పింది: ''అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలలో దీర్ఘకాలం తక్కువ వడ్డీరేట్లున్నప్పటికీ స్థిరమైన ఆర్థికాభివృద్ధిని సాధించటం సాధ్యం కాలేదు. తీవ్రమైన వ్యవస్థాగత సంస్కరణలు, మౌలిక సదుపాయాల కల్పనలో పెట్టుబడులు పెట్టటంతో పాటు, ఆర్థికావసరాలకు అనుగుణమైన ద్రవ్య విధానాలను అనుసరించాల్సిన ఆవశ్యకతను ఇది తెలియజేస్తున్నది.'' ప్రకటనలో ఇంకా ఈ విధంగా చెప్పారు,

           ''విధ్వంసం సృష్టించే పెట్టు బడుల ప్రవాహాలు, అభివృద్ధి చెందిన పెద్ద ఆర్థిక వ్యవస్థలున్న దేశాలలోని స్థిరత్వంలేని ద్రవ్య విధానాల వలన ఏర్పడుతున్న ద్రవ్య మారకం రేట్లలో ఉత్తానపతనాలు తమను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. అందువలన రిజర్వు కరెన్సీని విడుదల చేసే దేశాలు అభివృద్ధి చెందుతున్నమార్కెట్‌ ఆర్ధిక వ్యవస్థలున్న, అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థికవ్యవస్ధలు ఎదుర్కొం టున్న సమస్యలు, ద్రవ్య ప్రవాహాలు ఈ దేశాలపై వేస్తున్న ప్రతికూల ప్రభావాలకు అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలున్న దేశాలలోని విధాన నిర్ణేతలు తగిన ప్రాధాన్యత నివ్వాలని విజ్ఞప్తి చేశారు. వారు తమ విధానాలను సమర్ధవంతంగా సమ న్వయం చేయటానికి తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు.'' 
కీన్స్‌ విధానాల వైపు చూపు
         ఇది కేవలం అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌ ఆర్థికవ్యవస్ధలున్న, అభివృద్ధి చెందు తున్న ఆర్థిక వ్యవస్థలున్న (ఇ.ఎమ్‌.డి.సి.) దేశాల అభిప్రాయం మాత్రమే కాదు. ఐ.ఎమ్‌.ఎఫ్‌. చీఫ్‌ ఎకనామిక్‌ కౌన్సిలర్‌ ఆలీవర్‌ బ్రాన్‌కార్డ్‌ ఈమధ్య వరల్డ్‌ ఎకనామిక్‌ అవుట్‌లుక్‌ పత్రికకు రాసిన ముందుమాటలో ఇదే విషయాన్ని చెప్పాడు. ''యూరో ప్రాంతంలో జరుగుతున్న బలహీనమైన అభివృద్ధి ద్రవ్య విధానానికి సంబంధించి నూతన చర్చకు దారితీస్తున్నది. సావరిన్‌ బాండ్లు తగ్గటం ద్రవ్య స్థిరత్వం కోసం గత కొంతకాలంగా తీసుకుంటున్న చర్యలు ప్రస్తుతం అనుసరిస్తున్న ద్రవ్య విధానాలు సరైనవేననే విశ్వాసాన్ని ద్రవ్య పెట్టుబడిదారులలో పెంచాయి. ఎంతో పణం గా పెట్టి సాధించిన ఈ ప్రతిష్ఠను ప్రమాదంలో పడనివ్వరాదు. దీని అర్ధం ఆర్థికాభివృద్ధి అవసరాలకు తగినట్లుగా ద్రవ్య విధానాన్ని వినియోగించుకోరాదని కాదు. చాప్టర్‌ 3లో మేము చెప్పినట్లుగా, ఉదాహరణకు మౌలిక సదుపాయాల అభివృద్ధిని అప్పు చేయటంద్వారా సాధించినప్పటికీ అది సరైనదే. అది తక్షణమే డిమాండ్‌ను పెంచటానికి, మధ్యకాలికంగా సరఫరాను పెంచటానికి ఉపయోగపడుతుంది. ఆర్థికాభివృద్ధి స్థంభించిపోతే ఇంకా తీవ్రమైన చర్యలు తీసుకోవటానికి కూడా సిద్ధంగా ఉండాలి''. ఆర్థికాభివృద్ధి సాధించటంకోసం ప్రభు త్వాలు లోటు బడ్జెట్లతో ఖర్చు చేయకూడదని దృఢంగా చెబుతున్న సంస్థ యొక్క ప్రముఖ ఆర్థికవేత్త వ్యవస్థాగత సంస్కరణలు చేయమని చెప్పటం ప్రత్యామ్నాయ విధానాలకు పెద్ద రాయి తీని ఇవ్వటమే. పొదుపు చర్యలు చేపట్టాలని, ఆర్థికవ్యవస్ధలపై కంట్రోళ్ళను తొలగించాలని, లేబర్‌ మార్కెట్లను సరళీక రించాలనే విధానాలను అమలుజరపాలని చెబుతున్న సంస్థ ప్రతినిధి అవసరమైతే ప్రభుత్వాలు ప్రత్యామ్నాయ విధానాలను అమలు జరపాలని చెబుతున్నాడు.
         వాషింగ్టన్‌ డి.సి.లో జరిగిన ఐ.ఎమ్‌. ఎఫ్‌. గవర్నింగ్‌ బాడీ వార్షిక సమావేశంలో పాల్గన్న ప్రతినిధులలో కొందరు 'ఐ.ఎమ్‌. ఎఫ్‌.ఎక్కువ డబ్బు ఖర్చుపెట్టటానికి అధిక ప్రాధా న్యత ఇస్తూ సంస్కరణలకు తక్కువ ప్రాధాన్యత ఇస్తున్నదన్న వాస్తవాన్ని చెబుతూ ఆశాభంగాన్ని వ్యక్తం చేసినట్లు ఫైనాన్షియల్‌ టైమ్స్‌ (అక్టోబరు,13,2014)రిపోర్టు చేసింది. 'ఇదే అభిప్రాయాన్ని బలపరుస్తూ బ్రిటన్‌ ఖజానా ఛాన్సలర్‌ జార్జ్‌ వోస్‌బర్న్‌ ఐ.ఎమ్‌.ఎఫ్‌. చెబుతున్న అనిశ్చిత ద్రవ్య విధానం పట్ల తనకు సందేహాలు ఉన్నట్లు చెప్పాడని రిపోర్టు చేశారు. నిజ ఆర్థికవ్యవస్ధ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించటంలో ద్రవ్య విధానం సుదీర్ఘకాలం పాటు విఫలం అయినప్పటికీ, మాంద్యంలో చిక్కుకున్న పెట్టుబడిదారీ వ్యవస్ధను అభివృద్ధి పథంలోకి తీసుకురావటానికి ప్రభుత్వం సానుకూలపాత్ర నిర్వహించాలని కీన్స్‌ చెప్పిన అంశాన్ని గట్టిగా వ్యతిరేకిస్తూ, ద్రవ్య పెట్టుబడి ప్రయోజనాలను కాపాడేవారి నోళ్ళు మూయించలేని స్థితే ఉంది. 
ఈ విధమైన స్తబ్దత కొనసాగటం మంచిది కాదు. ద్రవ్య సంక్షోభం బట్టబయలై మహా మాంద్యానికి ప్రారంభం అయిన సెప్టెంబరు 15, 2008న చాప్టర్‌ 11 ప్రకారం లేV్‌ామాన్‌ బ్రదర్స్‌ దివాళా పిటీ షన్‌ దాఖలు చేసి ఆరు సంవత్సరాలకు పైగా కాలం గడిచిపోయింది. అయినప్పటికీ తన వరల్డ్‌ ఎకనామిక్‌ అవుట్‌లుక్‌ అక్టోబరు, 2014 సంచికలో ఐ.ఎమ్‌.ఎఫ్‌. ప్రపంచ ఆర్థికాభివృద్ధి సాధారణంగా ఉంటుందని ప్రకటిస్తూ, అభి వృద్ధిపై తన అంచనాను మరోసారి అధో ముఖంగా సవరించింది. బలమైన ఆర్థికాభి వృద్ధిని సాధించటానికి 'నూతన మార్గాల కోసం' ఐదు సంవత్సరాల నుండి జరుగుతున్న అన్వేషణ నిష్ప్రయోజనంగానే ఉండిపోయింది. 
