అమ్మకానికి గ్రీస్‌

గ్రీస్‌ తన అప్పును సాంతం చెల్లించగలదని ఆశించటం అవాస్తవికమని గ్రీస్‌కు అప్పులిచ్చిన సంస్థలలో ఒకటైన ఐఎంఎఫ్‌ కూడా బహిరంగంగా గుర్తించిన విషయాన్ని కాసేపు మర్చిపోదాం. గ్రీస్‌కు అప్పును చెల్లించటంలో ఎలాంటి ఉపశమనాన్నీ ఇవ్వలేదనుకుంటే ఆ దేశం ప్రతి సంవత్సరం కొంత మొత్తాన్ని చెల్లించవలసి ఉంటుంది. ఏదిఏమైనా గ్రీస్‌ను రెండు మార్గాలలో తన అప్పును చెల్లించేలా చేయవలసి ఉంటుంది. మొదటిది, గ్రీస్‌ సరుకులను, సేవలను ఋణదాతలు కొనుగోలుచేసి ఇచ్చిన అప్పుకు సర్దుబాటు చేసుకోవాలి. విదేశీ చెల్లింపుల సమతూకానికి సంబంధించిన కరెంటు ఖాతాలో మిగులు ఉండాలి. అలా ఏర్పడిన మిగులును గ్రీస్‌ తన అప్పు తీర్చటానికి వినియోగిస్తుంది. రెండవది, గ్రీస్‌ తన ఆస్తులను ఋణదాతలకుగానీ లేక మరెవరికైనా అమ్మి తీసుకున్న అప్పును చెల్లించవలసి ఉంటుంది.
ఈ రెండు మార్గాల మధ్య ఆర్థికపరంగా అపారమైన తేడా ఉన్నది. మొదటి మార్గాన్ని పరిశీలిద్దాం. గ్రీస్‌ ఆర్థిక వ్యవస్థలో తగినంత డిమాండ్‌ లేనందున కరెంటు ఖాతాలో మిగులు ఏర్పడాలంటే ఎగుమతులను పెంచాలి. అంతేగాని 'పొదుపు చర్యల విధానం' చెబుతున్నట్లుగా దిగుమతులను తగ్గించుకుని కాదు. అదే జరిగితే గ్రీస్‌లో ఉత్పత్తి పెరుగుతుంది. దానితోపాటుగా ఉద్యోగ కల్పన కూడా పెరుగుతుంది. అంతేకాక ప్రారంభంలో పెరిగే ఉత్పత్తికి సంబంధించిన 'గుణకం' ప్రభావంతోను, పెరిగిన ఎగుమతుల మిగులుతోను మొత్తం ఉత్పత్తిలో పెరుగుదల చాలా ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకు బయటి నుంచి డిమాండ్‌ ఎక్కువగా ఉండటంవల్ల పెరిగిన ఎగుమతి మిగులు 100 అనుకుంటే, ఆర్థిక వ్యవస్థలో ప్రయివేటు వినిమయం మొత్తం ఉత్పత్తిలో అలవాటుగా సగం దాకా ఉంటే ఆ తరువాత కూడా గ్రీకు ప్రభుత్వ వ్యయం, ప్రయివేటు పెట్టుబడులలో మార్పు ఏమీ ఉండదు. గ్రీకు ఆర్థిక వ్యవస్థలోని ఉత్పత్తి పెరుగుదల 200 ఉంటుంది(ఈ లెక్కలో ఉత్పత్తి పెరుగుదలకు కారణమైన దిగుమతులను పరిగణనలోకి తీసుకోలేదని అనుకోవచ్చు. అయితే అలా జరగలేదు. ఎగుమతుల మిగులు 100 పెరిగిందని అంటున్నప్పుడు దిగుమతుల విలువను ఎగుమతుల విలువ నుంచి తీసివేయగా మిగిలినదానినే లెక్కలోకి తీసుకోవటం జరిగిందని అర్థం). ఈ 200 మిగులులో ప్రయివేటు వినిమయం 100, ఎగుమతుల మిగులు 100గా ఉంటుంది.
