ఆర్థిక పతనం..

విదేశీ పెట్టుబడుల కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాలికి బలపం కట్టుకుని విదేశాలు తిరుగుతుంటే దేశంలో ఆర్థిక వ్యవస్థ రోజురోజుకూ క్షీణిస్తున్నట్లు వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. వార్షిక వినిమయ ద్రవ్యోల్బణం వరుసగా మూడో మాసం పెరిగి అక్టోబర్‌లో 5.0 శాతానికి చేరుకుంది. రిటైల్‌ ఆహార ద్రవ్యోల్బణం మరింత పెరిగి 5.25 శాతానికి చేరింది. పారిశ్రామికోత్పత్తి ఆగస్టులో 6.3 శాతంతో పోలిస్తే సెప్టెంబర్‌లో 3.6 శాతానికి తగ్గింది. ఇవన్నీ ప్రభుత్వం గురువారం నాడు విడుదల చేసిన లెక్కలు. ప్రపంచానికి భారత దేశ ఆర్థిక వ్యవస్థ ఆశాదీపం అని బ్రిటన్‌లో ప్రధాని ఊదరగొడుతున్న సమయంలోనే దేశంలో ఈ లెక్కలు వెలువడడం ఇంట్లో ఈగల మోత, వీధిలో పల్లకీల మోత అన్న సామెతను గుర్తుకు తెస్తోంది. విదేశీ పెట్టుబడులు భారత దేశంలోకి ప్రవాహంలా వస్తాయన్న ఆశతో దేశంలోని పలు కీలక రంగాల్లో ఎఫ్‌డిఐలకు పరిమితులు ఎత్తివేసిన ఆనందంలో బొంబాయి స్టాక్‌ ఎక్ఛేంజ్‌ దీపావళీ ముహురత్‌ ట్రేడింగ్‌లో 200 పాయింట్లు పెరిగిన మరునాడే అంతకు మించి 256 పాయింట్లు పడిపోయింది. గత రెండు వారాలుగా పడిపోతూ వస్తున్న స్టాక్‌ మార్కెట్లకు దీపావళి అనందం ఒక్క రోజుతోనే ఆవిరైపోయింది. మోడీ ప్రభుత్వం మరిన్ని సంస్కరణలు చేపడితే దేశ ఆర్థికాభివృద్ధి రాకెట్‌లా దూసుకుపోతుందనీ, చైనా జిడిపీ పెరుగుదలను మించిపోతుందనీ అంతర్జాతీయ ఫైనాన్స్‌ సంస్థలు ఇటీవల కాలంలో ఊదరగొడుతున్నాయి. కానీ సెప్టెంబర్‌ మాసంలో మన దేశ ఎగుమతులు గత ఏడాది ఇదే మాసంతో పోలిస్తే ఏకంగా నాలుగో వంతు పడిపోయాయి. ఎగుమతులు పడిపోవడం వరుసగా ఇది పదో నెల. దిగుమతులు కూడా అదే మోతాదులో పడిపోవడాన్ని బట్టి దేశ ఆర్థిక వ్యవస్థ కుంచించుకుపోతున్నదని అర్ధమవుతోంది. మోడీ ప్రభుత్వం 'మేక్‌ ఇన్‌ ఇండియా' నినాదం కూడా పనిచేయడం లేదని సెప్టెంబర్‌ నెల ఉత్పాదకరంగం గణాంకాలు తెలియజేస్తున్నాయి. సెప్టెంబర్‌లో దేశ ఉత్పాదక రంగం ఏడుమాసాల దిగువకు పడిపోయిందని నిక్కీ సర్వే తెలియజేసింది. దేశంలో వర్షాభావ పరిస్థితులు, ఇతర కారణాల వల్ల వ్యవసాయ రంగంలో అభివృద్ధి కుంటుపడింది. 
