అసెంబ్లీ ముట్టడి:APరైతుసంగం

 రాష్ట్రంలో ప్రభుత్వం 15 లక్షల ఎకరాలు రైతుల నుంచి గుంజుకొని కార్పొరేట్‌ శక్తులకు అప్పగించే యత్నాన్ని విరమించుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగల సుబ్బారావు డిమాండ్‌ చేశారు. గురువారం బ్రాడీపేటలోని సంఘ కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి విస్తృత సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇప్పటికే రాజధాని పేరుతో 53 వేల ఎకరాలు సేకరించాలని 45 వేల ఎకరాలు రైతుల నుంచి బలవంతంగా తీసుకున్నారని ఆరోపించారు. రాజధాని కోసం మొత్తం 1.40 లక్షల ఎకరాల భూములు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తుందన్నారు. దేశం వ్యవసాయక దేశమని, 120 కోట్ల జనాభాకు ఆహార పదార్ధాలు అందించాల్సిన గురుతర బాధ్యత ఉందని, ప్రభుత్వం లక్షల ఎకరాలు తీసుకుంటే పంటలు ఎలా పండుతాయని ప్రశ్నించారు. శ్రీకాకుళంలో పవర్‌ ప్లాంట్‌ కోసం, భోగాపురం విమానాశ్రయం పేరుతో వేల ఎకరాలు సేకరిస్తున్నారని, చిత్తూరులో దళితులకు కేటాయించిన 1.50 లక్షల ఎకరాలు కూడా తిరిగి ప్రభుత్వం తీసుకునేందుకు సిద్ధమైందని అన్నారు. ప్రభుత్వం రైతులు నుంచి భూములు తీసుకునే పద్ధతి మానుకోకపోతే పెద్ద సంఖ్యలో రైతుల్ని కూడగట్టి ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ సమావేశాలను ముట్టడిస్తామని హెచ్చరించారు.