ఆధ్యాత్మికత-అసలు, నకిలీ

 ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో ఒకటే హడావిడి. పుష్కరాలకు కొన్ని వందల కోట్లు ఖర్చు పెడుతున్నారు. వాటిలో ఏవీ శాశ్వత నిర్మాణాలు కావు. కేవలం 12 రోజులకు తప్ప తరువాత పనికిరానివి. అసలు అప్పటిదాకా కూడా అవి ఉంటాయా అన్నది కచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే అలవిమాలిన అవినీతి, యథావిధిగా బాధ్యతారాహిత్యం సరే. అవి మన సనాతన సంప్రదాయాలలో భాగంగా ఎప్పుడో మారిపోయాయి కాబట్టి విశేషంగా చెప్పుకోవలసిన అవసరం లేకుండవచ్చు. ఇక రెండు ప్రభుత్వాలూ చేస్తున్న ప్రచారం చూస్తుంటే ప్రభుత్వాలే అజ్ఞానాన్ని పెంపొందించి మూఢనమ్మకాలను పెంచడానికి ప్రోత్సాహకాలు అందజేస్తున్నాయా అనిపిస్తుంది. పుష్కర స్నానం చేయండి, ఆధ్యాత్మికతను పెంపొందించుకోండి, కోరిన కోర్కెలు తీర్చుకోవడానికి పుష్కర స్నానం చేయండి. ఇంకా పాపాలన్నీ తొలగించుకోవడానికి పుష్కర స్నానం చెయ్యండి. స్నానాలతోనే పాపాలు పోతాయా? కోర్కెలు తీరిపోతాయా? ఆధ్యాత్మికత అంటే కోర్కెలు తీర్చుకోవడమా? ఎంత అజ్ఞానం.
ఓ వైపు దేశంలోని నదులు అన్నింటినీ విచక్షణా రాహిత్యంగా మురికి కూపాలుగా మార్చేసి అవే నదులలో స్నానం చేసి పాపాలు తొలగించు కోమనడంలో ఏమన్నా అర్థం కనబడుతుందా? ప్రభుత్వాలు ప్రచారం చేయడం, ప్రజలు వేలం వెర్రిగా నమ్మడం మన అజ్ఞానానికి ప్రత్యక్ష నిదర్శనం.
అసలు ఆధ్యాత్మికత అనేది పుట్టిందే భారతదేశంలోనని, దానికి ప్రపంచంలోనే హక్కుదారులము తామేనని, వేరెవ్వరికీ ఆ అర్హత లేదని సగటు భారతీయుడు భావిస్తాడు. దానికి కారణం మనది పుణ్యభూమని, కర్మభూమని, వేద భూమని నమ్ముతూ ఉండటం వల్ల కావచ్చు. ఇలాంటి భావాలు పెంపొందించడానికి ముఖ్య కారకులు మఠాధిపతులు, స్వామీజీలు, గురూజీలు, జీయర్‌లు, కొత్తగా ప్రవచనాలు చెబుతున్న బ్రహ్మశ్రీలు. వీరు టీవీలలో దర్శనమిచ్చి గొప్ప గొప్ప ప్రసంగాలు చేస్తారు. అందులో ముఖ్యంగా సనాతన సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, నైతిక విలువలు, దానధర్మాలు, హిందూ ధర్మాలు, ఆధ్యాత్మికత అనే పడికట్టు పదాలు కచ్చితంగా ఉంటాయి. ఇంకా పురాణ ప్రాశస్త్యాలు, వేదాల గొప్పతనాలు కూడా ఉంటాయి. కానీ ఎక్కడా స్పష్టంగా ఆధ్యాత్మికత అనే పదానికి అర్థం ఏమిటి, ఏం చేయటం ఆధ్యాత్మికత అవుతుంది అని సూటిగా చెప్పరు, చెప్పలేరు. ఈ మధ్యన కొత్తగా దీపాలు వెలిగించడం గొప్ప ఆధ్యాత్మికత కార్యక్రమమని, అది వేలు, లక్షల దీపాలు వెలిగించడం మహత్కార్యమని పైన మనం పేర్కొన్న వారందరినీ ఓ చోట పోగేసి వారే హైందవ సంప్రదాయాన్ని ఈ దేశాన్ని రక్షించేస్తున్నట్లు ఓ టీవీ చానల్‌ వారు చేసే హడావిడి కూడా చూస్తున్నాం. మూఢ నమ్మకాలను ప్రోత్సహించడం, నమ్మించడం, ప్రేరేపించడం లాంటివి హైందవ సంప్రదాయాలు ఆధ్యాత్మికత అని నమ్మించడం అజ్ఞానానికి పరాకాష్ట.