         మాంద్యం ప్రారంభమయిన సంవత్సరం తర్వాత అనేక అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌ ఆర్ధికవ్యవస్థలున్న దేశాలు, (ముఖ్యంగా ఆసియా లో ఉన్న దేశాలు) జర్మనీ లాంటి కొన్ని అభివృద్ధి చెందిన దేశాలు కొద్ది మేరకు పెరుగు దలను సాధించాయి. ప్రపంచవ్యా పితంగా అన్ని దేశాలు ఐక్యంగా, ఒక పద్ధతి ప్రకారం ఖర్చును పెంచటం, పన్నులు తగ్గించటం బెయిల్‌ అవుట్‌ ప్యాకేజీలివ్వటం, ద్రవ్య లభ్యతను పెంచటం తదితరాలు ఆర్ధిక సంక్షోభ ప్రభావాల్ని పాక్షికం గా పరిహరించి, తిరిగి అభివృద్ధిని సాధిస్తామనే విశ్వాసాన్ని కలిగించాయి. అమెరికాలో ఆర్థికం గా కోలుకోవటం బలహీనంగానే ఉన్నప్పటికీ మాంద్యం నుండి బయటపడుతున్న సూచనలు అక్కడా కనిపిస్తున్నాయి. తీవ్రంగా ఆందోళన కలిగిస్తూ, సంక్షోభంలో ఉన్న ప్రాంతం యూరోపి యన్‌ యూనియన్‌, ఆ ప్రాంత దేశాలు. అయిన ప్పటికీ ఆ ప్రాంతంలో కూడా జర్మనీ సాధిస్తున్న అభివృద్ధి సంతోషానికి కారణం అవుతున్నది.
తలక్రిందులవుతున్న భవిష్యత్‌ అంచనాలు
మొత్తంగా చూసినపుడు ప్రపంచ ఆర్థికాభివృద్ధి భిన్నమైన మార్గాలలో సాగుతు న్నదని స్పష్టం అవుతున్నది. అభివృద్ధి చెందుతున్న ఆర్థికవ్యవస్ధలున్న దేశాలు, జర్మనీ వేగంగా అభివృద్ధిని సాధిస్తుండగా అమెరికా కొంత మేరకు అభివృద్ధిని సాధిస్తుండగా, జర్మనీని మినహాయించి మిగిలిన యూరప్‌ దేశాల అభివృద్ధి నిరాశాజ నకంగా ఉంది. కాబట్టి క్లిష్ట పరిస్ధితిని అధిగ మించటానికి అధిక అభివృద్ధిని సాధిస్తున్న దేశాలు ప్రపంచ ఆర్ధికవ్యవస్ధను మాంద్యం నుండి గట్టెక్కిస్తాయనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అనేక ప్రశ్నలు ఈ ఆశావహ దృక్పథాన్ని సవాలు చేస్తున్నాయి. మొదటిది యూరప్‌లో సంక్షోభం తీవ్రంగా ఉండటమేకాక, అది జర్మనీ అభివృద్ధిపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నది. ఇతరచోట్ల, ముఖ్యంగా యూరప్‌లో ఆర్థికాభివృద్ధి నిదానంగా సాగటం వలన ఎగుమతులు తగ్గి, జర్మన్‌ ఆర్థికవ్యవస్ధ కూడా మాంద్యపు అంచులకు చేరింది. రెండవ అంశం అమెరికా, బ్రిటన్‌లలో మాంద్యపు తీవ్ర దశ నాటికన్నా మెరుగైన అభివృద్ధి జరిగినప్పటికీ పూర్తిస్ధాయిలో కోలుకోలేదు. అంచనాలకు తగిన విధంగా అభివృద్ధి జరగలేదు. చివరి అంశం వేగంగా అభివృద్ధి సాధిస్తున్న మార్కెట్‌ ఆర్ధికవ్యవ స్ధలున్న దేశాలు మిగతా దేశాలను మాంద్యం నుండి బయటికి లాగటానికి ఇంజన్లలాగా పని చేయటానికి మారుగా, ఇతరదేశాలలోని మాంద్యానికి బలిపశువులుగా మారుతున్నాయి. చైనా, భారతదేశాలలో పెరుగుదల తగ్గగా, బ్రెజిల్‌ లాంటి దేశాలలో తీవ్రంగా కుంచించు కుపోతున్నది. చైనా వార్షికాభివృద్ధి రేటు 2014 రెండవ త్రైమాసికలో 7.5 శాతం ఉండగా మూడో త్రైమాసికలో 6.8 శాతానికి దిగజారు తుందని భావిస్తున్నారు. బ్రెజిల్‌ గత సంవత్సరం 2.5శాతం అభివృద్ధిని సాధించగా, ఈ సంవత్స రం 0.3 శాతం అభివృద్ధి మాత్రమే ఉంటుందని అంచనా వేస్తున్నారు.
