ఆర్థిక నేరగాళ్లపై ఆంక్షలుండవా..?

దేశంలో గతంలో ఎన్న డూ కనీవినీ ఎరుగని రీతిలో బ్యాంకులు కొంత ఆర్థిక ఒడిదు డుకులకు గురవుతు న్నాయా..? అంటే అవుననే అనిపిస్తుంది. బ్యాంకుల ఆర్థిక మూలాలను దెబ్బ తీసిందెవరు...? దేశంలో పేదలు నమ్మకంతో తమ కష్టార్జితాన్ని దాచుకునే బ్యాంకులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటే పరిస్థితేంటి...? అనే చర్చ ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్న అంశం. పెట్టు బడిదారులు తమ అవసరాలకు బ్యాంకుల వద్ద అప్పులు తీసుకుని తీరా వారు చేపట్టిన సంస్థలు అప్పుల పాలయ్యాయని ఎగవేత దారులుగా మారుతున్నారు. 'భారతదేశంలో పరిశ్రమలు పెట్టండి, అనేక విధాలుగా ప్రోత్సాహకాలు అందిస్తాం. భూమి, విద్యుత్‌, మౌలిక సదుపాయాల కల్పన బాధ్యత మాదే' అంటూ ఊదర గొడుతూ దేశదేశాలు పట్టుకు తిరుగుతున్న మన పాలకులు ఇక్కడి పరిస్థితులపై పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తు న్నారు. విదేశాల నుంచి వచ్చే పారిశ్రామికవేత్తలకు ఎక్కడ లేని తాయిలాలు ప్రకటిస్తూ, ఇక్కడ వేలాది కోట్లు అప్పులు ఎగ్గొట్టిన ఆర్థిక దొంగలకు మాత్రం గొడుగు పడుతూ వారిని కాపాడే యత్నాలు చేస్తున్నారు. అందుకే బ్యాంకులు ఆర్థిక నేరగాళ్ళను దేశం వదిలి పోకుండా చూడండంటే వారిని దర్జాగా విమానా లెక్కించి విదేశాలకు పంపిస్తున్నారు.
అన్నదాత ఆరు గాలం కష్టపడి పంట పండిస్తాడు. దేశానికి అన్నం పెడతాడు. తాను కష్టాల పాలవుతూ, కష్ట కాలంలో తరతరాలుగా నమ్ముకున్న భూములమ్మి అప్పులు చెల్లిస్తాడు. తనకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా సాగుభూమినే నమ్ముకుని సాగుచేస్తాడు. సాధ్యమైనంత వరకూ నష్టాలు భరిస్తాడు. ఒక వైపు నకిలీ విత్తనాలు, మరోవైపు నకిలీ పురుగు మందులు, నియంత్రణ లేని ఎరువుల ధరలు, నానాటికీ తగ్గిపోతున్న వ్యవసాయ ఉత్పత్తుల ధరలు ఇలా అనేక విధాలుగా నష్టాలను అనుభవిస్తున్నాడు రైతు. కానీ, అప్పులు పెరిగిపోతే భూమితో పాటు కాడెడ్లు సైతం నిలువునా అమ్మి అప్పులు చెల్లిస్తాడు. ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులు అంతకంతకు పెరిగిపోయి తలకు మించిన భారం అయితే చివరకు అప్పులు ఇచ్చిన వారికి సమాధానం చెప్పలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇవీ రైతుల ఆత్మహత్యల వెనుక ఉన్న అసలు వాస్తవాలు. కానీ మన పాలకులకు ఇవేవీ కనిపించడంలేదు. ఒక రైతు తాను భూమి తాకట్టు పెట్టి తెచ్చిన అప్పులకు బ్యాంకులు నిలబెట్టి వసూళ్లు చేస్తున్నాయి. బ్యాంకులు అంతగా పట్టుబట్టి వసూలు చేసినా రైతులు