అరువిక్కర విజయంపై ఎల్‌డిఎఫ్‌ ధీమా

తిరువనంతపురం
                       ఈ నెల 27న జరుగనున్న అరువిక్కర శాసనసభా స్థానం ఉప ఎన్నికలో విజయంపై వామపక్ష కూటమి (ఎల్‌డిఎఫ్‌) పూర్తి ధీమా వ్యక్తం చేస్తోంది. ఎల్‌డిఎఫ్‌ తరపున ఎన్నికల బరిలోకి దిగిన మాజీ స్పీకర్‌, మంత్రి ఎం విజయకుమార్‌కు సమాజంలోని అన్ని వర్గాల నుండి గట్టి మద్దతు లభిస్తుండటమే ఇందుకు కారణం. అరువిక్కరగా పేరు మార్చుకున్న ఈ ఆర్యనాడ్‌ (పాత పేరు) నుండి మాజీ స్పీకర్‌, కాంగ్రెస్‌ నేత జి కార్తికేయన్‌ 1991 నుండి శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుత సభ్యుడైన ఆయన ఇటీవల మరణించటంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ స్థానం నుండి పాలక యుడిఎఫ్‌ కార్తికేయన్‌ కుమారుడు కెఎస్‌ శబరినాధ్‌ (33)ను బరిలోకి దించింది. రైల్వేశాఖ మాజీ సహాయ మంత్రి, బిజెపి నేత ఓ రాజగోపాల్‌ కమలదళం తరపున బరిలోకి దిగారు. అయితే ఈయన గత లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలు కావటంతో ఆయన అభ్యర్ధిత్వంపై స్వపక్షీయులే పెదవి విరుస్తున్నారు. విజయకుమార్‌ ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తి కావటం, ప్రజా ఉద్యమాలలో ఆయన అనుభవం వంటి అంశాలు ఆయన విజయానికి బాటలు వేస్తున్నాయి.