పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో రాజ్యసభ ముందుకు వచ్చిన ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అంశమై ప్రయివేట్ మెంబర్ బిల్లు ఎన్డీయే పక్షాల నాటకీయ పరిణామాలతో వెనక్కి వెళ్లింది. సభలో ఎక్కడైనా విపక్షం ఆందోళన చేస్తుంది. కానీ ఆరోజు అధికార పక్షమే ఆందోళనకు నడుం కట్టింది. సభకు సంబంధం లేని అంశాన్ని సాకుగా చూపించి సభను అడ్డుకుంది. స్వయానా పార్లమెంటరీ వ్యవహారాల మంత్రే తమ పక్ష సభ్యులను ఆందోళనకు ఉసిగొల్పడం, ఎన్డీయే పక్షమైన టిడిపి మంత్రి అదే సమయంలో రాజ్యసభ నాయకుడు, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో ముచ్చటించటం, తమ సభ్యుల ఆందోళలను చూసి జైట్లీ ముసిముసి నవ్వులు నవ్వటం చూస్తుంటే అనేక మౌలిక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆంథ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రానికి లేదు. ఇప్పటికిప్పుడు ఎపి వల్ల బిజెపికి అదనంగా కలిగే రాజకీయ ప్రయోజనం ఏమీ లేకపోవడమే బలమైన కారణమా? ఇటీవలి మంత్రివర్గ విస్తరణలో ఉత్తరప్రదేశ్‌కు పెద్ద పీట వేశారంటే... వచ్చే ఏడాది ఎన్నికలు ఉన్నాయి. ఆంధ్రాపై ప్రత్యేక దృష్టి పెట్టడానికి అలాంటి రాజకీయ కారణం లేదు.
పార్లమెంటు సాక్షిగా ఎపికి అనేకసార్లు అవమానాలు ఎదురయ్యాయి. ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో నాటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ ఇచ్చిన హామీ నెరవేర్చకపోగా, అవమానించారు. ప్రత్యేక హోదా ఇవ్వలేమని మూడుసార్లు పార్లమెంటులోనే ప్రభుత్వం ప్రకటించింది. ఇది పచ్చి దగాకోరు తనం. ఎన్నికల్లో పదేళ్లు హోదా ఇస్తామని చెప్పిన మోడీ నోరు మెదపటం లేదు. విభజన హామీ అమలుకు నోడల్ ఏజెన్సీగా ఉన్నా హోం శాఖ ఇవ్వలేమని చేతులెత్తేసింది. ఆర్థిక వ్యవహారాల శాఖ ఇచ్చేది లేదని తేల్చిచెప్పింది. రైల్వే జోన్ లేదు. పారిశ్రామిక ప్రోత్సాహకాలు లేవు. ఇలా ఇచ్చిన ప్రధాన హామీ ఏదీ అమలుకు నోచుకోలేదు. ఇది ఇలా ఉంటే విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, రైల్వే జోన్, ఆర్థిక లోటు పూడ్చడం, పన్ను రాయితీ, ప్రత్యేక ప్యాకేజీ, ఉత్తరాంధ్ర, రాయలసీమ వెనుకబడిన ప్రాంతాలకు కోరాపుట్- బొలంగీర్-కల్హండి, బుందేల్‌ఖండ్ తరహాలో అభివృద్ధి ప్యాకేజీ, పోలవరం కేంద్రమే త్వరితగతిన పూర్తి చేసే చర్యలు... రాష్ట్ర విభజన సందర్భంగా ఉద్యోగులు, నిధులు, ఆస్తుల పంపకానికి సత్వర చర్యలు, తదితర 16 సవరణలతో కూడిన ప్రయివేట్ మెంబర్ బిల్లును 2015 జులై 31న రాజ్యసభ సభ్యులు కెవిపి రామచంద్రరావు రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఈ ఏడాది ఏప్రిల్ 29న రాజ్యసభలో సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ చర్చలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హరిభారు చౌదరి సమాధానమిస్తూ ఆంధ్రప్రదేశ్‌కు ఎంతో చేశామని, ఇక చేయాల్సింది బహు కొంచెమేనని, ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం లేదని మాట్లాడారు. కోరం లేక బిల్లుపై ఓటింగ్ వాయిదా పడింది. మే 13న ఈ బిల్లు రాజ్యసభ ముందుకు రావాల్సింది. రాజ్యసభ బిజినెస్‌లో కూడా బిల్లును పెట్టారు. అప్పటికే కాంగ్రెస్ అన్ని పక్షాల మద్దతు కూడగట్టింది. సిపిఎం, సిపిఐ, ఆర్జేడి, ఎస్‌పి, ఎన్‌సిపి, జెడియు, తదితర పార్టీలు మద్దతిచ్చాయి. బిల్లు ఓటింగ్‌కు వస్తే ఆమోదం పొందే అవకాశాలున్నాయి. అయితే బిజెపి, టిడిపిలకు ఇది అగ్ని పరీక్ష. బిల్లుకు అనుకూలంగా ఓటు వేస్తే కాంగ్రెస్‌ను గెలిపించి నట్లవుతుంది. వేయకపోతే ఆ రెండు పక్షాలూ ఎపి ప్రజల ముందు విలన్ అవుతాయి. కాబట్టి అధికారం చేతిలో ఉందని సభను జరగకుండా పూర్తిగా వాయిదా వేసే కుట్రలు చేశాయి. అసలు ఆరోజు వాయిదా వేయనవసరం లేదు. కానీ బిల్లును సభ ముందుకు రాకుండా టిడిపి, బిజెపిలు చేసిన కుట్రలో భాగమే అది. అదే బిల్లు మరలా గత శుక్రవారం సభ ముందుకు వస్తుందని, ఎపి కాంగ్రెస్ నాయకత్వం హస్తినలో మకాం వేసింది. వారం ముందుగా వచ్చి యుపిఎ, యుపిఎయేతర పక్షాల మద్దతు కోరింది. అన్ని పక్షాలూ మద్దతిస్తామని హామీ ఇచ్చాయి. దాదాపు 117 ఓట్ల మద్దతును కూడగట్టారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ విప్ జారీ చేశారు. ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ సభ్యులందరూ హాజరు కావాలని హుకుం జారీ చేశారు. బిల్లు ఆమోదం పొందుతుందని కాంగ్రెస్ ధీమాగా ఉంది. ఇటు బిజెపి కూడా విప్ జారీ చేసింది. సభ్యులందరూ సభకు హాజరై ప్రత్యేక హోదా బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని బిజెపి హుకుం జారీ చేసింది. సభలో గందరగోళం నెలకొనడంతో బిల్లుపై ఓటింగ్‌కు రాకుండానే సభ వాయిదా పడింది. ఇలా ప్రత్యేక హోదా బిల్లు మూడుసార్లు ఓటింగ్ దశకు వచ్చి భంగపడింది.
శుక్రవారం రాజ్యసభలో ఏం జరిగింది?
ప్రత్యేక హోదా బిల్లు ఓటింగ్‌కు వస్తుందని, నెగ్గుతుందని ధీమాగా ఉన్న కాంగ్రెస్‌కు ఊహించని పరిణామాలు ఎదురయ్యాయి. టిడిపి, బిజెపి వ్యూహంలో భాగంగా బిల్లు ఓటింగ్‌కు రాకుండా సభ వాయిదా పడింది. రాజ్యసభకు సంబంధం లేని అంశాన్ని తెచ్చి సభను జరగనివ్వకుండా అడ్డుకున్నారు. బిల్లు ఓటింగ్‌కు వచ్చే ముందు బిజెపి సభ్యులు లేచి ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) లోక్‌సభ సభ్యుడు భగవంత్ మాన్‌పై చర్యలు తీసుకోవాలని ఆందోళన చేశారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పిజె కురియన్ ఎంత వారించినా అధికార పక్ష సభ్యులు వినిపించుకోకుండా