శ్రీరామ నవమి, వినాయక చవితి, దసరా లాంటి పండుగలు, వేడుకలు కూడా ఆధ్యాత్మికత వాతావరణంలో జరిగాయని టీవీలలో యాంకర్లు చాలా గొప్పగా చెబుతూ ఉంటారు. ఆధ్యాత్మికత ఊరేగింపుల్లో, వీధి కార్యక్రమాలలో ఉండదు, రాదు కూడా. కానీ వారు అలా చెప్పడానికి కారణం అసలు ఆధ్యాత్మికత అనే పదానికి అర్థం తెలియకపోవడం, అవగాహన లేకపోవడం. లేనిది కావాలని కోరుకోవడం మానవ సహజం. ఎండలు బాగా ఉన్నప్పుడు చల్లదనం, బాగా చలిగా ఉన్నప్పుడు వేడిని కోరుకుంటాము. అలాగే రోడ్ల ప్రక్కన పరిసరాలు పరిశుభ్రంగా ఉంచండి, ఇక్కడ మూత్రం చేయరాదు, చెత్త వేయరాదు అని దేవుళ్ళుగా భావించే వారి బొమ్మలు ఉంచటం చూస్తూ ఉంటాము. అంటే వీటి అర్థం మనం పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుతామని అవగాహన కలవారమని అర్థమా? అలా అనుకుంటే అంతకన్నా హాస్యాస్పద విషయం ఇంకోటి ఉంటుందా? అలాగే మన దేశంలో ఆధ్యాత్మికత కావాలని కోరుకుంటున్నారు. కానీ దాని అర్థం ఏమాత్రం తెలుసుకోకుండా మిడి మిడి జ్ఞానంతో, అర్థ సత్యాలతో మభ్యపెట్టే ప్రసంగాలు చేసే అజ్ఞానుల మాటలు నమ్ముతూ వాటినే పాటిస్తూ అవగానా రాహిత్యంతో ఆధ్యాత్మికతను ఓ మతానికి సంబంధించినదిగా భావిస్తూ పూజలు చేయటం, యజ్ఞాలు, హోమాలు నిర్వహించడం, రోడ్ల మీద మందిరాలు కట్టుకొని పూజలు, ప్రార్థనలు చేయటం ఆధ్యాత్మికత అనుకుంటున్నారు.
తరచూ వేదాల గురించి, పురాణాల గురించి, హైందవ సంప్రదాయం గురించి తన్మయత్వంతో ఊగిపోతూ ఆవేశంగా ప్రసంగాలు చేసేవారి మాటలు నమ్మి ఇదే ప్రపంచం, ఇదే సంప్రదాయం, ఇంతకు మించిన నాగరికత మరెక్కడా లేదని తలచి నూతిలోని కప్పల్లా మారిపోతున్న ఈ దేశ జనం అంతర్జాతీయ సమాజంలో మనం ఎక్కడ ఉన్నామో, మన స్థాయి ఏమిటో, మన అలవాట్లు, ఆలోచనలు మధ్య అంతరం ఏ స్థాయిలో ఉన్నదో తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. ఆవును గోమాత అని పిలుస్తాము. అలాంటి ఆవును ఇతర మతస్తులు తింటున్నారని, అది చాలా పెద్ద తప్పు అని, పాపం అని తీర్మానాలు చేసేస్తాము. కానీ ప్రభుత్వాలు సైతం పర్యావరణానికి ఎంతో హానిచేస్తున్నాయని నిషేధించిన ప్లాస్టిక్‌ కవర్లను విచ్చలవిడిగా వాడటం వలన ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో, ఎన్ని వేల ఆవులు ప్రతి సంవత్సరం చనిపోతున్నాయో తెలసుకోరు, తెలిసినా పట్టించుకోరు. అలాగే సందర్భం దొరికితే చాలు ఈ భూమి గురించి గొప్పగా చెప్పుకుంటాం, కానీ తలతిప్పి ఎటువైపైనా చూడండి పరిసరాలు ఎంత అస హ్యంగా, చెత్తాచెదారంతో నిండి ఉంటాయో. మరి అంత గొప్పగా చెప్పుకున్న భూమిని పరిశుభ్రంగా ఉంచుకోవలసిన బాధ్యత మనకు లేదా? సహనం ఈ భూమిలోనే ఉందని, ఈ భూమిలో పుట్టిన ప్రతి ఒక్కరూ సహనశీలురని చెబుతూ ఉంటాం. ఈ విషయం గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది, అసలు మనకు లేనిదే సహనం. చిన్న చిన్న విషయాలకు కూడా పరుషంగా ప్రవర్తించడం మన నైజం. ఇంకా ఈ దేశంలో గంగా నది ప్రవహిస్తోంది అని చాలా గొప్పగా చెబుతుంటాము. అలాంటి గంగా నది నేడు మురికి కూపంగా మారటానికి కారణం పాకిస్తాన్‌ ఉగ్రవాదులా? లేదా చైనా ఆర్మీనా? లేదా ఈ దేశ ప్రజలా? ఇక దాన ధర్మాలు. ఈ విషయంలోనూ మన మాటలు కోటలు దాటుతాయి. గుడి బయట బిక్షగాడికి రూపాయి దానం చేసి పుణ్యం ఎంత వస్తుందో లెక్కలు వేసుకొనే ఆధ్యాత్మిక భావదారిద్య్రం మనది. అంతెందుకు కనీసం అంబులెన్సుకు కూడా దారి ఇవ్వని మహా మానవతా వాదులు అడుగడుగునా కనిపిస్తారు ఈ పుణ్య భూమిలో. మహిళలు, పిల్లల మీద అఘాయి త్యాలపై మనది గిన్నిస్‌ రికార్డ్‌. ఇంట్లోనే ఆడపిల్లల మీద లాభనష్టాలు లెక్కవేసి వివక్ష చూపించే వ్యాపారవేత్తలు సగటు భారతీయులు. ఎక్కడ మన గొప్ప? ఏ విషయంలో మనం మిగతా ప్రపంచానికి మార్గదర్శకులం? అత్యంత ఆటవిక సమాజంలో అనాగరిక ఆలోచనలతో మూఢ నమ్మకాలను సనాతన సంప్రదాయాలుగా భావించే ఈ సమాజం నాగరికత నేర్చిందనడం కట్టె గుర్రం పరిగెత్తిందనడమే. ఎందుకంటే ఆధ్యాత్మికత గురించి మనకు చెప్పినది, తెలిసినది అర్ధ సత్యాలు, అబద్ధాలు కాబట్టి.
ఇప్పుడు నిజమైన ఆధ్యాత్మికత గురించి తెలుసుకుందాం. నీలోని ఆత్మను, మనస్సును అధ్యయనం చేయడమే అసలైన ఆధ్యాత్మికత అంటే. నిన్ను నువ్వు ప్రశ్నించుకోవడం, నీ గురించి నీవు తెలుసుకోవడం, నీవు మాట్లాడే ప్రతి మాటనూ, నీవు చేసిన, చేస్తున్న ప్రతి పనినీ పున్ణపరిశీలన చేసుకోవడం, నాది అనే కాంక్షను విడవడం, నేను అనే అహాన్ని పరిత్యజించటం. బుద్ధుడు చేసింది అదే కదా! ఆ ఆలోచనల పరంపర నుంచే నీవెలాంటి వాడివో నీ తోటి వారు, ఈ సమస్త జీవ జాలం అలాంటివే. అవే హక్కులు కలిగి ఉన్నాయనే బాధ్యతను తెలియజేస్తాయి. అత్యున్నత విలువలు, ఆలోచనలూ కలుగుతాయి. అటువంటి ఆలోచనలే సమసమాజ ఏర్పాటుకు దోహదం చేస్తాయి. ఆనాటి నుంచి ఈ నాటి వరకు అభ్యుదయ భావాలు కలవారు కోరుకునే సమసమాజం కూడా అదే కదా. ఇంత స్పష్టమైన, ఉన్నతమైన ఆధ్యాత్మికత అనే పదాన్ని కోరికలు తీర్చుకునేదానికో, పాపాలు తొలగించుకునే దానికో వాడుకోమనే పాపాత్ములను ఏగంగలో ముంచాలో మీరే ఆలోచించుకోండి.
అసలైన ఆధ్యాత్మికతవాది బుద్ధుడు. ఆయన ప్రతిపాదించిన ఎనిమిది సూత్రాలలో ఆధ్యాత్మికత అణువణువా ఉన్నది. అందుకే ఆ మహానుభావుడు కొన్ని వేల సంవత్సరాల క్రితమే కుల రహిత సమాజం కావాలన్నాడు. ఉన్మాద స్థితిలో ఉన్న ఈ దేశ ప్రజలు ఆయనను పరిహసించారు, అవమానించారు, సనాతన సంప్రదా యాలను నాశనం చేస్తున్నావని ఆయాస పడ్డారు. చివరకు ఈ దేశాన్ని కులాల కుంపట్లతో ప్రపంచ మూఢ నమ్మకాల రాజధానిగా మార్చారు. బుద్ధుని సూత్రాలను అంగీకరించి, ఆమోదించి, అమలు పరిచిన దేశాలైన చైనా, జపాన్‌, థారుల్యాండ్‌, సింగపూర్‌, కొరియా, నేటి శ్రీలంక లాంటి దేశాలు సైతం నాగరిక విలువలతో అభివృద్ధి పథంలో దూసుకుపోతుంటే ఆ దేశాల భిక్ష కోసం నాడు బుద్ధుని భిక్షువుగా హేళన చేసిన ఈ దేశ పాలకులు, ప్రజలూ పోటీ పడుతూ మనం ఎక్కడ ఉన్నామో నిజాయితీగా నిరూపిస్తున్నారు.
- నరసింహప్రసాద్‌ గొర్రెపాటి