ఇలాంటి పరిస్థితుల్లో గ్రీస్‌ తనకు ఎటువంటి ఖర్చూ లేకుండా ఋణదాతలకు 100 చెల్లించగలిగేదే. పైగా అలా చేస్తూనే తన ఉత్పత్తిని, ఉద్యోగ కల్పనను, వినిమయాన్ని పెంచుకోగలిగేదే. ఈ క్రమంలో దేశీయ పెట్టుబడిలోనూ లేక పెన్షన్లు, వేతనాలు, నగదు బదిలీల వంటి ప్రభుత్వ వ్యయంలోనూ ఎటువంటి కోతా లేకుండానే ఇది జరిగేది. ఈ అవగాహన ప్రాధాన్యతను సరిగా గుర్తించలేదు. దురదృష్టవశాత్తు గ్రీస్‌ గురించి చాలా మంది ప్రగతికాముకులు కూడా అంగీకరిస్తున్న బూర్జువా ప్రచారం ఈవిధంగా సాగుతున్నది. గ్రీకు ప్రజలు చాలా కాలంగా తమ తాహతుకు మించి బ్రతుకుతున్నారు. అంత్ణస్సూచనగా చెప్పేదేమంటే బాగా కష్టపడే జర్మన్లలా కాకుండా వారు సోమరులు, అసమర్థులు, విషయాలను తేలిగ్గా తీసుకుంటారు. చాలా కాలం తాహతుకుమించి బ్రతికిన తరువాత 'పొదుపు విధానాన్ని' అంగీకరించి సరుకుల, సేవల వినిమయంలో కోత విధించుకోవటం ద్వారా కడుపుమాడ్చుకోవటం తప్ప గ్రీకు ప్రజలకు వేరే ప్రత్యామ్నాయం ఏదీ లేదు. నిజానికి దేశీయ వినిమయంలో కోత చాలా తీవ్రంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. అందుకే అప్పులు తీర్చాలంటే ముఖ్యంగా 'పొదుపు విధానం' పక్కాగా అమలుచేయవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి వాళ్ళ ఖర్మకు వారే బాధ్యులు. దీనిలో మనం బాధపడవలసిన అవసరంలేదు.
భావనాపరమైన మూర్ఖత్వం
ఈ వాదన ఆచరణలో ఎంత మూర్ఖమైందో పూర్తిగా బహిర్గతమైంది. గ్రీకు ప్రజలు సోమరులు, వళ్ళు వంచరు, ప్రపంచ ఆర్థిక సంక్షోభంతో సంబంధంలేకుండా గ్రీస్‌ అప్పు గ్రీసుకు సంబంధించిన విషయాలతోనే ముడిబడివున్నది, గ్రీకు ప్రజలు తాహతుకు మించి జీవించారు గనుకనే ఆ దేశం అప్పు పేరుకుపోయింది, గ్రీసు అప్పు పేరుకుపోవటానికి గ్రీస్‌పై ఋణదాతలు రుద్దిన విధానాలకు ఎటువంటి సంబంధంలేదు వంటి ప్రతిపాదనలు ఏమాత్రం పసలేనివి. అయితే ఈ వాదనలోని మూర్ఖత్వం తగినంతగా బట్టబయలు కాలేదు. గతంలోనూ, నేడూ గ్రీస్‌ ఆర్థిక వ్యవస్థ పూర్తి స్థాయి ఉద్యోగకల్పన కలిగివున్నదని, దానికి సరఫరా కొరత తప్ప డిమాండ్‌ కొరత లేదనే ప్రమేయంపై ఈ వాదన ఆధారపడింది. ఆర్థిక వ్యవస్థలో వనరులు నిరుపయోగంగా ఉన్నట్లయితే పొదుపుతో కడుపుమాడ్చుకునే అవసరం ఉండదు. సరఫరా కొరత గల ఆర్థిక వ్యవస్థలోనే ఆ పరిస్థితి తలెత్తుతుంది. ఎందుకంటే కేవలం అలాంటి ఆర్థిక వ్యవస్థలోనే అప్పుతీర్చటం కోసం ఎగుమతి మిగులును పొందేందుకు దేశీయ వినిమయాన్ని తగ్గించుకోవలసి ఉంటుంది. డిమాండ్‌ కొరత గల ఆర్థిక వ్యవస్థలో దేశీయ వినిమయం పెరిగినప్పటికీ, విదేశాల నుంచి ఎగుమతులకు డిమాండ్‌ ఉంటే నిరుపయోగంగా ఉన్న వనరులను ఉపయోగించి ఎగుమతుల మిగులును సాధించవచ్చు.