చెల్లించాల్సింది రూ.1 లక్ష లోపే ఉంటుంది. కొన్ని జాతీయ బ్యాంకుల ఆర్థిక పరిస్థితి ప్రస్తుతం ఇబ్బందికరంగా ఉందనే చర్చ జరుగుతోంది. దేశంలోని దాదాపు 78 శాతం పేదలు తాము కష్టపడి సంపాదించిన పైసాపైసా బ్యాంకుల్లో దాచుకుంటారు. వారి డబ్బుతోనే ఆయా బ్యాంకులు వ్యాపారులకు అప్పులిచ్చి నెలనెలా వడ్డీతో సహా వసూలు చేస్తుంటాయి. అయితే స్వయం ఉపాధి పథకం కింద ఒక నిరుద్యోగికి బ్యాంకు కాస్తంత డబ్బు ఇచ్చేటప్పుడు అనేక విధాల ఆంక్షలు విధించి, చదువుకున్న సర్టిఫికెట్లు కుదువపెట్టుకుని, ఓ ప్రభుత్వ ఉద్యోగి జామీను తీసుకుని రుణాన్నిస్తాయి. ఒక రైతుకు రుణం మంజూరు చేయాలంటే మాత్రం బ్యాంకర్లు ఉన్న పొలాన్ని తాకట్టు పెట్టుకుని, కొంత బ్యాంకులో డిపాజిట్‌ చేయించుకుంటారు. రుణం మంజూరు చేసిందే తడవుగా ప్రతి నెలా క్రమం తప్పకుండా వాయిదాలు వసూలు చేస్తారు. ఏ ఒక్క నెల కిస్తీ చెల్లించక పోయినా ఇంటి ముందు కూర్చుని రైతు ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తారు. కానీ నేడు దేశంలో ఇంత పటిష్టంగా ఉండాల్సిన బ్యాంకులు ఎందుకు ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డాయి. జాతీయ బ్యాంకులు అప్పులపాలుకావడానికి కారణాలు ఏమై ఉండొచ్చుననే చర్చ దేశవ్యాప్తంగా సాగుతోంది. బ్యాంకర్లు కమిషన్లకు కక్కుర్తిపడటం ఒక ఎత్తయితే, వివిధ బడా కంపెనీలకు రుణాలు ఇచ్చేటప్పుడు రైతులకు, నిరుద్యోగులకు ఇచ్చేటప్పుడు అవలంబించే పద్ధతులు అవలంబించకపోవడం వారికి కలిసొస్తోంది.
కానీ దేశంలో గత మూడేళ్ళుగా ఆర్థిక నేరగాళ్ళు యథే చ్ఛగా తమ అక్రమ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. వీరిపై మాత్రం ఎలాంటి ఆంక్షలూ విధించరు. నాడు రూ.4 వేల కోట్లు కొల్లగొట్టిన కేటుగాడు ఐపిల్‌ మాజీ ఛైర్మన్‌ లలిత్‌ మోడీ దేశం వీడి పారిపోవడానికి కారకులెవరో దేశ ప్రజలందరికీ తెలుసు. అతనికి స్వయంగా ఓ కేంద్ర మంత్రి సిఫారసుతోనే వీసా ఏర్పాటు చేసినట్టు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. నేడు రూ.9,500 కోట్ల బ్యాంకు రుణాలు ఎగ్గొట్టిన కింగ్‌ఫిషర్‌ సంస్థ వ్యాపారి విజరు మాల్యా దేశం విడిచి పోవడానికి కారుకులెవరు? ఒక పక్క బ్యాంకులు పదే పదే తమకు వేల కోట్లు ఎగనామం పెట్టాడని, అతనిని దేశం వీడిపోకుండా చూడాలని చేసిన విన్నపాలను పట్టించుకున్న వారెవరు? అందుకే అన్నంపెట్టే అన్నదాతపైనా, ఉన్నత చదువులు చదివి నిరుద్యోగంతో అలమటిస్తున్న విద్యావంతు లకు ఇచ్చే రుణాలపై ఉన్న ఆంక్షలు మాత్రం ఆర్థిక నేరగాళ్ళపై ఉండవు. ఇదీ భారత దేశంలో ఆర్థిక దోపిడీదారులకు ఇచ్చే ప్రోత్సాహం.
