ఆందోళనలతో భూసేకరణపై తలొగ్గిన ప్రభుత్వం..

రాజధాని గ్రామాల్లో భూ సేకరణకు తాత్కాలికంగా స్వస్థిపలుకుతూ సమీకరణ ద్వారానే భూములు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 20న జారీ చేసిన నోటిఫికేషన్లను నిలిపివేశారు. భూ సేకరణకు వ్యతిరేకంగా సిపిఎం ఇప్పటికే రాజధాని గ్రామాల్లో పలు ఆందోళనా కార్యక్రమాలు నిర్వహించింది. సిఆర్‌డిఎ కార్యాలయాల ఎదుట ధర్నాలు, ప్రకాశం బ్యారేజిపై రాస్తారోకో, నిరసన ప్రదర్శనలతో ప్రభుత్వం చర్యలకు నిరసనగా ప్రజలను సమాయత్త పరచటంలో సిపిఎం గత కొంత కాలంగా పోరుబాట నిర్వహిస్తుంది. ఈ నేపధ్యంలో గ్రామాల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వస్తుందని, నిఘావర్గాలు హెచ్చరించటం, అంశాంతి వాతావరణం మధ్య రాజధాని నిర్మాణం ముందుకు సాగదని భావించిన ప్రభుత్వం ప్రస్తుతానికి ప్రభుత్వానికి రైతులు ఇచ్చిన భూమితోనే లే అవుట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.  నిత్యం అలజడులు ఆందోళనలు కొనసాగితే రాజధాని నిర్మాణానికి విదేశీ కంపెనీలు ముందుకు రావని భావించటంతో ప్రజలను శాంతింపచేసేందుకు ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. మరోవైపు రాజధాని నిర్మాణాలకు పర్యావరణ సంబంధిత అనుమతులపై నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌లో కేసు నడుస్తుండటం, సేకరణపై పవన్‌ హెచ్చరికలు, కోర్టు కేసులు, ప్రతిపక్షాల ఆందోళనలతో ప్రభుత్వం భూ సేకరణను ప్రభుత్వం తాత్కాలికంగా పక్కన పెట్టింది. మరోవైపు రాజధాని గ్రామాల్లో ప్రభుత్వం ఇచ్చిన అనేక హామీలు నెరవేరకపోవటం, అసైన్డ్‌ భూములకు పరిహారం, పింఛన్ల పంపిణీలో జాప్యం, లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు, తదితర అంశాలపై సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి.