ఆదర్శ పాఠశాలల అసలు నిజాలు

''ఎలాంటి లాభాపేక్ష లేకుండా ప్రజాస్వామిక ప్రభు త్వాలు విద్యారంగం మీద సామాజిక అభివృద్ధి దృక్పథంతో పెట్టుబడులు పెట్టినప్పుడే నిరక్షరాస్యతా మహమ్మారిని పారద్రోలగలమని, ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల ప్రభుత్వాలు అందుకు తగ్గ చర్యలు తీసుకోవాలని సెనెగల్‌ రాజధాని డాకర్‌లో 2000లో జరిగిన ప్రపంచ విద్యా సదస్సు తీర్మానించింది.'' తీర్మానాన్ని మన దేశం కూడా ఆమోదించింది. కానీ నేడు మన దేశంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న అపసవ్య విధానాల వల్ల ప్రభుత్వ పాఠశాలలు రాబోయే రోజుల్లో కనుమరుగయ్యే పరిస్థితి దాపురిస్తోంది. ప్రత్యేకించి మన రాష్ట్ర పరిస్థితి మరింత దారుణంగా ఉంది. నవ్యాంధ్రప్రదేశ్‌కు విద్యారంగంలో ప్రాథమిక స్థాయిలో ధీటైన విధానాలతో గట్టి పునాదులు వేసి పాఠశాల విద్యను బలోపేతం చేయాల్సిన రాష్ట్ర పాలకులు అనాలోచిత నిర్ణయాలతో మూసధోరణిలోనే ముందుకు వెళ్తూ, ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేసేందుకు అవసరమైన అన్ని చర్యలూ తీసుకుంటున్నారు. ఆదర్శ పాఠశాలల ఏర్పాటు పేరుతో గత కొద్ది రోజులుగా ప్రభుత్వం చేపడుతున్న హడావుడి నిర్ణయాలే అందుకు ప్రబల తార్కాణం.
ఆదర్శ పాఠశాలలు-వాటి స్వభావం
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విద్యా కమిషనర్‌ గత జూన్‌ 26న వెలువరించిన ఆర్‌.సి.నెం.25ను విడుదల చేశారు. ప్రభుత్వ ప్రాథమిక విద్యారంగంలో పాఠశాలల, ఉపాధ్యాయ పోస్టుల సహేతుకీకరణ, వనరుల పున్ణపంపిణీ కొరకు అవసరమైన ప్రారంభ చర్యలు తీసుకోవడం ఈ ఆదేశాల ప్రకటన లక్ష్యం. ఇందులోనే ఆదర్శ పాఠశాలలను గురించి కూడా ప్రస్తావించారు. ప్రభుత్వం ప్రస్తుతం చేపట్టదలచిన హేతుబద్ధీకరణ, వనరుల పున్ణపంపిణీ వంటి చర్యలన్నీ ఈ ఆదర్శ పాఠశాలల ఏర్పాటు లక్ష్యంగానే చేపడుతున్నట్టు ఈ ప్రొసీడింగ్స్‌లో వివరించారు. దీని ప్రకారం ప్రతి పంచాయతీలో 1 కిలోమీటరు పరిధిలో ఉన్న 20 మంది కంటే తక్కువ పిల్లలున్న పాఠశాలలన్నింటినీ విలీనం చేసి పంచాయతీ కేంద్రంగా ఒక ఆదర్శ ప్రాథమిక పాఠశాల ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రతి తరగతికీ ఒక టీచరు ఉండే విధంగానూ, అదే విధంగా ప్రతి తరగతికీ ఒక తరగతి గది ఉండే విధంగానూ చర్యలు చేపట్టనున్నారు. మొదట్లో వీటికి 'కామన్‌ స్కూల్స్‌' అని పేరు నిర్ణయించి తిరిగి ఆ పేరును తొలగించి 'ఆదర్శ ప్రాథమిక పాఠశాలలు' అని నామకరణం చేశారు. అయితే ఆదర్శపాఠశాలల ఏర్పాటును పరిశీలిస్తే కొఠారీ కమిషన్‌ ప్రతిపాదించిన ''కామన్‌ స్కూల్‌'' విధానం స్ఫురణకు వస్తుంది. అయితే కొఠారీ కమిషన్‌ ప్రతిపాదించిన కామన్‌ స్కూల్‌ విధానానికి, ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ఆదర్శ పాఠశాలలకు మధ్య హస్తిమశకాంతరం తేడా కనిపిస్తోంది. అందుకే మొదట 'కామన్‌ స్కూల్‌'గా పేరు ఖరారు చేసి తరువాత దానిని రద్దు చేసి 'ఆదర్శ ప్రాథమిక పాఠశాలలు'గా నిర్ణయించారన్న విమర్శలూ లేకపోలేదు.
కొఠారీ కమిషన్‌ కామన్‌ స్కూల్స్‌
స్వాతంత్య్రం వచ్చిన తొలి నాళ్ళలో దేశంలోని విద్యా వ్యవస్థను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన కొఠారీ కమిషన్‌ మన దేశ పరిస్థితులననుసరించి కామన్‌ స్కూల్‌ విధానాన్ని ప్రతిపాదించింది. ఒక ప్రాంతానికి చెందిన అన్ని వర్గాల పిల్లలూ ఒకే పాఠశాలలో చదువుకొనే విధంగా పాఠశాలలు స్థాపించాలని కొఠారీ సూచించారు. తద్వారా ధనిక, పేద తారతమ్యం లేకుండా బాల్యం నుంచే పిల్లలందరూ సరైన ప్రాపంచిక జ్ఞానం పొంది, సమాజాన్ని సానుకూల దృక్పథంతో పరిశీలించే నైజం అలవడుతుందనేది ఆయన ఉద్దేశం. విద్యార్థి జ్ఞాన సముపార్జనలో ఇది కీలకమని అనేక మంది మేధావుల అభిప్రాయం. నచ్చిన పాఠశాలలో కాకుండా, తమ ఆవాస ప్రాంతంలోని పాఠశాలల్లోనే చేర్చాల్సి ఉంటుంది. కానీ దేశంలో కేరళ వంటి రాష్ట్రాల్లో కొద్ది వరకైనా కామన్‌ స్కూల్‌ వ్యవస్థ నడిపిస్తూ విద్యా రంగంలో విప్లవాత్మక ప్రగతి సాధించగలిగారు. దేశంలో ఇప్పటికీ మేధావులు, విద్యావేత్తలు, ప్రజాసంఘాలు కామన్‌ స్కూల్‌ వ్యవస్థను ప్రవేశ పెట్టాలని కోరుతూనే ఉన్నారు. ఇటీవల బీహార్‌ ప్రభుత్వం నియమించిన ''ముచుకుంద్‌ దూబే'' కమిటీ కూడా కామన్‌ స్కూల్‌ విధానాన్ని సిఫార్సు చేసింది. ఇదిలా ఉంటే కొఠారీ కామన్‌ స్కూల్స్‌ విధానానికి పూర్తి భిన్నంగా మన ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న ఆదర్శ ప్రాథమిక పాఠశాలల వ్యవస్థ కనిపిస్తోంది.
అసలు నిజాలు
కొఠారీ కమిషన్‌ ప్రతిపాదిస్తున్నట్లుగా ఆవాస ప్రాంతంలో కిలోమీటరు పరిధిలో ప్రైవేటు, ఎయిడెడ్‌, ప్రభుత్వ పాఠశాలలు ఉండగా కేవలం ప్రభుత్వ పాఠశాలలను మాత్రమే విలీనం చేయాలంటున్నారు. దీంతో ప్రభుత్వం ప్రైవేటు విద్యా వ్యాపారాన్ని ప్రోత్సహిస్తున్నట్లుగా భావించాల్సి వస్తోంది. గణాంకాల ప్రకారం రాష్ట్రంలో మొత్తం 32,440 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలుండగా వాటిలో 7,112 యథాతథంగా కొనసాగుతాయి. 7,747 ఆదర్శ ప్రాథమిక పాఠశాల లుగా రూపాంతరం చెందనున్నాయి. మిగిలిన 17,581 ప్రాథమిక పాఠశాలలు పూర్తిగా మూతబడనున్నాయి. మిగులుగా చూపిన 19,064 ఉపాధ్యాయ పోస్టులు తరువాతి కాలంలో పూర్తిగా రద్దుకానున్నాయి. ప్రభుత్వ ప్రతిపాదిత చర్యలన్నీ ప్రభుత్వ బడులను మూసివేసి ప్రైవేటు బడులను అవిచ్ఛిన్నంగా కొనసాగించేందుకు దోహదపడతాయి. ప్రపంచబ్యాంక్‌ నిధులు పొందటం కోసం ప్రవేశ పెడుతున్న ఆదర్శపాఠశాలల్లో ''ఆదర్శం'' నేతి బీరకాయలో నెయ్యి చందమే. అంతిమంగా ఇది ప్రభు త్వం హ్రస్వదృషిని ఎత్తిచూపుతోంది. వేల సంఖ్యలో ఉపాధ్యాయ పోస్టుల రద్దు నిరుద్యోగుల ఆశలపై నీళ్ళుచల్లే అవకాశం ఉంది.