ఇటీవల కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ ఒక కీలకమైన ప్రకటన చేశారు. అదే 'ఫెయిర్‌ అండ్‌ లవ్లీ' పథకం. పన్ను ఎగవేత దారులు, నల్లధనం ఉన్నవారు, అక్రమ వ్యాపారులు, మాఫియాలకు ఈ పథకం వరప్రదాయనిగా ఉంటుందని చెప్పేదే అది. ఆర్థిక నేరగాళ్ళు పుట్టగొడుగుల్లా పుట్టుకురావడానికి మన పాలకులు అమలు చేస్తున్న ఉదారవాద విధానాలే కారణమని ఆర్థిక విశ్లేషకులు చెబుతున్నారు. కోట్లకు కోట్లు బ్యాంకుల వద్ద అప్పుల రూపంలో దిగమింగి ఎంచక్కా విదేశాల్లో జల్సా చేస్తున్న కేటుగాళ్ళపై చర్యలు తీసుకునేందుకు ఎందుకు తాత్సారం చేస్తున్నారు? స్వంత ఆస్తులు లేవంటూ బినామీల పేరున దాచిన పెట్టు బడులతో వారు మాత్రం కులాసాగా కాలం గడుపుతున్నారు. మొన్న లలిత్‌మోడీ, నేడు విజరు మాల్యా ఇలా ఎందరు కేటు గాళ్ళను భారత్‌ నుంచి తరలిస్తారు. పేదలకు ఇచ్చే సబ్సిడీలను మాత్రం ప్రతి బడ్జెట్‌లోనూ కోతలు విధిస్తూ బహుళజాతి సంస్థలకు రెడ్‌కార్పెట్‌ పరుస్తున్న మన పాలకులు ఎవరి కోసం ఆ పనులు చేస్తున్నారో ప్రజలు గుర్తించాల్సిన అవసరం ఉంది. దేశవ్యాప్తంగా దాదాపు రూ.5.36 లక్షల కోట్ల సబ్సిడీలను బడా వ్యాపార సంస్థలకు దేశం సబ్సిడీల రూపంలో చెల్లించడం, పేదలకు ఇచ్చే సంక్షేమ పథకాలలో కోత విధించడం ప్రభుత్వా లు చేస్తున్న బహుళజాతి కంపెనీల ప్రయోజనాల్లో భాగమేనని తెలుస్తోంది. నిరర్థక ఆస్తుల పేర పెట్టుబడిదారులు ఇప్పటికే లక్షల కోట్ల రూపాయలు బ్యాంకులకు బకాయిపడ్డారు. అదే సందర్భంలో పేదలు చిన్నచిన్న రుణాలు కట్టలేని పరిస్థితుల్లో వారి వస్తువులను జప్తు చేస్తున్నారు. ఇంకా పేదలు చెల్లించాల్సి న రుణ మొత్తాలు ఉంటే అందుకు బ్యాంకు ఉద్యోగులను బాధ్యుల్ని చేస్తున్నారు. వారిచ్చిన రుణాలకు వారినే బాధ్యులను చేస్తూ చర్యలు తీసుకుంటున్నారు. అందుకే బ్యాంకు ఉద్యోగులు ఓ ప్రజా ప్రతినిధి ఇంటి ముందు ధర్నా కూడా చేశారు. ఇటువంటి నేరగాళ్ళ విషయంలో ప్రజలే చైతన్యం పొందాల్సిన అవసరం ఉంటుంది. రూ.9,500 కోట్లకు ఎగనామం పెట్టిన మాల్యా అంత అవసరమైతే నాలుగు వేల కోట్ల వరకూ చెల్లిస్తానని దబాయింపు ధోరణిలో వ్యవహ రించడం చూశాం. ఇలాంటి ఆర్థిక నేరగాళ్ళ ప్రేలాపనలకు దీటైన సమాధానం చెప్పాల్సింది ప్రజలే. అందుకే ముంబాయి వాసి ప్రేమలత రైల్వే టికెట్‌ తీసుకోకుండా ప్రయాణించి తన నిరసన వ్యక్తం చేశారు. అందుకామె ఏడు రోజులు జైలు శిక్షనైనా అనుభవించి తన నిరసన రూపాన్ని యావత్‌ ప్రజలకు తెలియచేసి ఉద్యమ రూపానికి నాంది పలికారు. ఇప్పటికైనా దేశ సరిహద్దులు దాటుతున్న అక్రమార్కుల భరతం పట్టి వారి నుంచి బ్యాంకులకు రావాల్సిన అప్పులు వసూలయ్యేలా పాలకులు చూడాలి. లేక పోతే పేదలు దాచుకున్న డబ్బులు దొంగలు ఎత్తుకెళ్లినట్టే అవుతుంది. కాదు.. కాదు.. మన పాలకులే పేదల సొమ్ము పెద్దలకు పంచినట్టవుతుంది.
- వనం నాగయ్య