
ప్రధాని మోదీ అధ్యక్షతన గురువారం జరిగిన కేంద్ర మంత్రివర్గం, ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ ఉపసంఘం ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన రెండు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో అంతర్ రాష్ట్ర ట్రాన్స్మిషన్ వ్యవస్థ ఏర్పాటుకు అనుమతి మంజూరు చేయటంతోపాటు రాష్ట్రానికి సంబంధించిన జాతీయ తుపాను ప్రమాద నివారణ మొదటి దశ పథకానికీ పచ్చ జెండా ఊపింది. ఆంధ్రప్రదేశ్‌తోపాటు గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్, కర్నాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్తాన్ రాష్ట్రాల్లో అంతర్ రాష్ట్ర ట్రాన్స్మిషన్ వ్యవస్థను 8548 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రివర్గం ఆర్థిక వ్యవహారాల ఉపసంఘం నిర్ణయించినట్టు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మీడియాకు వెల్లడించారు. జాతీయ పరిశుభ్ర ఇంధన నిధి నుంచి 3419 కోట్లు ట్రాన్స్మిషన్ పనులకు బదిలీ చేస్తారని ఆయన తెలిపారు. అంతర్ రాష్ట్ర ట్రాన్స్మిషన్ వ్యవస్థ ఏర్పాటు కింద ఆంధ్రప్రదేశ్‌తో పాటు ఎంపిక చేసిన రాష్ట్రాల్లో 48 కొత్త గ్రిడ్ సబ్ స్టేషన్లను వివిధ ఓల్టేజీల సామర్థ్యంతో ఏర్పాటు చేస్తారు. తద్వారా ఈ రాష్ట్రాల్లో 17100 మెగావాట్ల విద్యుత్తును ట్రాన్స్‌ఫార్మ్ చేసే వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. ఎంపిక చేసిన రాష్ట్రాల్లో 7800 సర్క్యూట్ కిలోమీటర్ల మేర ట్రాన్స్మిషన్ లైన్లు ఏర్పాటు చేస్తారు. మొత్తం ప్రాజెక్టును మూడు నుంచి ఐదేళ్ల కాలపరిమితిలో పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశాలో మొదట దశ జాతీయ తుపాను ప్రమాద నివారణ ప్రాజెక్టును 2331 కోట్ల సవరించిన వ్యయంతో పూర్తి చేయాలని మంత్రివర్గం నిర్ణయించినట్టు అరుణ్ జైట్లీ వెల్లడించారు. గోవా, గుజరాత్, కర్నాటక, కేరళ, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్లో రెండో దశ జాతీయ తుపాను ప్రమాద నివారణ ప్రాజెక్టు రెండో దశ కార్యక్రమాలు కూడా చేపట్టాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించింది.