ఆత్మహత్యల 'భారతం'

 భాతదేశాన్ని పట్టి పీడిస్తున్న రుగ్మతల్లో ఆత్మహత్యలు ప్రధానంగా ముందుకు రావడం ఆందోళన కలిగించే విషయం. పలు కారణాలతో బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్న వారు సంవత్సరానికి లక్షకు మించి పోవడం కలచివేసే అంశం. కొన్నేళ్లుగా ఆత్మహత్యల పరంపర కొనసాగడంపై ఏలికలు తేలిగ్గా తీసుకోవడం దారుణం. ఏదైనా ప్రమాదంలోనో, హఠాత్తుగా సంభవించే అనారోగ్యంతోనో చనిపోతే అర్థం చేసుకోవచ్చు. కానీ జీవితంలో సమస్యలు ఎదుర్కోలేక కుంగిపోయి బలవంతంగా ప్రాణాలు తీసుకోవడం బాధాకరం కాగా, అలాంటి వారు వేలు దాటి లక్షలకు చేరడం సమస్య తీవ్రతను తెలియజేస్తోంది. నేషనల్‌ క్రైం రికార్డ్స్‌ బ్యూరో (ఎన్‌సిఆర్‌బి) తాజాగా 2014కు సంబంధించి విడుదల చేసిన ఆత్మహత్యల వివరాలు ప్రజలను విస్మయపరుస్తున్నాయి. నిరుడు దేశవ్యాప్తంగా 1,31,666 మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు. 2013లో ఈ సంఖ్య 1,34,799. ముందటేడు కంటే 2.3 శాతం ఆత్మహత్యలు తగ్గాయి. కాంగ్రెస్‌ హయాంలో కంటే తమ ప్రభుత్వంలో ఆత్మహత్యలు తగ్గాయని బిజెపి అల్పసంతోషం వ్యక్తం చేయవచ్చునేమోకానీ బలవన్మరణాలు ఇంత పెద్ద సంఖ్యలో ఎందుకు సంభవిస్తున్నాయో ఆలోచించకపోతే భవిష్యత్తు ఆందోళకరంగా మారే ప్రమాదముంది. ఇప్పటికైనా ఎన్‌డిఎ సర్కారు అప్రమత్తం కావడం మంచిది. దేశంలో గంటకు సగటున పదిహేను మంది బలవంతంగా ప్రాణాలు తీసుకోవడాన్ని సాదాసీదాగా తీసి పారేయడానికి ఎంత మాత్రం వీల్లేదు. ఎన్‌సిఆర్‌బి లెక్కల ప్రకారం ఆత్మహత్య చేసుకున్న వారిలో వార్షిక ఆదాయం లక్ష రూపాయల కంటే తక్కువ కలిగిన వారు 69.7 శాతం. నిరక్షరాస్యులు, పదోతరగతి కంటే తక్కువ చదువుకున్న వారి సంఖ్య ఎక్కువ. రానున్న కొద్ది సంవత్సరాల్లో భారత్‌ను ప్రపంచంలో నెంబర్‌ వన్‌ చేస్తామని, ఎక్కడికో తీసుకెళతామని బిజెపి ప్రభుత్వం కలలు పండిస్తున్న తరుణంలో ఎన్‌సిఆర్‌బి వెల్లడించిన ఆత్మహత్యల 'భారతం' వాస్తవ పరిస్థితులను ఆవిష్కరించింది. ఈ కఠోర సత్యం పాలకులకు చెంపదెబ్బ వంటిది.
