ఆంధ్రప్రదేశ్‌లో రహస్య పాలన.!

ఆంధ్రప్రదేశ్‌లో 'రహస్య' పాలన సాగుతోంది. పారదర్శకంగా ఉండాల్సిన సర్కారు ఉత్తర్వులు 'రహస్య' జాబితాలో చేరి పోతున్నాయి. ప్రభుత్వ సమాచారం, జీవోలు ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు ఆన్‌లైన్‌లో జీవోలు పెట్టాలి. ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయాలి. కొన్ని ప్రభుత్వ శాఖలకు సంబంధించి జారీ చేశామంటున్న జీవోల పక్కన 'కాన్ఫిడెన్షియల్‌' అని కనబడుతుంది. ఫైల్‌పై క్లిక్‌ చేస్తే తెల్లగా ఉంటుంది తప్ప వివరాలుండవు. జీవో నెంబర్‌, జారీ చేసిన తేదీ మాత్రం ఉంటుంది. పారదర్శకతకు మారు పేరుగా, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలో తనకు సాటి రాగలవారెవరూ లేరని తరుచు ప్రకటించే చంద్రబాబు సర్కారులోనే 'కాన్ఫిడెన్షియల్‌' జీవోలు పెద్ద సంఖ్యలో వెలువడుతున్నాయి. గవర్నమెంట్‌ ఆర్డర్ల దాపరికంపై అనుమానాలు రేకేత్తు తున్నాయి. చాటు మాటున ప్రభుత్వ వ్యవహారాలు చక్కబెట్టేందుకే పారదర్శకతకు పాతరేస్తున్నట్లు ఆరోపణలొస్తున్నాయి.
రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం సర్కారు ఎపిలో అధికారంలోకొచ్చిన 2014 జూన్‌ 2 నుండి 2015 నవంబర్‌ 18 సాయంత్రం ఐదు గంటల మధ్య మొత్తంగా 31,477 జీవోలు జారీ కాగా వాటిలో 845 కాన్ఫిడెన్షియల్‌. సుమారు పదిహేడు మాసాల పాలనలో వందల సంఖ్యలో 'రహస్య' జీవోలొచ్చాయి.