సంక్షేమం నుంచి తప్పుకుంటున్న ప్రభుత్వాలు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నాణ్యమైన విద్యను పేదలకు అందించడంలో దారుణంగా విఫలమవు తున్నాయి. బడ్జెట్‌ కేటాయింపులే అందుకు నిదర్శనం. అడగకుండానే కార్పొరేట్లకు అన్నీ సమకూర్చే ప్రభుత్వం, జాతిపురోగతికి జీవగర్రలాంటి విద్యారంగానికి నిధులు కేటాయించడంలో మీనమీషాలు లెక్కిస్తున్నాయి. దేశ జిడిపిలో 6 శాతం నిధులు విద్యారంగానికి కేటాయిం చాలని మేధావులు, విద్యావేత్తలు ఎంత చెప్పినా అది ప్రభుత్వ ముందు బధిర శంఖారావమౌతోంది. సంస్కర ణలలో మానవీయ కోణం ఉండేవిధంగా ప్రత్యామ్నాయ ఆర్థిక విధానాలు అనుసరించాలన్న సుప్రసిద్ధ ఆర్థికవేత్త అమర్త్యసేన్‌ మాటలు ప్రభుత్వ పెద్దలు వినిపించు కోవడంలేదు. ఇప్పటికీ ప్రపంచబ్యాంకు నిర్దేశిత ఆర్థిక విధానాల బాటలోనే పయనించడం దురదృష్టకరం. రెండు దశాబ్దాల కిందట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రతి తరగతికీ ఒక టీచర్‌ ఉండేవారు. విద్యాబోధన అత్యున్నతంగా ఉండేది. పర్యవేక్షణకు స్కూల్‌ ఇన్‌స్పెక్టర్ల వ్యవస్థ పటిష్టంగా ఉండేది. నేడు ప్రాథమిక పాఠశాలల్లో బహుళ తరగతి బోధన సర్వసాధారణమైపోయింది. ప్రభుత్వ పాఠశాలలను సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్సీలుగా తీర్చిదిద్దాల్సిందిపోయి, ప్రైవేటు పాఠశాలల్లో 25 శాతం సీట్లు పేదలకు కేటాయించాలని చెప్పి ప్రజలు పన్నులు ద్వారా కట్టిన డబ్బును ప్రైవేటు పాఠశాలల పరంచేశారు. తద్వారా విద్యాహక్క చట్టం మరింతగా అసమానతలకు బీజం వేసినట్లైంది. ప్రభుత్వాల విధానాలతో పాఠశాల విద్య కూడా బహుళజాతి కంపెనీల కబందహస్తాల్లో చిక్కుకునే సమయం మరెంతో దూరంలో లేదు.
ఆదర్శ పాఠశాలల ఏర్పాటు పేరుతో ప్రభుత్వ పాఠశాలలకు మూసివేసే చర్యలను ప్రభుత్వం విరమిం చాలి. పాశ్చాత్య దేశాల తరహాలో ప్రభుత్వమే పాఠశాల లను నిర్వహించాలి. ఇందుకుగానూ ప్రతి ప్రభుత్వ పాఠశాలనూ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్సీగా తీర్చిదిద్దాలి. ప్రైవేటు పాఠశాలల ఫీజులను నియంత్రించాలి. నిబంధనలు అతిక్రమించిన ప్రైవేటు పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకొని వాటిని సమీప ప్రభుత్వ పాఠశాలల్లో విలీనం చేయాలి. ప్రభుత్వ పాఠశాలల్లో చదివేవారికి ప్రోత్సాహకాలు ఇవ్వాలి. చదువని వారికి సంక్షేమ పథకాల్లో కోతవిధించాలి. కాదని విద్యారంగ వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే ప్రభుత్వం ప్రజాగ్రహానికి గురికాక తప్పదు.
- పుట్టా పెద్దఓబులేసు 
(వ్యాసకర్త అభ్యుదయ వేదిక కన్వీనర్‌)