ఆందోళన కొనసాగించారు. ఒకానొక దశలో వెల్‌లోకి దూసుకెళ్లారు. సభ్యులు ఎంతకూ వినిపించుకోకపోవడంతో కురియన్ అధికార పక్షంపై అసహనం వ్యక్తం చేశారు. ఎక్కడైనా సభకు ప్రతి పక్షం అడ్డు పడుతుంది. ఇక్కడ మాత్రం దానికి భిన్నంగా అధికార పక్షమే సభ జరగనివ్వకుండా అడ్డుపడుతోందని విస్మయం వ్యక్తం చేశారు. కురియన్ కలుగజేసుకొని కాంగ్రెస్ పక్ష ఉపనేత ఆనంద్ శర్మకు మాట్లాడే అవకాశం ఇచ్చారు. బిజెపి గొడవ చేయడం సరికాదని, బిల్లును ఎందుకు అడ్డుకుంటుందో బిజెపి చెప్పాలని, సభా నాయకుడు అరుణ్ జైట్లీ సమాధానం చెప్పాలని డిమాండు చేశారు. అరుణ్ జైట్లీ మౌనం దాల్చారు. దీంతో బిజెపి సభ్యులు ఆందోళనను ఉధృతం చేశారు. ఈ సమయంలో సిపిఎం పక్షనేత సీతారాం ఏచూరి కలుగజేసుకుని ఇది రాజకీయ పరమైన అంశం. బిల్లు ఆమోదం పొందడం బిజెపికి ఇష్టం లేదు. సభలో ఇచ్చిన హామీ ఎపి హక్కు. దాన్నీ బిజెపి తిరస్కరిస్తున్నది. ప్రజా ప్రయోజనాలకు వ్యతిరేకంగా ప్రభుత్వం పనిచేస్తున్నది. అందుకే బిల్లును అడ్డుకుంటోంది. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు ఉపయోగపడే బిల్లును అడ్డుకోవడం తగదు. అధికారపక్షం రాజకీయంగానే సభను అడ్డుకోవడం దివాళాకోరుతనానికి నిదర్శనం. సభ వ్యవహారాలను అర్డర్‌లో పెట్టాలి. చర్చ జరగాలని స్పష్టం చేశారు. టిడిపి సభ్యుడు సిఎం రమేష్ ప్రత్యేక హోదా బిల్లుకు మద్దతిస్తామని అన్నారు. ఈ సందర్భంలో కురియన్ కలుగజేసుకొని రమేష్‌జీ బిజెపి మీ పక్షమే కదా వాళ్లను సహకరించమని అడగొచ్చుకదా అని అన్నారు. దీంతో సిఎం రమేష్ అది నా బాధ్యత కాదు, మీరే చూడాలి అని సమాధానం ఇచ్చారు. కాంగ్రెస్ సభ్యులు దిగ్విజరు సింగ్, జైరాం రమేష్, చిరంజీవి, సుబ్బిరామి రెడ్డి, కెవిపి రామచంద్రరావు, ఎకె ఖాన్, రాపోల్ ఆనంద్ భాస్కర్, తదితరులు తమ స్థానాల్లోనే లేచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఇచ్చారు. ఉదయం నుంచి వాయిదాల పర్వంలో కొనసాగుతున్న రాజ్యసభ తిరిగి మధ్యాహ్నం ప్రారంభమైంది. సభలో గందరగోళం నెలకొనడంతో 14 నిమిషాల్లోనే కురియన్ సభను సోమవారానికి వాయిదా వేశారు.
2:30కు రాజ్యసభ ప్రారంభమైయింది.
2:31కి బిజెపి సభ్యుల ఆందోళన ప్రారంభం.
2:33 నుంచి డిప్యూటీ చైర్మన్ కురియన్ వారించడం ప్రారంభం.
2:35కి వెల్‌లోకి 12 మంది బిజెపి సభ్యులు దూసుకెళ్లారు.
2:37కి సిపిఎం పక్షనేత సీతారాం ఏచూరి ప్రసంగం.
2:38కి బిజెపి ఎంపిల తీరు పట్ల కురియన్ అసహనం వ్యక్తం చేశారు.
2:40కి ఆప్ ఎంపి దుమారంపై కాంగ్రెస్ పక్ష ఉపనేత ఆనంద్ శర్మ మాట్లాడారు.
2:41కి సుజనా చౌదరి, అరుణ్ జైట్లీ సభలో ముచ్చట్లు.
2:42కి టిడిపి సభ్యుడు సిఎం రమేష్ మాట్లాడారు.
2:43కి కురియన్ అధికార పక్ష సభ్యుల తీరు పట్ల విస్మయం వ్యక్తం చేశారు..