ఈ ఏడాది దేశ జిడిపి 8.5 శాతం పెరిగి చైనాను మించి పోతుందని చెప్పారు. తరువాత దాన్ని 8 శాతానికి తగ్గించారు. కానీ జూన్‌తో ముగిసే త్రైమాసికానికి 7 శాతం జిడిపి పెరుగుదల చూసి రిజర్వు బ్యాంకు వార్షిక అంచనాలను 7.4 శాతానికి తగ్గించింది. దేశ ఆర్థిక వ్యవస్థ ఇలాగే నడిస్తే ప్రమాదంలో పడుతుందని రిజర్వు బ్యాంకు గవర్నర్‌గారే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ ఉరకలు పరుగులేస్తుంటే ఆనందమే గానీ నిత్యం ఉత్ప్రేరకాలిచ్చి పరుగులు తీయించాలని చూడ్డంవల్ల మొదటికే మోసం వస్తుంది. భారత ఆర్థిక వ్యవస్థను నయా-ఉదారవాద ఉచ్చులోకి తోసిన బిజెపీ, కాంగ్రెస్‌ విధానాలు దేశానికి ఎంత ప్రమాదకరంగా మారాయో నేటి మన ఆర్థిక దుస్థితి తెలియజేస్తోంది. ఈ విధానాలు ఒకవైపు ప్రజలపై మోయలేని భారాలు వేస్తున్నాయి. ఆర్థిక అసమానతలు పెంచుతున్నాయి. విస్తారమైన ప్రజల కొనుగోలు శక్తిని దెబ్బతీస్తున్నాయి. మరోవైపు కార్పొరేట్లకు మాత్రం లాభాల పంట పండిస్తున్నాయి.
ఒకప్పుడు విదేశీ పెట్టుబడులను విపరీతంగా ఆకర్షించి, ఎగుమతులు చేసి జిడిపిని రెండంకెల్లో పరుగులెత్తించిన చైనా నేటి అంతర్జాతీయ పరిస్థితుల్లో జిడిపి పెరుగుదల రేటును 7 శాతానికి తగ్గించుకుంది. ఎగుమతులపై ఆధారపడకుండా అంతర్గత గిరాకీ పెంచుకోడానికి ప్రయత్నిస్తోంది. ప్రజల ఆదాయాలను అయిదేళ్లలో మూడు రెట్లు పెంచడానికి చైనా కమ్యూనిస్టు పార్టీ తీసుకున్న నిర్ణయంమేరకు అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రజల ప్రయోజనాలకోసం పనిచేసే ప్రజా ప్రభుత్వం చేసే పని అది. కానీ మన దేశంలో ఎన్డీఎ ప్రభుత్వంగానీ, గతంలో యూపిఎ ప్రభుత్వం గానీ ప్రజల ప్రయోజనాలకోసం కాకుండా స్వదేశీ, విదేశీ కార్పొరేట్ల ప్రయోజనాలకోసం పనిచేస్తున్నాయి గనుకనే సంస్కరణల పేరుతో దేశప్రజలపై మరిన్ని భారాలు వేస్తున్నాయి. విదేశీ పెట్టుబడుల కోసం మరిన్ని సంస్కరణలు చేపట్టడమంటే కార్మిక వర్గంపైనా ప్రజలపైనా మరింతగా భారాలు వేయడమే. నయా-ఉదారవాద విధానాలు ఇప్పటికే మన వ్యవసాయ రంగాన్ని దివాళా తీయించాయి. రైతు ఆత్మహత్యలు నిత్యకృత్యమైనాయి. ట్రాన్స్‌ పసిఫిక్‌ పార్ట్‌నర్షిప్‌ పేరుతో ఇటీవల భారత దేశం అమెరికా, జపాన్‌, మరో 10 పసిఫిక్‌ దేశాలతో కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వల్ల మన దేశ ఎగుమతులు మరింతగా తగ్గిపోయే ప్రమాదం ఏర్పడింది. విదేశీ ఎగుమతులు తగ్గడంతోబాటు, ప్రభుత్వ విధానాల వల్ల దేశవాళీ గిరాకీ తగ్గి పరిశ్రమలు పెద్దఎత్తున మూతపడుతున్నాయి. దాంతో నిరుద్యోగం తీవ్రరూపం దాలుస్తోంది. నిరుద్యోగ యువత ఊరికే ఉండరు. విశ్ఛిన్నకర, వేర్పాటువాద ఉద్యమాలకు ఇంధనంగా మారుతారు. ఇప్పటికే దేశంలో అటువంటి అశాంతి తలెత్తుతోంది. పాలకుల విధానాలు మారకుండా నరేంద్ర మోడీ లాంటివారు ఎన్ని ప్రగల్బాలు పలికినా పరిస్థితిని మార్చలేరు.