అభివృద్ధి - హక్కులు

అభివృద్ధి అనే మాట ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఒక మంత్రంలా వినపడుతోంది. ఇంకొక విధంగా చెప్పాలంటే దేశంలో కూడా మన నాయకులు చాలా చోట్ల ఈ పదాన్ని పదే పదే ఉపయోగిస్తూ ప్రజలను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారు. కొన్ని చోట్ల వేలాది, లక్షలాది మంది ప్రజలను నిర్వాసితులను చేస్తున్నారు. అలాగే లక్షలాది ఎకరాలను వివిధ రకాల పేర్లతో సేకరిస్తున్నారు. అభివృద్ధి చేస్తున్నాం అనే పేరుతో ప్రజల ఆస్తులను, హక్కులను హరిస్తున్నట్లు అనేక వార్తలను చూస్తున్నాం. అభివృద్ధి చేస్తున్నాం కదా అని ప్రజలు త్యాగాలు చేయాలి, నష్టాలు భరించాలని చెబుతున్నారు. నాయకులు అభివృద్ధి చేస్తున్నారు కనుక ప్రజలు కష్టాలు భరించాలా? త్యాగాలు చేయాలనేది పరిశీలించనప్పుడు అభివృద్ధి చేయటం నాయకుల గొప్పతనమో లేదా నాయకులు ప్రజలకిచ్చే బిగ్‌ షో కాదు. అభివృద్ధి చెందటం, అభివృద్ధిలో భాగస్వామ్యం పొందటం ప్రజల హక్కు. 1986లో ఐక్యరాజ్యసమితి చేసిన తీర్మానం ప్రకారం అభివృద్ధి హక్కు అనేది మానవహక్కుల్లో ఒక భాగం. ప్రభుత్వాలు ప్రజలను భాగస్వాములను చేసి, అభివృద్ధి చేసి ఆ అభివృద్ధి ఫలాలు సమానంగా ప్రజలకు పంపిణీ చేయాలి.
అభివృద్ధి ఎలా ఉండాలి అనే విషయమై సుప్రీంకోర్టు ఒక తీర్పు చెప్పింది. ఈ తీర్పు ప్రకారం అభివృద్ధి స్థిరమైన అభివృద్ధిగా ఉండాలి. ఇప్పుడు స్థిరమైన అభివృద్ధి రాజ్యాంగపు ఒక అవసరం. స్థిరమైన అభివృద్ధి అంటే సహజ వనరుల విషయంలో ప్రస్తుత ప్రజల అవసరాలను తీర్చుతూ భవిష్యత్తు తరాలవారి శక్తికి తగిన విధంగా అవసరాలు తీర్చే విషయంలో రాజీ పడకుండా చేస్తుంది. అంటే భవిష్యత్తు తరాలు సహజ వనరుల కోసం, ప్రకృతి వనరుల లేమితో ఇబ్బందులు పడకుండా చేస్తుంది. ఆవిధంగా అభివృద్ధి సుస్థిరంగా ఉండాలి. వాతావరణానికి ఎంత నష్టం కలుగుతుందో ప్రతి అభివృద్ధి పని జరిగేటప్పుడు చూడాలి. అభివృద్ధి క్రమంలో అనంతర తరాల సమానత్వం అనే సిద్ధాంతాన్ని పాటించాలి. అలాగే అభివృద్ధి పేరుతో మానవహక్కులు, కార్మిక చట్టాలు, ప్రకృతి చట్టాలు ఏవీ ఉల్లఘించబడకుండా చూడాలి. ఉద్యోగ కల్పన, జీవన ప్రమాణాల పెంపుదల మొదలైన అంశాలు అభివృద్ధి నేరవేర్చాలి. అభివృద్ధి అంటే జిడిపిలో పెరుగుదల మాత్రమే కాదు. దానిలో ఇన్‌క్లూజివ్‌ గ్రోత్‌ కూడా ఉండాలి. ఇన్‌క్లూజివ్‌ గ్రోత్‌ అనగా ఆర్థికవృద్ధిలో పాల్గొన్న భాగస్వాములందరికీ సమాన అవకాశాలు ఉండి సమాజంలో ప్రతి భాగం ప్రజలు అభివృద్ధి ఫలాలను పొందేటట్లు ఉండాలి. అనగా అభివృద్ధిలో ప్రతి ఒక్కరిని ఇన్‌క్లూడ్‌ చేసుకోవటమే(ఇమిడ్చుకోవటం) ఈ తరహా గొప్పతనం. మత, వర్గ, లింగ భేదాలు లేకుండా అందరినీ ఈ తరహా అభివృద్ధి ఇముడ్చుకొని దీర్ఘకాలంపాటు కొనసాగే లక్షణం కలదే ఈ వృద్ధి. ఇలాంటి ప్రజలందరి భాగస్వామ్యం ముఖ్యంగా కార్మిక శక్తిని ఇమిడ్చుకునే అభివృద్ధిని కలిగి ఉండటమే అభివృద్ధి లక్షణంగా ఉండాలి. పై సూత్రాలను పరిశీలించినప్పుడు అభివృద్ధి పేరుతో ప్రభుత్వం ప్రజల సొమ్మును కార్పొరేట్‌ శక్తులకు, దళారీ వ్యవస్థకు దోచి పెట్టడంకాదు. ఆకాశ హర్మ్యాలు, భారీ ప్రాజెక్టులు కాకుండా సమాజంలోని మొత్తం ప్రజలందరికీ లాభదాయకమైన దీర్ఘకాలిక ప్రయోజనాలకు, భవిష్యత్తు తరాల అభివృద్ధికి కూడా బాట వేసేది అభివృద్ధి. 1986లో ఐక్యరాజ్యసమితి చేసిన తీర్మానం ప్రకారం అభివృద్ధి చెందటం అనేది అందరి హక్కు. అది మానవహక్కుల్లో ఒక భాగం. మానవ హక్కుల హై కమిషనర్‌ నావిపిళ్లే మాటలలో చెప్పాలంటే అభివృద్ధి ఫలాల పంపిణీలో వివక్షత అంతం కావాలి. ప్రజలు ఆ దేశ సహజ వనరుల వల్ల చేకూరే లబ్ధిని పొందేటట్లు చూడాలి. నిర్ణయాలు తీసుకోవటంలో అర్థవంతమైన భాగస్వామ్యం ఉండేటట్లు చూడాలి. అలాగే ప్రభుత్వాలు అభివృద్ధికి ఉన్న ఆటంకాలు తొలగించడానికి సహకరించుకోవాలి అని ఆ ప్రకటన తెలియ జేస్తుంది.
ఒక దేశంలో నిషేధించిన సంస్థకు మన దేశంలో అనుమతి ఇవ్వాలనే ప్రతిపాదన వచ్చినప్పుడు సుప్రీంకోర్టు స్వయంగా కలుగజేసుకొని ఏ ప్రాంతంలో అయితే ఆ సంస్థ ప్రాజెక్టు నిర్మించ తలపెట్టిందో ఆ ప్రాంతం ప్రజలకు ముఖ్యంగా భూములను కోల్పోతున్న వారికి ఎలాంటి ఉద్యోగ అవకాశాలు శాశ్విత ప్రాతిపదికన ఆ సంస్థ కల్పిస్తుందో అఫిడవిట్‌ దాఖలు చేయమని కోరింది. అలాగే ఆ ప్రాంతం వెనుకబాటుతనాన్ని తొలగించడానికి ఆ సంస్థలే బాధ్యత తీసుకోవాలని సూచించాయి. ఆ సంస్థల లాభాలలో కొంత మొత్తాన్ని ఆ ప్రాంత అభివృద్ధికి ఖర్చు పెట్టాలని, ఆ ప్రాంత ప్రజలకు శాశ్విత ప్రాతిపదికన ఉద్యోగాలు కల్పించాలని పేర్కొంది. ఆ విధంగా చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసినప్పుడు ప్రజలకు ప్రభుత్వం ఇచ్చే ప్రయోజనాలకు ఎటువంటి చట్టబద్ధ హామీ లేదు. భూముల స్వభావం మారటం వల్ల ఉపాధి కోల్పోయే కార్మికులకు, కౌలు, చిన్న సన్నకారు రైతులకు, ఎటువంటి ఉపాధి హామీ సిఆర్‌డిఎ చట్టంలో కల్పించబడలేదు. సిఆర్‌డిఎ పరిధిలోని ప్రజలు రాజధాని నిర్మాణం వల్ల ఎలాంటి ప్రయోజనాలు పొందుతారో చట్టపరంగా ఎటువంటి ప్రస్తావన లేదు. అనేక చోట్ల భూమి సేకరిస్తున్న ప్రభుత్వం ఫలితంగా ఆ ప్రజలకు లభిస్తున్న శాశ్వత ప్రయోజనాలు ఏమిటి? దానికి మార్గాలు ఏమిటో ఎక్కడా చెప్పటం లేదు. చట్టబద్ధమైన హామీలివ్వడం లేదు.
