ఆర్థిక అసమానతలు

ప్రపంచంలోని 80 మంది అత్యధిక ధనికుల సంపద 50 శాతం ప్రపంచ జనాభాకు సరిసమానమని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ పేర్కొంది. ఇదిలాఉండగా యుకె ఓవర్‌సీస్‌ డిపార్ట్‌మెంటు ఆధారంగా ప్రపంచబ్యాంకు చెప్పిన 120 కోట్ల జనాభా కన్నా మరింత ఎక్కువమంది రోజుకు 1.25 డాలర్లకన్నా తక్కువ ఆదాయంతో బతుకుతూ దారిద్య్రావస్థలో ఉన్నారు. 
               ఐఎమ్‌ఎఫ్‌ తన నివేదికలో ''ప్రపంచ ఆర్థికమాంద్యం 2009 తరువాత, ప్రస్తుత వార్షిక సంవత్స రంలో ఆర్థిక వృద్ధిరేటు అతి తక్కువగా నమోదవుతుంది'' అని పేర్కొంది. ఈ సంవత్సరం అంతర్జాతీయంగా ఊహించిన 3.5 శాతం వృద్ధిరేటుకన్నా 3.3 శాతంతో సరిపెట్టుకోవలసి వస్తుందని అభిప్రాయపడింది. ఒకవైపు చైనా స్టాక్‌మార్కెట్‌ అలజడులు, గ్రీసు రుణభారాలు ఈ సంవత్సరపు అభివృద్ధి రేటును నిలువరించడానికి గల కారణాల్లో తీసివేయలేనివని తెలియజేసింది. ఐఎమ్‌ఎఫ్‌ చీఫ్‌ ఆర్థికవేత్త బ్లాంచన్‌ ''మనం ఇప్పుడు క్షీణిస్తున్న ఆర్థికాభివృద్ధి దశలో నడుస్తున్నాం'' అని అన్నారు. 2016లో 3.8 శాతం వృద్ధితో మరలా ముందుకు పోయే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న మందకొండి అభివృద్ధి, పేరుకుపోతున్న రుణాల కారణంగా నిరుద్యోగం గణనీయంగా పెరుగుతున్నదని అంచనావేసింది. యూరప్‌లో గడచిన అయిదు సంవత్సరాల్లో మూడవ మాంద్యం త్రుటిలో తప్పినట్లు తన నివేదికలో పేర్కొంది. అభివృద్ధిచెందుతున్న దేశాల వృద్ధిరేటు ఏప్రిల్‌లో 2.4 శాతం ఉంటుందని చెప్పగా ప్రస్తుతం ఈ సంవత్సరానికి తాజాగా 2.1 శాతం ఉంటుందని తేల్చింది. అభివృద్ధిచెందిన దేశాలైన అమెరికా, బ్రిటన్‌, జపాన్‌లలో అంచనాల కంటే తక్కువ ఉంటుందని తెలియజేస్తోంది. అమెరికాలో ఏప్రిల్‌ 2015లో 3.1 శాతం అంచనా వేయగా, ఇప్పుడు 2.5 శాతంతో సరిపెట్టుకోవలసి వస్తుందని అంటుంది. వాస్తవానికి మొదటి త్రైమాసికంలో జిడిపి వృద్ధిరేటు అమెరికాలో 0.2 శాతం మాత్రమే నమోదయింది.
