ఆధార్‌ తప్పనిసరి కాదు:సుప్రీం

దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ పథకాల అమల్లో ఆధార్‌ కార్డు తప్పనిసరి కాదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఈ మేరకు సుప్రీం కోర్టుకు స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని రాష్ట్రాలతోపాటు సంబంధిత అధికారులకు కూడా స్పష్టం చేసినట్లు జస్టిస్‌ చలమేశ్వర్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనానికి అదనపు సొలిసిటర్‌ జనరల్‌ పింకీ ఆనంద్‌ వివరించారు. ఆధార్‌ కార్డును తప్పనిసరి చేయబోమని, ఆధార్‌ కార్డు లేనంత మాత్రాన ఎవరూ ప్రభుత్వ పథకాలకు అనర్హులు కారని ప్రభుత్వం గతంలో చెప్పిందని, కానీ ఇప్పుడు దానికి భిన్నంగా వ్యవహరిస్తోందని, కేంద్ర ప్రభుత్వంతోపాటు రిజర్వు బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, ఎన్నికల కమిషన్‌లపై కోర్టు ధిక్కారం కింద కేసు నమోదు చేయాలంటూ కొంతమంది పిటిషనర్లు సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ సందర్భంగా కోర్టు ధిక్కారానికి పాల్పడ్డామన్న వాదనను తిరస్కరించిన కేంద్రం.. ప్రభుత్వ పథకాల్లో లబ్ధి పొందడానికి ఆధార్‌ తప్పనిసరి కాదని స్పష్టం చేసింది.