ఆంధ్రాను ఆదుకోండి: ఏచూరి

విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని తక్షణమే ఆదుకోవాలని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి డిమాండ్‌ చేశారు. మంగళవారం ఆయన సిపిఎం ప్రధాన కార్యాలయం(ఎకెజి భవన్‌)లో విలేకరులతో మాట్లాడుతూ విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి నాటి ప్రభుత్వం పార్లమెంట్‌ సాక్షిగా ఎన్నో వాగ్ధానాలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ హామీలన్నింటిని అమలు చేయాలని కోరారు. పత్యేక హోదా రూపంలోనైనా, ప్రత్యేక ప్యాకేజి రూపంలోనైనా ఆర్థికంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ను తక్షణమే ఆదుకోవాలన్నారు. ఏ విషయంలోనైనా ఒక రాష్ట్రాన్ని వేరే రాష్ట్రంతో పోల్చడం సబబుకాదన్నది తమ ఉద్దేశ్యమని చెప్పారు. ఆ రకమైన పోటీ రావడం కూడా తప్పేనని చెప్పారు. పునర్‌వ్యవస్థీకరణ చర్చ సందర్భంగా ప్రధాని ఇచ్చిన హామీలను పార్లమెంటు ఆమోదించినా నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. ఎన్నికల ప్రచారంలో బిజెపి తాము అధికారంలోకి వస్తే ఏపినిఅభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారని, ప్రత్యేకహోదాతో పాటు అనేక అంశాలపై హామీలు గుప్పించారని చెప్పారు. గద్దెనెక్కిన వెనువెంటనే ఇదుగో అదిగో పబ్బం గడుపుకుంటోందని ఆరోపించారు. కేంద్రం ఇప్పటికీి ఏ సమస్యను బాధ్యతయుతంగా వ్యవహరించి పరిష్కరించలేదని విమర్శించారు. నాటి ప్రధాని మన్మోహన్‌ సభలో ఐదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని చెబితే అప్పటి ప్రతిపక్ష బిజెపి నాయకులు ఐదేళ్లు కాదు, పదేళ్లు కావాలని డిమాండు చేశారని అదే అంశాన్ని ఎన్నికల్లో ప్రధానంగా ప్రచారం చేశారని గుర్తుచేశారు. మోడీ నేతృత్వలోని కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా విషయంలో నాటి ప్రభుత్వం నిర్ణయాలతో పాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీలనూ పక్కన పెట్టిందని విమర్శించారు. ఎపి ప్రజలను గతంలో కాంగ్రెస్‌, ఇప్పుడు బిజెపి ద్రోహం చేస్తున్నాయని ఆరోపించారు. విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కి ఏయే వాగ్దానాలు చేశారో, వాటిని అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండు చేశారు. వాటికి సిపిఎం కట్టుబడి ఉందని, వాటి అమలు కోసం సిపిఎం ప్రయత్నిస్తుందని తెలిపారు. కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వలేమని లీకులిస్తోందనే ప్రశ్నకు సమాధానంగా ఆర్థిక తోడ్పాటులో లీకులు అవసరం లేవని, కేంద్ర మంత్రులు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడంలేదని పేర్కొన్నారు. ఆంధ్ర భవిష్యత్‌, అభివృద్ధి కోసం ఏ విధమైన ప్యాకేజిలు, వాగ్దానాలు చేశారో వాటి అములకోసం సిపిఎం పోరాడుతుందన్నారు.