సభలో నాటకీయ పరిణామాలు
ప్రత్యేక హోదా బిల్లుపై రాజ్యసభలో హైడ్రామా నడిచింది. బిజెపి, టిడిపిలు బాధ్యతరాహిత్యంతో వ్యవహరించాయి. సభకు సంబంధం లేని అంశాన్ని తెచ్చి ఎన్డీయే పక్షాలు గందరగోళం సృష్టించాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ మరోమారు మోసపోయింది. సభలో కొన్ని నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. విభజన సమయంలో పెద్దగా నోరేసుకుని మాట్లాడిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు సభలో లేకపోవడం, ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నికైన బిజెపి సభ్యుడు, కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు డుమ్మా కొట్టడం, కేంద్ర ఆర్థిక మంత్రి, రాజ్యసభ నాయకుడు అరుణ్ జైట్లీ మౌనం దాల్చడం ఆశ్చర్యాన్ని కల్గించింది. అంతేకాదు జైట్లీ ఆందోళన చేస్తున్న సభ్యులను చూసి ముసిముసి నవ్వులు నవ్వారు. పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ సభ్యులను ఆందోళనకు ఉసిగొల్పిడం వంటి పరిణామాలు పార్లమెంటు విలువలకే మచ్చ తెస్తున్నాయి. మరోవైపు టిడిపి సభ్యుడు, కేంద్ర మంత్రి సుజనా చౌదరి, అరుణ్ జైట్లీతో సభలోనే కొద్ది సేపు ముచ్చటించడం మన పాలకులు దేశాన్ని ఎటువైపుకు తీసుకెళ్తున్నారనే చర్చకు దారితీసింది.
ప్రమాణ స్వీకారం లేకుండానే ఓటింగ్‌కు సుజనా...
కేంద్ర మంత్రి సుజనా చౌదరి ప్రమాణ స్వీకారం చేయకుండా ఓటింగ్‌కు రావడం చర్చనీయాంశమైంది. రాజ్యసభ వాయిదా పడిన సమయంలో అక్కడ ఉన్న జర్నలిస్టులతో సభ ప్రారంభానికి ముందు ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పారు. వాస్తవానికి సోమవారం ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. కానీ ప్రత్యేక హోదా బిల్లు ఓటింగ్‌కు వస్తున్న నేపథ్యంలో శుక్రవారమే ప్రమాణ స్వీకారం చేస్తానని అన్నారు. కానీ సభ ప్రారంభమైనప్పటికీ ఆయన ప్రమాణ స్వీకారం చేయకపోవడాన్ని చూసి జర్నలిస్టులు విస్తుపోయారు. అంతకు ముందు మరి కొంత మంది జర్నలిస్టులతో పార్లమెంటు సెంట్రల్ హాల్‌లో ప్రమాణ స్వీకారం ఈ రోజు చేయటం లేదు. బిల్లు ఓటింగ్‌కు కూడా రాదని చెప్పడం చూస్తే... బిజెపి, టిడిపి ముందస్తు ప్రణాళికతోనే బిల్లు ఓటింగ్‌కు రాలేదనిపిస్తుంది.
లోక్‌సభ సభ్యుని అంశం...రాజ్యసభలో సబబా!
ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) పంజాబ్‌కు చెందిన లోక్‌సభ సభ్యుడు భగవంత్ మాన్ సభలో అంశాలను తన ఫోన్‌లో చిత్రీకరించి వాటిని సామాజిక మధ్యమాల్లో అప్‌లోడ్ చేశారు. ఇది పార్లమెంటు భద్రతా వ్యవహారాలకు సంబంధించిన అంశమని, ఆయనపై చర్యలు తీసుకోవాలని ఉభయ సభలు అట్టుడికాయి. అయితే భగవంత్ మాన్‌పై చర్యలు తీసుకొనే అధికారం లోక్‌సభకు మాత్రమే ఉంటుంది. రాజ్యసభ అందులో తల దూర్చకూడదు. అది రాజ్యసభకు సంబంధించిన అంశం కాదు. అప్పటికీ లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ సంబంధిత ఎంపికి నోటీసులు ఇచ్చారు. ఈ అంశాన్ని తీసుకొచ్చి రాజ్యసభలో గందరగోళం సృష్టించి ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు ఉపయోగపడే బిల్లుకు అడ్డుపడటం ఎంతవరకు సమంజసమో బిజెపి, టిడిపిలే చెప్పాలి. ఇలా విభజన నాటి నుంచి విభజన హామీల అమలుకు సంబంధించి పార్లమెంటు విన్యాసాలకు ఆంధ్రప్రదేశ్ బలి అవుతున్నది. ఇట్లాంటి రాజకీయ నాయకులు ఉన్నంత వరకూ బలి అవుతూనే ఉంటుంది.
(వ్యాసకర్త ప్రజాశక్తి న్యూఢిల్లీ ప్రతినిధి)
9999491824
- జె జగదీశ్