వేరేవిధంగా చెప్పాలంటే అప్పు తీర్చటంకోసం ఒకవేళ గ్రీకు ప్రభుత్వం ఋణదాతలకు వోచర్లను ఇస్తే, వాటిని గ్రీస్‌లో డబ్బు అవసరంలేని విహారయాత్ర చేసేందుకు వీలుకల్పిస్తూ ఆయా దేశాల ప్రజలకు పంపిణీ చేసినట్లయితే ఒక్క రాయితో అనేక పిట్టల్ని కొట్టినట్లయ్యేది. గ్రీస్‌కు అప్పులిచ్చిన దేశాల ప్రజలు గ్రీస్‌లో ఉచితంగా విహార యాత్రచేసి తమ జీవన ప్రమాణాలను మరింతగా పెంచుకోగలిగేవారు. ఆవిధంగా వోచర్ల విలువకు సరిపడా గ్రీస్‌ తన అప్పును తీర్చుకోగలిగేది. అలా విహార యాత్రీకులు గ్రీస్‌ను దర్శించటం వల్ల ఆ దేశంలో ఉద్యోగ కల్పన, ఉత్పత్తి, వినిమయం కూడా పెరిగేవి. అంతేకాకుండా యూరోజోన్‌లో ప్రజల మధ్య సౌభ్రాతృత్వం కూడా వెల్లివిరిసేది. అయితే ద్రవ్య పెట్టుబడి పనిచేసే తీరు అలా ఉండదు. తానున్న దేశాలలోని ప్రజలకు గ్రీస్‌లో ఉచిత విహార యాత్రను అందించటం ద్రవ్య పెట్టుబడికి ఆసక్తి ఉండదు. ఇంకా సాధారణీకరిస్తే గ్రీస్‌లో ఎగుమతి మిగులును సాధించటానికి తీసుకోవలసిన చర్యలు ద్రవ్య పెట్టుబడికి కంటగింపుగానే ఉంటాయి. ఈ చర్యలలో ఒక్కొక్కటీ మిగులు గల ఐరోపాలో ముఖ్యంగా జర్మనీలో డిమాండ్‌ను ఉత్తేజితం చేసేదిగా ఉంటుంది. అలా డిమాండ్‌ను ఉత్తేజితం చేయటంవల్ల వివిధ దేశాల ప్రజల వినిమయం పెరుగుతుంది(దానిలో పైన ఉదహరించిన ఉచిత గ్రీస్‌ విహార యాత్ర ఒకటి). అలా కాకపోతే అది ప్రభుత్వ వ్యయాన్ని పెంచే విధంగా కూడా ఉండవచ్చు. ఒక దేశానికి ఇవ్వవలసిన అప్పును తీర్చటానికి ఆ దేశ ప్రజల వినిమయం పెరగటమనే మార్గం పెట్టుబడిదారీ వ్యవస్థ నీతికి వ్యతిరేకం. దీని గురించి ప్రముఖ పోలిష్‌ మార్క్సిస్టు ఆర్థికవేత్త మైఖల్‌ కాలెస్కీ చెప్పిన మాటలు ఇంకా విలువగలవే. 'నీకు స్వంత వనరులుంటే తప్ప నీ బ్రతుకు బండిని లాగటానికి నువ్వు చెమటోడ్వవలసిందే'. ప్రభుత్వ వ్యయం పెరగటం విషయంలో ద్రవ్య పెట్టుబడికి ఇష్టమైనదేదైనా ఉంటే అది దానికి ఉపయోగపడేదే. ప్రస్తుత సందర్బంలో అలాంటి చర్యలతో డిమాండ్‌ ఏమాత్రం పెరగదు.
