
బిజెపి నేతృత్వంలోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో అత్యున్నత స్థాయిలో చోటుచేసుకుంటున్న అవినీతిని ఎండగట్టేందుకు వామ పక్షాలు సమరశంఖం పూరించాయి. ఈ నెల 20న దేశవ్యాప్త ఆందోళన నిర్వహించాలని ఆరు వామపక్ష పార్టీలు నిర్ణయిం చాయి. అవినీతి, ఆశ్రితపక్షపాతంలో కూరుకుపోయిన మంత్రు లను తొలగించి వారిపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్‌తో రాష్ట్రస్థాయిలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించాయి. ఈ మేరకు ఆదివారం ఢిల్లీలోని సిపిఎం ప్రధాన కార్యాలయంలో సిపిఐ, సిపిఐఎంఎల్-లిబరేషన్, ఆలిండియా ఫార్వర్డ్‌బ్లాక్(ఎఐఎఫ్‌బి), ఎస్‌యుసిఐ(సి), ఆరెస్పీ నేతలు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో సీతారాం ఏచూరి, ప్రకాశ్ కరత్ (సిపిఎం), సురవరం సుధాకర్‌రెడ్డి, డి రాజా(సిపిఐ), దీప్నాకర్ భట్టాచార్య, స్వపన్ ముఖర్జీ(సిపిఐఎంఎల్-లిబరేషన్), జి దేవరాజన్(ఎఐఎఫ్‌బి), సత్యవన్, పి శర్మ(ఎస్‌యుసిఐ(సి), అబనీరారు(ఆరెస్పీ) హాజరయ్యారు. సుమారు మూడు గంటల పాటు సమావేశం జరిగింది. సమావేశనంతరం ఆరువామపక్ష పార్టీలు ఉమ్మడిగా ఒక ప్రకటన విడుదల చేశాయి. ఎన్డీయే ప్రభుత్వ పాలన యేడాది పూర్తయిన సందర్భంగా 'అవినీతి రహిత పాలన' అందించామని బిజెపి కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్రమోడీ పలికిన గాంభీరాల నిజస్వరూపం బయటపడిందని తెలిపాయి. ఐపిఎల్ కుంభకోణ ప్రధాన నిందితుడు, భారత న్యాయస్థానాలకు చిక్కకుండా పారిపోయిన లలిత్‌మోడీకి సాయం చేయడంలో కేంద్ర విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరరాజే తమ అధికారాన్ని దుర్వినియోగం చేసినట్లు తేటతెల్లమయ్యిందని పేర్కొన్నాయి. అలాగే మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి తన విద్యార్హతలపై తప్పుడు సమాచారం అందించారని, బిజెపి పాలిత మహారాష్ట్రలో ఇద్దరు మంత్రులు ధనార్జన కోసం అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు బయటపడిందని తెలిపాయి. ఛత్తీస్‌గఢ్ లాంటి రాష్ట్రాల్లోనూ అత్యున్నతస్థాయి అవినీతి వ్యవ హారాలు చోటుచేసుకున్నాయని వాపో యాయి. ఈ కేసులన్నింటినీ న్యాయపర్య వేక్షణలో సిబిఐతో విచారణ జరిపించి, దోషులను కఠినంగా శిక్షించాలని ఆరు పార్టీలు డిమాండ్ చేశాయి. ఈ విచారణ పూర్తయ్యే వరకు కేంద్రంలో, రాష్ట్రంలో మంత్రులను తొలగించాలని కోరాయి. మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకున్న 'వ్యాపం' కుంభకోణాన్ని ప్రస్తావిస్తూ.. బిజెపి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో మునుపెన్నడూ లేనంత అతిపెద్ద అవినీతి చోటుచేసుకుందని తెలిపాయి. ఈ కేసులో అధికారికంగా ఇప్పటి వరకు 27 మంది అనుమానస్పదస్థితిలో మరణించగా.. అందులో తొమ్మిది మంది ప్రధాన సాక్షులు మరణించారని ప్రకటనలో లెఫ్ట్ పార్టీలు పేర్కొన్నాయి. ఈ కుంభకోణంపై వార్తలు అందిస్తున్న ముఖ్యమైన జర్నలిస్టూ అనుమానస్పదమృతుల్లో బాధితుడయ్యాడని ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ కుంభకోణంతో ప్రమేయమున్న సుమారు 47 మంది వరకు కారణాలు తెలికుండా మృతి చెందారని గుర్తు చేశాయి. అలాగే ఆయా రాష్ట్రాల్లో చోటుచేసు కుంటున్న అవినీతిపై కూడా రాష్ట్రస్థాయిలో ఉద్యమాలు నిర్మిస్తున్నట్లు ప్రకటించాయి. ఈ సందర్భంగా బెంగాల్‌లో చోటుచేసుకున్న శారదా చిట్‌ఫండ్ స్కామ్‌ను ఉదహరించాయి. విచారణ పూర్తయిన హిందూ ఉగ్రవాద కేసుల్లో న్యాయం దక్కనీయకుండా కేంద్ర, రాష్ట్రాల్లోని బిజెపి ప్రభుత్వాలు చేస్తున్న యత్నాలను ఆరు వామపక్ష పార్టీలు తీవ్రంగా ఖండించాయి. 'విచారణ పూర్తయిన మాలేగావ్, హైదరాబాద్ మక్కా మసీద్, ఆజ్మీర్ షరీఫ్, సంఝౌతా ఎక్స్‌ప్రెస్ లాంటి హిందూ ఉగ్రవాద కేసుల్లో కేసుల్లో న్యాయం దక్కనీయకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి' అని దుయ్యబట్టాయి. కేంద్ర కార్మిక సంఘాలు సెప్టెంబర్ 2న తలపెట్టిన సమ్మెకు మద్దతునిచ్చేందుకు ఆరు వామపక్ష పార్టీలు ఉమ్మడి పిలుపు ఇవ్వాలని నిర్ణయించాయి. అలాగే త్వరలో జరగనున్న బీహార్ శాసనసభ ఎన్నికల్లో వామపక్ష పార్టీలు సంయుక్తంగా పోటీ చేయాలని నిర్ణయించినట్లు తెలిపాయి.