అరాచకత్వానికి నిదర్శనం

పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల కమిషనర్‌ సుశాంత్‌ రంజన్‌ ఉపాధ్యారు రాజీనామాతో ఆ రాష్ట్రంలో అరాచకత్వం ఏ స్థాయికి చేరిందో తేటతెల్లమైంది. మున్సిపల్‌ ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ గూండాలు ఆ రాష్ట్రంలో భయోత్పాతం సృష్టించిన తీరు ప్రజాస్వామ్యానికే మాయనిమచ్చ. అధికారం అండతో గూండాలు చెలరేగి పోవడంతో హింస రాజ్యమేలింది. తెగించి పోలింగ్‌ బూత్‌లకు వచ్చిన సాధారణ ప్రజానీకంపై అమానుష దారుణకాండ చోటు చేసుకుంది. పోలింగ్‌ ప్రక్రియ ఇంతగా అపహాస్యం అయ్యింది కాబట్టే వామపక్ష సంఘటన మూడుచోట్ల రీపోల్‌ నిర్వహించాలని డిమాండ్‌ చేయాల్సి వచ్చింది. ప్రజాస్వామ్యాన్ని పదిలంగా కాపాడాల్సిన ఎన్నికల కమిషన్‌ కీలకమైన పోలింగ్‌ తరుణంలో నిష్క్రియాపర్వంగా మారింది. నిజానికి పోలింగ్‌ ప్రక్రియకు కొన్ని రోజుల ముందు నుండి రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను వామపక్షాలు ఎప్పటికప్పుడు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకు వెళ్లాయి. ఎన్నికలు సజావుగా జరిపేందుకు చర్యలు తీసుకోవాలంటూ ఆ పార్టీలు చేసిన విజ్ఞప్తిని ఎన్నికల కమిషనర్‌ హోదాలో సుశాంత్‌ రంజన్‌ ఏనాడు తీవ్రంగా తీసుకోలేదు. అప్పుడే అవసరమైన చర్యలు తీసుకుని ఉంటే పరిస్థితి ఈ స్థాయికి చేరేది కాదు. నిష్పక్షపాతంగా, శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించే దానికన్నా అధికార తృణమూల్‌ ప్రభుత్వానికి నమ్మకస్థుడైన విధేయుడిగానే వ్యవహరించడానికి ఆయన ప్రాధాన్యత ఇచ్చారన్న విమర్శలు ఈ సందర్భంగా ప్రస్తావనార్హం. ఇదే అదునుగా సంఘ విద్రోహ శక్తులు చెలరేగిపోయాయి. అమాయక ప్రజలపై విచ్చలవిడి దాడులకు తెగబడిన దృశ్యాలు మీడియాలోనూ, పత్రికల్లోనూ ప్రత్యక్షమయ్యాయి. దీంతో కొన్ని పోలింగ్‌ స్టేషన్లలోనైనా రీ పోలింగ్‌కు ఆదేశించక తప్పని స్థితిలో ఎన్నికల కమిషన్‌కు ఎదురైంది. ఈ కంటి తుడుపు చర్యను కూడా అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ సహించే స్థితిలో లేకపోవడం, ఎన్నికల కమిషనర్‌ పట్ల దురుసుగా ప్రవర్తించే స్థాయికి బరి తెగించడం దారుణం. అధికార పార్టీ నుండి వచ్చిన ఈ ఒత్తిడితో ఆయన రాజీనామా చేయక తప్పని స్థితి నెలకొంది. నిబంధనల ప్రకారం ఎన్నికల కమిషన్‌ నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సి ఉంది. అధికారంలో ఉన్న పార్టీకి ఏమాత్రం అదనపు ప్రయోజనం కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా కమిషప్‌పై ఉంది. అయితే బెంగాల్‌లో ఈ నిబంధనలన్నీ కాగితాలకే పరిమితమైన తీరు విచారకరం! దేశ చరిత్రలోనే గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికల కమిషనర్‌పై ఒత్తిడి తీసుకు రావడం ద్వారా మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్‌ ప్రభుత్వం అన్ని ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కిన తీరు దుర్మార్గం. అధికారం కోసం ఎన్ని అడ్డదోవలు తొక్కడానికైనా, ఎంత అరాచకానికి దిగడానికైనా మమత సిద్దమయ్యారనడానికి తాజా పరిణామాలే నిదర్శనం. ఎన్నికల కమిషనర్‌ రాజీనామాతో నెలకొన్న సంక్షోభానికి రాష్ట్ర ప్రభుత్వానిదే బాధ్యత!
