'ఆధార్‌' ఉన్నా మరుగుదొడ్లకి అనుమతి ఇవ్వడంలేదు : సిపిఎం

:సమస్యల వలయంలో రేపల్లె పట్టణం కొట్టుమిట్టాడుతుందని ఎక్కడి సమస్యలు అక్కడే ఉన్నాయని సిపిఎం డివిజన్‌ కార్యదర్శి సిహెచ్‌ మణిలాల్‌ విమర్శించారు. సిపిఎం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాదయాత్ర రెండోరోజైన మంగళవారం నేతాజికాలనీలో ప్రారంభమై అనంతరం 2, 20 వార్డుల్లో ప్రభుత్వ జూనియర్‌ కళాశాల లంబాడీ కాలనీ, ఎస్టీకాలనీ వివిధ ప్రారతాల్లో పేదలు నివసిస్తున్న ఏరియాల్లో సమస్యలనడిగి తెలుసుకున్నామని చెప్పారు. మణిలాల్‌ మాట్లాడుతూ పోలీస్‌ స్టేషన్‌ వెనుక ఎస్టీకాలనీలో గతంలో 80 మందికి బీఫారం ఇచ్చారని అందరికి ఆధార్‌ కార్డులున్నా మరుగుదొడ్లు కట్టుకోవటానికి అవకాశం ఇవ్వటంలేదని చెప్పారు. మరుగుదొడ్లులేని ప్రజలు రైల్వే, మున్సిపల్‌ ఖాళీ ప్రదేశాల్లో మలవిసర్జన చేసినందుకు మున్సిపల్‌ అధికారులు రూ.500 జరిమానా కట్టించుకుంటు న్నారని పేదలు ఆవేదన వ్యక్తం చేశారని వివరించారు. జూనియర్‌ కళాశాల వెనుక లంబాడీ కాలనీలో దాదాపు 50 కుటుంబాలు ఇళ్లస్థలాలు లేకపోవడంతో పక్కనే ఉన్న ప్రభుత్వ దేవాలయ భూముల్లో ఇళ్లు నిర్మిస్తే పోలీసులు అర్ధాంతరంగా ఇళ్లుపీకేయించారని తెలిపారు. ప్రభుత్వం కొనుగోలు చేసిన 14 భూముల్లో ఇళ్లస్థలాలు ఇస్తామని చెప్పి తర్వాత ఈ పేర్లు ఇళ్ల స్థలాల అర్హుల జాబితాలో లేవని చెప్పటంతో వార్డు ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారని విమర్శించారు. ఎక్కడ ఏ వార్డులోను డ్వాక్రా మహిళల రుణాలు ఎక్కడ మాపీకాలేదని మహిళలు తెలిపారని అన్నారు. జూనియర్‌ కళాశాలలో శంకుస్థాపన చేసిన అంబేద్కర్‌ భవనాన్ని పరిశీలించి దళితవాడ ప్రజలను ఐక్యం చేసి అంబేద్కర్‌ భవనం జూనియర్‌ కళాశాల ఆవరణంలోనే నిర్మించాలని, దీనికి దళిత ప్రజానీకం మొత్తం ఏకం కావాలని కోరారు. అనేక రకాల సమస్యలు వార్డుల్లో ఉన్నా మున్సిపల్‌ అధికారులు, ప్రజాప్రతినిధులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని చెప్పారు. జన్మభూమి కమిటీల పేరుతో రాజకీయ కారణాలతో ప్రతివార్డులో పదుల సంఖ్యలో పెన్షన్లు, రేషన్‌కార్డులు ఆపేశారని, డ్రయినేజి సదుపాయాలు కల్పించకపో వటంతో వర్షం కారణంగా ప్రజలు తీవ్రంగా ఇబ్బందు లకు గురవుతున్నారని తెలిపారు. డ్రయినేజ్‌ సదుపా యాలు ఇకనైన కల్పించి ప్రభుత్వాలు ఆదర్శంగా నిలవాలని పేదల సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వం కేటాయించిన 14 ఎకరాల భూమిని పేదలకు పంపిణీ చేయాలని ప్రతివార్డులోని తాగునీటి సమస్యలను పరిష్కరించాలని అన్నారు. సమస్యలపైన డిసెంబర్‌ 2న కలెక్టరేట్‌, డిసెంబర్‌ మొదటివారంలో మున్సిపల్‌ కార్యాలయంవద్ద నిర్వహించే ధర్నాలో పెద్దఎత్తున ప్రజానీకం పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.