పెరుగుతున్న నిరుద్యోగం
కార్పొరేట్‌ కంపెనీలు షేర్లను వెనక్కి కొనుక్కోవడంతో నూతన కర్మాగారాలు నెలకొల్పటం, యంత్రపరికరాలు కొను గోలు చేయటంలేదు. తద్వారా లేఆఫ్‌లు ప్రకటించటంతో నిరుద్యోగం పెరుగుతున్నది. మిగులు లేదా అదనపు విలువను బయటపెట్టిన మహోపాధ్యాయ కార్ల్‌మార్క్స్‌ ''నిరుద్యోగాన్ని పెట్టుబడిదారీ వ్యవస్థ ఒక వరంగా చేసుకుని శ్రమశక్తి విలువతో బేరసారాలకు ప్రయత్నిస్తుంది'' అని చెప్పారు. ఉదాహరణకు ప్రపంచ సోషలిస్టు పత్రిక మంత్లీ రివ్యూలో బెర్నార్డ్‌ మెలో అంచనాల ప్రకారం 2011లో విశ్వవ్యాప్తంగా 140 కోట్ల వేతన కార్మికులు ఉండగా, 1.8 రెట్లు ఎక్కువగా 250 కోట్ల వేతన కార్మికులు నిరుద్యోగులుగా ఉన్నారు. తాజాగా మైక్రోసాఫ్ట్‌ ప్రకటించిన 8,000 లేఔట్‌లు, హెచ్‌ఎస్‌ బిసి 25,000 ఉద్యోగుల ఉద్వాసన దీనికి నిదర్శనం. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందకొడిగా నడుస్తుంది అని ఐక్యరాజ్య సమితి కూడా తెలియజేస్తూ, ఈ సంవత్సరపు వృద్ధిరేటు 2.8 శాతంతో ముగియవచ్చని అంచనాకు వచ్చింది. సహజంగా వృద్ధిరేటు 2.5 శాతానికి మించకపోతే ఆర్థిక మాంద్యం సంభవించిన ట్లుగా ఆర్థిక విశ్లేషణ చెబుతోంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సైతం వృద్ధిరేటు దిగజారు తున్నది. బ్రెజిల్‌ ఎగుమతులు చైనాతో 11.8 శాతం పడిపోగా, 400 కోట్ల డాలర్ల లోటు వాణిజ్యంతో 2000 తరువాత సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. యుద్ధాలు, ఉగ్రవాదం, హింస వలన ప్రపంచ ఆర్థికాభివృద్ధి 14.3 లక్షల కోట్ల డాలర్లు కోల్పోయింది. ఇది ప్రపంచ ఆర్థిక ఆదాయంలో 13.4 శాతం. తూర్పు యూరప్‌, మధ్యప్రాచ్యం, ఉత్తర ఆఫ్రికాలో యుద్ధాలు, అశాం తులే దీనికి కారణం. ఉక్రెయిన్‌ నేపథ్యంలో రష్యాపై ఆంక్షల ఫలితంగా దేశ జిడిపి 4.5 శాతం పడిపోవచ్చునని ఊహిస్తుంది.
జిడిపికన్నా జపాన్‌ రుణాలు 240 శాతం ఎక్కువ
ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో ఉన్న గ్రీసులో ప్రభుత్వ రుణాలు జిడిపి కంటే 177 శాతం ఎక్కువగా ఉండగా, ఆ నిష్పత్తి ప్రపంచ అగ్రస్థానంలో, 240 శాతంతో అంటే సుమారు 11 లక్షల కోట్ల డాలర్లతో జపాన్‌ సంక్షోభంలో ఉండటం గమనార్హం. కాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల జపాన్‌లో పర్యటించి దేశ ప్రధాని అబేను రాజధాని శంకుస్థాపనకు ఆహ్వానించటం వెనుక ఆంతర్యం అర్థంకాక ప్రజానీకం విస్తుపోతున్నారు.
జిడిపి వృద్ధి నోచుకోని భారత ప్రజలు
ఫోర్బ్స్‌ తన నివేదికలో భారతదేశంలో 1 శాతం ప్రజానీకం 48 శాతం దేశ సంపదను కలిగి ఉన్నట్లు, మిగిలిన 99 శాతం మిగతా 52 శాతం కలిగి ఉన్నట్లు తెలిపింది. మొదటి 10 శాతం ధనవంతులు 74 శాతం సంపదను కలిగి మిగతా 90 శాతం ప్రజానీకం 24 శాతం సంపదను మాత్రమే కలిగి ఉన్నారు. ప్రపంచ పేదరిక జనాభాలో 20 శాతం భారతదేశంలోనే ఉండటం గమనార్హం. దీనిని బట్టి కోట్లాదిమంది భారతీయు లకు సరళీకృత ఆర్థిక విధానాల వల్లగాని, ప్రపంచీకరణ వలనగాని, ఆర్థికవృద్ధిరేట్లు, జిడిపి పెరుగుదల, తరుగుదలతో ఏ విధమైన సంబంధంలేదని తేటతెల్లమవుతుంది. పంపిణీ వ్యవస్థలోని వ్యత్యాసాల వలన ప్రభుత్వాలు కార్పొరేట్‌ సంస్థలకు ఇస్తున్నటు వంటి రాయితీల వలన, ఫలితాలు 10 శాతం ధనవంతుల చేతుల్లోకి వెళుతున్నట్లు తెలుస్తున్నది.