          సంక్షోభం అనంతరం పుంజుకుంటు న్న క్రమం వేగంగా వెనుకపట్టు పట్టటానికి అభివృద్ధి చెందిన దేశాల ప్రభుత్వాలు, అంతర్జా తీయ ఆర్థికసంస్ధలు అనుసరించిన విధానాలలో మార్పులే కారణం. మొదటగా సంక్షోభం ప్రారం భం కాగానే ప్రపంచవ్యాపితంగా ప్రభుత్వాలు మాంద్యాన్ని నిలువరించటానికి, వెనక్కుకొట్టటా నికి ద్రవ్యపరమైన, ఆర్థిక పరమైన చర్యలు తీసుకున్నాయి. బ్యాంకులు, ద్రవ్యసంస్ధల ఖాతా పుస్తకాలలో ఉండి, వత్తిడికి గురిచేస్తున్న, లేక ఏమాత్రం విలువలేని ఆస్తులను కొనుగోలు చేసి, వాటికి చౌకగా రుణాలు అందించటానికి వ్యవస్థ లోకి పెద్ద మొత్తంలో ద్రవ్యాన్ని ప్రవహింప చేశారు. ప్రభుత్వం ఖర్చు పెట్టటం, ప్రైవేటు సంస్థలు ఖర్చుపెట్టటానికి ప్రోత్సాహకాలివ్వటం ఈ విధానంలో ముఖ్యమైనవి. ఇందుకోసం బడ్జెట్ల నుండి నిధులను కేటాయించారు. మాంద్యంలో పన్నులను పెంచలేదు కాబట్టి అనేక దేశాలలో ద్రవ్యలోటు పెరిగి, జి.డి.పి. ప్రభుత్వ రుణ నిష్పత్తి పెరిగింది. ఈ అంశాన్ని తగిన సమయం లో పరిష్కరించాల్సివుంది. అవసరమైన ఫలితా లొచ్చేవరకూ ఆ విధానాలను కొనసాగించలేదు. ద్రవ్య పెట్టుబడులకు అవసరమైన మేరకు మాత్రమే ఆ విధానాలను కొనసాగనిచ్చారు. 
ద్రవ్యపరమైన చర్యలలో భాగంగా బ్యాంకులు దివాళా తీయకుండా, వాటి చెల్లింపుల సామార్ధ్యాన్ని నిలబెట్టేందుకు ప్రభు త్వాలు బ్యాంకుల నుండి తీసుకున్న రుణాలతోనే వాటి షేర్లను కొని, సంక్షోభం నుండి బ్యాంకులను బయటపడవేశాయి. ఒకసారి ఇది జరిగిన తర్వాత పెద్దమొత్తంలో ప్రభుత్వాలకు రుణాలి చ్చివున్న బ్యాంకులు ప్రభుత్వ రుణాలు, జి.డి. పి.నిష్పత్తి ప్రభుత్వాల చెల్లింపుల సామర్ధ్యానికి ప్రమాదం కలిగించే స్ధాయికి చేరాయనే పేరుతో ప్రభుత్వాలు మరింతగా రుణాలు తీసుకోవటాన్ని వ్యతిరేకించాయి. బ్యాంకుల చెల్లింపుల సామ ర్ధ్యాన్ని నిలబెట్టటానికి ప్రభుత్వాలు అప్పులు చేయటాన్ని స్వాగతించాయి. కానీ ఆర్థికమాం ద్యం నుండి బయటపడి ఆర్థికాభివృద్ధి సాధించ టానికి ప్రభుత్వాలు అప్పులు చేయటానికి అగీకరించలేదు.
పరస్పర విరుద్ధమైన ఈ చర్యల వెనుక వున్న పాక్షిక దృక్పధం స్పష్టంగా అర్ధమౌతున్నది. జి.డి.పి., ప్రభుత్వ రుణాల నిష్పత్తి పెరుగు తున్నపుడు ద్రవ్యసంస్ధల నుండి కేంద్రబ్యాంకులు కొనుగోలు చేసిన ఏమాత్రం విలువలేని ఆస్తులకు కొంత మార్కెట్‌ విలువను కల్పించటానికి, ప్రపంచవ్యాపితంగా పెట్టుబడులు పెట్టి లాభాలు సంపాదించటం కోసం బ్యాంకులకు చౌకగా, విస్తారంగా ద్రవ్యాన్ని అందుబాటులో ఉంచటా నికి ఈ విధానాలను ఆమోదించారు. ఉదాహ రణకు ఫెడరల్‌ రిజర్వ్‌ ఆస్తులు, ఆదాయాల పట్టికలో ఉన్న ఆస్తులు గానీ, ద్రవ్య సంస్థల నుండి కొనుగోలు చేసినవి గానీ 2008లో 800 శతకోటి (బిలియన్‌) డాలర్లుండగా, ఈ మధ 4 లక్షకోట్ల (ట్రిలియన్‌) డాలర్లకు పైగా పెరిగాయి. ఇది ద్రవ్య పెట్టుబడుల ప్రయోజ నాలకు ఉపయోగపడుతుంది కాబట్టి వారికి సమస్యగా కనిపించలేదు. ప్రభుత్వ రుణం పెరగటం వారి ప్రయోజనాలకు విరుద్ధం కాబట్టి దానిని సమస్యగా చేస్తున్నారు.