నిజానికి మమత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పశ్చిమ బెంగాల్‌లో హింసా కాండకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. వామపక్ష కార్యకర్తలు, నాయకులతో సాధారణ ప్రజలనూ తృణమూల్‌ శ్రేణులు లక్ష్యంగా చేరుకుంటున్న తీరు దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. ఈ తరహా హింసా కాండతోనే గ్రామీణ స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో ఆ పార్టీ పైచేయి సాధించింది. ఎన్నికలనే కాదు, ప్రభుత్వానికి, అధినేత్రికి వ్యతిరేకంగా ఎవ్వరు పెదవి విప్పినా అక్కడ సహించే పరిస్థితి లేదు. రచయితలు, మేధావులు, విద్యార్థులు, పాత్రికేయులు కూడా తృణమూల్‌ ఆగడాలకు బలవుతున్నారు. మహిళలను కూడా వీరు వదిలిపెట్టడం లేదు. మరోవైపు ఒకదాని తరువాత ఒకటిగా వెలుగులోకి వస్తున్న అవినీతి కుంభకోణాలు రాష్ట్ర ప్రజానీకంలో చర్చనీయాంశంగా మారుతున్నాయి. మమత సర్కారు ప్రతిష్ఠ క్రమేణా నీరు గారుతోంది. ఈ దుస్థితి నుండి బయట పడటానికి ప్రజోపయోగ పనులు చేపట్టడానికి బదులుగా మమత ప్రభుత్వం మళ్లీ హింసాకాండకే దిగుతోంది. ఈ పరిస్థితిని నిలువరించి, ప్రజలకు అండగా ఉండాల్సిన ప్రభుత్వ యంత్రాంగం అధికారపు అడుగులకు మడుగులొత్తుతోంది. ప్రభుత్వ వ్యవస్థలు జవసత్వాలు కోల్పోయి అధికారపు నీడలో కనుమరుగు కావడం ప్రజలకు, ప్రజాస్వామ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. దేశ వ్యాప్తంగా అభ్యుదయ శక్తులు, ప్రజాస్వామిక వాదులు బెంగాల్‌లో జరుగుతున్న హింసాకాండను తీవ్రంగా ఖండించాల్సి ఉంది. బెంగాల్‌ సాధారణ ప్రజానీకానికి అండగా నిలవాల్సి ఉంది. ఇటువంటి హింసాకాండ బెంగాల్‌ ప్రజానీకానికి కొత్త కాదు. గతంలోనూ ఇటువంటి అనుభవాలు ఉన్నాయి. దౌర్జన్యాలను దాడులను అధిగమించి పోరు జెండాను ఎగరేసిన చరిత్ర బెంగాల్‌ ప్రజలది! ఈ చరిత్ర సారాంశాన్ని బెంగాల్‌ ప్రస్తుత పాలకులు విస్మరించినప్పటికీ సాధారణ ప్రజలు మాత్రం మరచిపోలేరు. బెంగాల్‌ ప్రభుత్వానికి ప్రజాస్వామ్యం పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా అక్రమాలు జరిగిన అన్ని చోట్లా రీ పోలింగ్‌కు సిద్ధం కావాలి. ప్రజానీకంపై హింసా కాండకు బాధ్యులైన వారిని గుర్తించి తక్షణం అరెస్ట్‌ చేయాలి.