ప్రపంచ సంపద కార్పొరేట్‌ సంస్థలకు పరిమితం
ప్రపంచ ఆర్థిక సంపద కొద్దిపాటి మంది చేతుల్లోనే కేంద్రీకరించటం జరుగుతోంది. ప్రఖ్యాతిగాంచిన ప్రథమ శ్రేణి 200 కార్పొరేట్‌ కంపెనీల ఆస్తులు క్రింది స్థాయి 80 శాతం ప్రపంచ జనాభాతో సరిసమానమని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పాలసీ స్టడీస్‌ సంస్థ తెలిపింది. ప్రపంచంలోని 80 మంది అత్యధిక ధనికుల సంపద 50 శాతం ప్రపంచ జనాభాకు సరిసమానమని వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ పేర్కొంది. ఇదిలాఉండగా యుకె ఓవర్‌సీస్‌ డిపార్ట్‌మెంటు ఆధారంగా ప్రపంచబ్యాంకు చెప్పిన 120 కోట్ల జనాభా కన్నా మరింత ఎక్కువమంది రోజుకు 1.25 డాలర్లకన్నా తక్కువ ఆదాయంతో బతుకుతూ దారిద్య్రావస్థలో ఉన్నారు. సర్వేలు వాస్తవికంగా ఉండకపోవటం వలన ప్రపంచ జనాభాలో 25 శాతంతో 180 కోట్ల జనాభా వరకు ఉంటారని అంచనా. పేదరికానికి 5 డాలర్లు హద్దుగా తీసుకుంటే 400 కోట్ల ప్రజానీకం (ప్రపంచ జనాభాలో సగం కంటే ఎక్కువ) ఈ స్థాయిలోకి వస్తారని ప్రపంచ సోషలిస్టు వెబ్‌సైట్‌ చెపుతోంది. 2014లో కేవలం అమెరికా ఒక్కటే 61 వేల కోట్ల డాలర్లను ప్రజల అవసరాలకు ఉపయోగపడని మారణాయుధాల కోసం రక్షణ రంగంలో ఖర్చుపెట్టింది. దీనికి తోడు అణు రంగ ఖర్చులు, విదేశీ యుద్ధాలపై వడ్డీ ఖర్చులు మొదలైనవి కలుపుకుంటే ఏటా లక్ష కోట్ల డాలర్లు అవుతుంది. కాగా ఐక్యరాజ్యసమితి ఎఫ్‌ఎఒ ప్రకారం ప్రపంచ ఆకలి ఉపద్రవాన్ని పారద్రోలేందుకు 30 వేల కోట్ల డాలర్లు సరిపోతాయని తెలియజేసింది.
మిగులు విలువ దోపిడీ
పెట్టుబడిదారీ వ్యవస్థలో మిగులు విలువ నుంచి అందవలసిన భాగం పరిశ్రమలలో శ్రామికునికి, వ్యవసాయంలో రైతులకు, వ్యవసాయ కార్మికులకు అందక పెట్టుబడి కేంద్రీకృతమై కొనుగోలు శక్తి క్షీణించి, పెట్టుబడిదారీ ఆర్థికవ్యవస్థ సంక్షోభంలోకి నెట్టబడుతుంది. వృద్ధిరేట్లు పడిపోవటానికి ఇదే ప్రధాన కారణమని మార్క్సిస్టు సిద్ధాంతవేత్తలు తెలియజేస్తున్నారు. ఆర్థిక మాంద్యాలు, అసమా నతలు పెరుగుతున్న నేపథ్యంలో కార్ల్‌ మార్క్స్‌ మిగులు విలువకు ప్రాధాన్యత పెరిగింది. పెట్టుబడిదారీ ఆర్థికవ్యవస్థ శ్రమశక్తిని ఉత్పత్తి క్రమంలో ఖర్చుగా, ముడిసరుకు వలే పరిగణిస్తోంది. చాలీచాలని వేతనాలతో మిగులు విలువను పెంచటం కోసం శ్రమశక్తిని చిన్నచూపుచూస్తూ వస్తు ఉత్పత్తి విలువను పెంచుకుంటోంది. తద్వారా శ్రామిక వర్గాన్ని దోచుకుంటోంది. మరొక వైపు శ్రామికులను రిజర్వులో ఉంచి, నిరుద్యోగులుగా మార్చి, శ్రామికుల మధ్య పోటీతో తక్కువ వేతనాలకు శ్రమను దోచుకుంటూ మిగులు విలువను పెంచుకుంటూ పోతోంది. ఈ విధంగా కేంద్రీకృతమవుతున్న పెట్టుబడి ఒకవైపు పేరుకుపోతుండగా, చాలీచాలని సంపదతో కోల్పోతున్న అశేష ప్రజానీక కొనుగోలు శక్తి లేమి వలన ఆర్థిక అసమానతలు తలెత్తుతున్నాయి. ఇది పెట్టుబడిదారీ ఆర్థికవ్యవస్థ నైజం.
(వ్యాసకర్త ఆలిండియా ప్రోగ్రెసివ్‌ ఫోరమ్‌ అధ్యక్షులు)
- బుడ్డిగ జమిందార్‌