కాబట్టి దీనితో ఏం జరుగుతుందో స్పష్టంగా తెలుస్తున్నది. గ్రీస్‌ తనకు తలకుమించిన భారంగా తయారైన ఋణ సంక్షోభం నుంచి అత్యంత మానవీయంగా, అత్యంత హేతుబద్ధంగా బయటపడాలంటే ఐరోపా ఆర్థిక వ్యవస్థలో డిమాండ్‌ విస్తృతమవ్వాలి. అలా జరగటం వల్ల ఐరోపా ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన చెల్లింపుల సమతౌల్యానికి ఎటువంటి ప్రమాదం ఏర్పడదు. అయితే ఈ పరిష్కారం ద్రవ్య పెట్టుబడికి రుచించదు కాబట్టి ఆచరణీయం కాదు. పర్యవసానంగా ఐరోపాలో ద్రవ్య పెట్టుబడి నియంతృత్వం రాజ్యమేలుతుంది. ఈ పరిష్కారానికి బదులుగా మరింత 'పొదుపు చర్యలు' తీసుకోవాలని గ్రీస్‌ను ద్రవ్య పెట్టుబడి ఆదేశించింది. దానితో గ్రీస్‌లో మాంద్యం ఏర్పడుతుంది. నిరుద్యోగం పెరుగుతుంది. తద్వారా దిగుమతులు తగ్గుతాయి. ఈ పరిస్థితి గ్రీకు సంపద విదేశీ పెట్టుబడిదారుల పరమయ్యేందుకు దారితీస్తుంది. గ్రీస్‌ మీద రుద్దిన నూతన ఒప్పందంలో ఒక ముఖ్యమైన భాగమేమంటే హెల్లెనిక్‌ అస్సెట్‌ డెవలప్‌మెంటు ఫండ్‌ (టిఎఐపిఇడి)ను ఏర్పాటుచేయటం. ఈ ఫండ్‌ను విదేశీ అధికారులు నిర్వహిస్తారు. గ్రీస్‌ యాజమాన్యంలోని రేవులు, రైల్వేలు, అంతర్జాతీయ విమానాశ్రయాలు, ఒలింపిక్‌ వెన్యూతో సహా ఆస్తులన్నింటి అమ్మకాలను ఈ సంస్థ చేపడుతుంది. అలా అమ్మగా వచ్చిన మొత్తాన్ని గ్రీస్‌కున్న అప్పుకు సర్దుబాటు చేస్తారు. ప్రపంచంలోనే అత్యంత 'నాగరిక' ప్రాంతంగా చెప్పుకునే ఐరోపా యూనియన్‌ ఈ నిర్ణయం చేయటం విడ్డూరం!
వడ్డీ వ్యాపారిని అనుకరించటం
గ్రామాలలో రైతును ప్రైవేటు వడ్డీ వ్యాపారి ఇలానే పీడిస్తాడని, చరిత్రలో ముఖ్యంగా వలస పాలనలో 'ఒప్పందాల' అమలుకు చట్టపరమైన యంత్రాంగాన్ని స్థాపించటం ప్రతి భారతీయ పిల్లవాడికీ తెలిసిందే. రైతు భూమి, ఇంట్లో వస్తువులు, రైతు భార్య తన పెళ్ళినాడు తెచ్చుకున్న చిన్నచిన్న బంగారు ఆభరణాలనూ తనకు కట్టవలసిన అప్పు కింద వడ్డీ వ్యాపారి స్వాధీనం చేసుకుంటాడు. రైతుల పట్ల వడ్డీ వ్యాపారులు కిరాతకంగా వ్యవహరించటం గురించి అనేక కథలు, నవలలు, నాటకాలు, సినిమాలు ప్రతి భారతీయ భాషలో వచ్చాయి. అయితే నేడు అత్యంత 'నాగరిక' దేశాల ప్రభుత్వాలు ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వలే కొల్లగొట్టే ప్రవృతిని ప్రదర్శిస్తున్నాయి! ఇక్కడ ముఖ్యంగా రెండు అంశాలను గమనించాలి. మొదటిది, కొనసాగుతూ, తీవ్రమౌతున్న 'పొదుపు చర్యల విధానం' వల్ల సంపదను ఉపయోగించకపోవడం వల్ల దాని విలువ విపరీతంగా తగ్గిపోయింది. రెండవది, తన అప్పు తీర్చటానికి గ్రీస్‌ ఆస్తులను సాధ్యమైనంత తొందరగా అమ్మటం గ్రీస్‌ ప్రభుత్వానికి అనివార్యం. ఈ విషయం ఆ ఆస్తులను కొనదలుచుకున్నవారికి తెలుసు గనుక వారు కావలసినంత సమయం తీసుకుని వాటి ధరలను మరింతగా పతనమయ్యేలా చూస్తారు. కాబట్టి గ్రీస్‌ దేశానికి చెందిన ప్రభుత్వ ఆస్తుల యాజమాన్యం విదేశీ పెట్టుబడిదారుల చేతుల్లోకి పోవటమేకాకుండా వాటిని నామమాత్రపు ధరలకు అమ్మేలా ఆ దేశంపై ఒత్తిడి చేస్తారు! ఇలా ఆస్తులను కైవసం చేసుకున్న నూతన యజమానులకు వాటిని ఉత్పాదక ప్రయోజనాలకు ఉపయోగించటం పట్ల ఆసక్తి ఉండదు. తత్ఫలితంగా గ్రీస్‌ ఆర్థిక వ్యవస్థ వాస్తవంలో ఊరికినే నాశనమౌతూవున్నది.
25 సంవత్సరాల క్రితం జర్మన్‌ డెమోక్రటిక్‌ రిపబ్లిక్‌(తూర్పు జర్మనీ)లో ఒక ప్రైవేటైజేషన్‌ నిధిని ఏర్పాటుచేసి ప్రభుత్వ ఆస్తులను రకరకాల వ్యక్తులకు కట్టబెట్టారు. వీరికి ఆ ఆస్తులను అమ్ముకుని సొమ్ముచేసుకోవటంలో ఉన్న ఆసక్తి వాటిని ఉపయోగించటంలో సహజంగానే ఉండదు. అలా జర్మన్‌ డెమోక్రటిక్‌ రిపబ్లిక్‌లో జరిగిన దానికి, ప్రస్తుతం గ్రీస్‌లో జరుగుతున్న దానికి సారూప్యత ఉన్నదని విక్టర్‌ గ్రోస్‌మన్‌ మంత్లీ రివ్యూలో రాస్తూ పేర్కొన్నాడు. జర్మన్‌ పెట్టుబడి దృష్టిలో ఈ రెండు పరిస్థితుల మధ్య సారూప్యత ఉన్నది. ఈ రెండింటిలో ఒక్కో దాని విషయంలో వామపక్షాన్ని పాలనకు ఎంచుకున్నందుకు ప్రజలను శిక్షించాలనే కోరిక కనపడుతోంది. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన తేడా ఉన్నది. గ్రీక్‌ ఆర్థిక వ్యవస్థ నాశనమవుతుండగా అలెక్సీ సిప్రాస్‌ నాయకత్వ స్థానంలో ఉన్నట్లు జర్మన్‌ డెమోక్రటిక్‌ రిపబ్లిక్‌ ఆర్థిక వ్యవస్థ నాశనమవుతుంటే ఎరిక్‌ హోనేకర్‌ నాయకత్వ స్థానంలో లేడు. 
- ప్రభాత్‌ పట్నాయక్‌