ఆత్మహత్యల లెక్కలను కేవలం అంకెలు నివేదికలకు పరిమితం చేయడానికి వీల్లేదు. ప్రభుత్వం సమగ్రంగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దేశంలో అత్యంత వెనుకబడ్డ రాష్ట్రాలేమైనా ఉన్నాయంటే ఈశాన్య రాష్ట్రాలే. కాగా ఆత్మహత్యలు పెద్ద రాష్ట్రాల్లో అదీ అత్యధిక స్థూలోత్పత్తి నమోదు చేస్తున్న రాష్ట్రాల్లో సంభవించడం గమనార్హం. 2014లో మహారాష్ట్రలో అత్యధిక ఆత్మహత్యలు జరిగాయి. ఆర్థిక రాజధాని ముంబయి ఉన్న రాష్ట్రంలో దేశంలోనే అత్యధిక ఆత్మహత్యలు సంభవించడం ఆలోచింపజేస్తోంది. ఆ తర్వాతి స్థానంలో తమిళనాడు, పశ్చిమబెంగాల్‌, కర్ణాటక ఉన్నాయి. ఈశాన్య, 'బీమార్‌' స్టేట్స్‌తో పోల్చితే ఆ రాష్ట్రాలు జిడిపిలో ఎంతో ముందున్నాయి. గ్రామాల్లో కంటే నగరాల్లో ఆత్మహత్యల రేటు అధికంగా ఉండటం మరో కోణం. చెన్నరులో అత్యధిక బలవన్మరణాలు నమోదయ్యాయి. ఆ తర్వాత ఐటి రాజధాని బెంగళూరు, దేశ రాజధాని ఢిల్లీ, ఫైనాన్షియల్‌ సిటీ ముంబయి ఉన్నాయి. నగర వాసుల్లో అత్యధికంగా ఆత్మహత్యల ఫోబియా ఉన్నట్లుంది. రైతుల ఆత్మహత్యలు మరీ విషాదం. 2014లో 5,650 మంది అన్నదాతలు బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు. అంతకు ముందు సంవత్సరం కంటే తగ్గినట్లు కనబడుతున్నా జాతికి అన్నం పెట్టే రైతులు బలవంతంగా చనిపోవడం అరిష్టం. గడచిన రెండు దశాబ్దాల్లో రెండున్నర లక్షల మందికి పైగా రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారంటే వ్యవసాయ సంక్షోభం ఎంత తీవ్ర రూపం దాల్చిందో చెప్పనవరం లేదు. కాగా తెలుగు రాష్ట్రాల్లో ఆత్మహత్యలు పెరగడం మరీ ఆందోళనకరం.

ఎన్‌సిఆర్‌బి నివేదికలో మొదటి పది స్థానాల్లో తెలంగాణ, ఎపి చోటు దక్కించుకున్నాయి. తెలంగాణాది ఐదో ర్యాంక్‌ కాగా ఆంధ్రప్రదేశ్‌ పదో స్థానంలో ఉంది. రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ దేశంలోనే రెండో స్థానంలో ఉంది. హైదరాబాద్‌, విజయవాడ నగరాల్లో ఆత్మహత్యలు పెరగడం గమనించాల్సిన విషయం. ఎన్‌సిఆర్‌బి నివేదికను విశ్లేషిస్తే ఆత్మహత్యలు సామాజిక సమస్యలు మినహా నేరాలు ఎంత మాత్రం కానేరవు. దేశంలో సంస్కరణలు ప్రారంభమైన దగ్గర నుంచి ఆత్మహత్యలు అంతకంతకూ పెరుగుతున్నాయి. కుటుంబ కలహాలు, ఆర్థిక, అనారోగ్య కారణాలు, వివాహ సంబంధ సమస్యలు, అప్పుల బాధ ఇవన్నీ సామాజికపరమైనవే. ఆత్మహత్యల్లో గృహిణులు ఆరింట ఒకరు బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారంటే సామాజికంగా అణచివేతకు గురవడం వల్లనేనని అర్థమవుతుంది. నిరక్షరాస్యులు, గృహిణులు, అల్పాదాయ వర్గాలు బలవంతంగా చనిపోవడం సామాజిక రుగ్మత. సంస్కరణల యుగంలో ఆత్మహత్యలకు సాంస్కృతిక కాలుష్యం ఒక కారణమని సామాజిక విశ్లేషకులు చెబుతున్నారు. రేడియో నుంచి వందల చానెళ్ల వరకు ప్రసార మాద్యమం పరిణామం చెందింది. మార్కెట్‌ ఆర్థిక వ్యవస్థకు విశృంఖల ప్రచారం కల్పించడంతో ప్రజల మెదళ్లు కలుషితం అవుతున్నాయి. ఉత్తరాల కాలం నుంచి వాట్సప్‌ కాలానికి వచ్చాక జనంలో సహనం నశించి ఆత్మనూన్యతా భావం పెంపొంది చివరికి ఆత్మహత్యలకు ప్రేరేపిస్తోందని మనస్తత్వ శాస్త్రవేత్తల పరిశీలనలో తేలింది. దేశానికి పెనుసవాలుగా మారిన ఆత్మహత్యలపై ప్రభుత్వాలు సమగ్రంగా అధ్యయనం చేసి విధానపరమైన చర్యలు చేపట్టాలి. ఆత్మహత్యల్లేని భారత్‌ నిర్మాణానికి సామాజిక కోణంలో పరిష్కారాలు కనుగొనాలి.