ప్రభుత్వం అప్పులు చేసి ప్రజావసరాల కోసం ఖర్చు పెట్టటం కొత్తకాదని, 1990వ దశాబ్దంలో, సంక్షోభానికి ముందు 2000 దశాబ్దంలో కూడా ఉందని వాదించేవారున్నారు. ఆ సమయంలో కార్మికుల వేతనాలు తక్కువగా ఉన్నప్పటికీ, వారి వినియోగానికి, ఇళ్ళు కొను గోలు చేయటానికి రుణాలు లభించాయి కాబట్టి మార్కెట్‌లో డిమాండ్‌ తగ్గలేదు.
          పెరుగుదలను తగ్గకుండా చూడటానికి అప్పులు చేయటం ద్వారా ప్రభుత్వం పెడుతున్న ఖర్చుకు ప్రత్యామ్నాయంగా ప్రైవేటు ఖర్చు పెంచటానికి రుణాలిచ్చారు. ఆ విధమైన రుణభారాన్ని భరించలేకే సంక్షోభం వచ్చిందని రుజువవుతున్నది. ఇపుడు గృహస్థుల ఖాతాలలో రుణాలు పెరిగిపోవటంతో వారికి అదనంగా రుణాలివ్వటానికి బ్యాంకులు సిద్ధపడటంలేదు. గృహస్థులు కూడా ఇంకా అప్పులు చేయటానికి సిద్ధంగా లేరు. ఇటువంటి పరిస్ధితులలో పెరుగుదల సాధించటానికి గృహస్థులను మరింత రుణగ్రస్థులుగా చేయటం కాకుండా, వారి ఆదాయాలను పెంచి, రుణభారాన్ని తగ్గించే చర్యలు తీసుకోవాలి. ఈ విధంగా రుణాలివ్వటం ద్వారా ప్రైవేటు వినియోగాన్ని పెంచటం కాకుం డా, ఇతర చర్యలు కూడా తప్పనిసరిగా అటువంటి పెరుగుదలను సాధిస్తాయి. కాబట్టే రుణాలు చేయటం ద్వారా ప్రభుత్వ ఖర్చును పెంచటం తప్పనిసరి అవుతున్నది.
          ఈ విధమైన ప్రభుత్వ ఖర్చును వ్యతిరే కిస్తూ, తేలికగా లాభాలు సంపాదించటం కోసం ఏ విధమైన ఆంక్షలు లేకుండా వస్తున్న ద్రవ్య పెట్టుబడుల ప్రవాహం వల్లనే ద్రవ్య సంక్షోభం ప్రారంభమై, అది మహా మాంద్యానికి దారితీసిం ది. ప్రస్తుతం మనం ఒక విచిత్రమైన పరిస్ధితిలో ఉన్నాం. సంక్షోభానికి కారణమైన ద్రవ్యపెట్టుబడు లు తిరిగి లాభాలు సంపాదిస్తూ అభివృద్ధి చెందు తుండగా, నిజ ఆర్థికవ్యవస్థ, మొత్తం వ్యవస్థ మాంద్యంలోనే కూరుకుపోయివుంది. ఆంక్షలు తొలగించటం, ఆ తర్వాత ద్రవ్య పెట్టుబడులు విస్తృతంగా విస్తరించి, తద్వారా లభించిన అపార మైన శక్తితో మిగిలిన వాటన్నింటినీ నష్టపెట్టటం ద్వారా ప్రతిదానిని తనకు అనుకూలంగా మలచుకున్నది. ఆ విధమైన శక్తిని సవాల్‌ చేయ నంతవరకు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఆర్థిక అభివృద్ధి సాధ్యం కాకపోవటంతో ఐ.ఎమ్‌.ఎఫ్‌. తన పెరుగుదల అంచనాలను నిర్ధిష్టకాలంలో తగ్గించాల్సిన పరిస్ధితులకు నెట్టబడుతున్నది. వాస్తవానికి మనం మరో మాంద్యాన్ని ఎదుర్కోబోతున్నాం.