
విశాఖలోని గంగవరం పోర్టులో మృతి చెందిన కార్మికుడు రాజారావు కుటుంబానికి న్యాయం చేయాలని అడిగినందుకు పోలీసులు సోమవారం ఆర్ధరాత్రి దాటాక పోర్టు గేటు వద్ద ఉన్న 130 మంది కార్మికులు, సిఐటియు నాయకులను అక్రమంగా అరెస్టు చేశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం కెజిహెచ్‌కు తరలించారు. రాజారావు విధి నిర్వహణలో ఉండగా సోమవారం మృతి చెందాడు. మృతుని కుటుంబానికి రూ.30 లక్షలు నష్ట పరిహారం చెల్లింపుతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని గంగవరం పోర్టు ఎంప్లాయీస్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యాన కార్మికులు మృతదేహంతో పోర్టు గేటు వద్ద బైఠాయించారు. మృతుని కుటుంబానికి నష్టపరిహారం చెల్లించేందుకు యాజమాన్యం ముందుకు రాకపోవడంతో సోమవారం రాత్రి అక్కడే ఆందోళన కొనసాగించారు.
అప్పటికే భారీగా మొహరించిన పోలీసులు రాత్రి రెండు గంటల సమయంలో కార్మికులపై విరుచుకుపడ్డారు. అడ్డొచ్చిన వారందరినీ లాఠీలతో కొట్టి బలవంతంగా వాహనంలో ఎక్కించి మధురవాడ, భీమిలి, ఆనందపురం తదితర పోలీస్‌స్టేషన్లకు తరలించారు. మృతదేహాన్ని పోలీసులు దగ్గర ఉండి కెజిహెచ్‌కు తరలించారు. గంగవరం పోర్టు ఎంప్లాయీస్ యూనియన్ గౌరవాధ్యక్షులు డాక్టర్ బి.గంగారావు, యూనియన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కారి అప్పారావు, కదిరి భూలోకరావు, సిఐటియు నగర కమిటీ సభ్యులు ఎం.రాంబాబు, నాయకులు కె.మహేష్ సహ 130 మందిని అరెస్టు చేశారు. 'గంగవరం' ఆందోళన ఘటనలో అరెస్టయిన వారిని తక్షణమే విడుదల చేయాలని సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి కె.లోకనాధం డిమాండ్‌చేశారు.