అభివృద్ధి చేస్తున్నాం కనుక ఏమైనా చేయవచ్చు. కొంత డబ్బు ప్రజల మొహాన వేసి భూమిని లాక్కోవచ్చు అని భావించడం ధర్మవిరుద్ధం. చట్ట విరుద్ధం. ''భూమిని కోల్పోయే భూ యజమానులకు, భూ సేకరణ వలన ప్రభావితమయ్యే కుటుంబాలకు అతి తక్కువ ఇబ్బందులు కలిగేలా చూడాలి. అందులో భాగంగా భూ సేకరణ ప్రక్రియ అంతా పారదర్శకంగా ఉండాలి. ముందుగా భారత రాజ్యాంగం క్రింద ఏర్పాటు కాబడిన స్థానిక ప్రభుత్వాలతోను, గ్రామసభలతోను చర్చించి, వారిని కూడా భూసేకరణ ప్రక్రియలో భాగస్వాములను చేయాలి. భూసేకరణ వలన భూములను కోల్పోయేవారికి, అందువలన నష్టపోయేవారికి న్యాయబద్ధమైన, హేతుబద్ధమైన నష్టపరిహారం చెల్లించాలి. అంతేకాక వారికి సరైన పునరావాసాన్ని, పునరుపాధిని కల్పించాలి. మొత్తం మీద ఈ నిర్బంధ లేక బలవంతపు భూసేకరణ అంతిమ లక్ష్యం భూసేకరణ ఫలితంగా జరిగే అభివృద్ధిలో వారంతా భాగస్థులు కావటం. భూసేక రణ ముందుకన్నా, భూసేకరణ తర్వాత వారి సామాజిక, ఆర్థిక స్థితి గతులలో గొప్ప అభివృద్ధి ఉండాలి. ''ఇది భూసేకరణ, నష్టపరిహారం, పునరవాస, పునర్‌ ఉపాధి కల్పన చట్టం 2013 లక్ష్యాలు. మరి భూమి కోల్పోతున్న వారందరికీ, నిర్వాసితులకు వారి సామాజిక, ఆర్థిక స్థితిగతుల్లో గొప్ప అభివృద్ధి ఉంటుందని చట్టబద్ధమైన హామీ ఎక్కడా లభించలేదు. మానవ హక్కులు, కార్మిక చట్టాలు ఉల్లఘిస్తున్నారు అని ఒక సంస్థను (వేదాంత అల్యూమినియం) నార్వే దేశం బహిష్కరించింది. మరి మన దేశంలో కార్మిక చట్టాలు, కాలుష్య చట్టాలు, మానవ హక్కులు హరించబడుతున్న పరిస్థితులలో ప్రభుత్వాలు చర్యలు తీసుకున్న సందర్భాలు ఏమైనా ఉన్నాయా? నిర్వాసితులు, ప్రభావితం అవుతున్న ప్రజలు భయాందోళనతో పోరాటాలు చేస్తుంటే వారిపై ఉక్కుపాదం మోపటం ప్రజల పౌరహక్కుల ఉల్లంఘన కాదా? అతి తక్కువ ఇబ్బందులు కలిగేలా చూడాలనే 2013 భూ సేకరణ చట్టానికి విరుద్ధంగా అవసరానికి మించి భూసేకరణ చేయ టం చట్టాల ఉల్లంఘన కాదా? అభివృద్ధి చెందటం ప్రజల హక్కు అయినప్పుడు అభివృద్ధి ఫలాలను సమానంగా పొందటం ప్రజల హక్కు అయినప్పుడు ప్రభుత్వం ఆ విషయంలో ఏమి గ్యారంటీ ఇచ్చింది? ప్రజా రాజధాని పేరుతో చేపట్టిన ప్రాజెక్టుకు సంబంధించి చేసిన సిఆర్‌డిఎ చట్టంలో ఏ ఒక్క సెక్షను కూడా ప్రజల ప్రయోజనాల గురించి గాని, ఈ ప్రాజెక్టు వల్ల లబ్ధి పొందే ప్రజల గురించి గాని లేదు. ఎటువంటి చట్టబద్ధమైన ప్రయోజనాలను పొందుపరచ కుండా చట్టం చేసి రాజధాని నిర్మిస్తూ ప్రజా రాజధాని అంటే ఎలా నమ్మాలో పాలకులే చెప్పాలి. పౌరహక్కులు, మానవహక్కులు, భూసేకరణ చట్టాలు అమలు చేయకుండా అభివృద్ధి అంటే అది ప్రజాప్రయోజనాలకు సంబంధించింది కాదు అని అర్థం చేసుకుంటున్నారని పాలకులు గ్రహిస్తారని ఆశిద్దాం. 
- పొత్తూరి సురేష్‌ కుమార్‌ 
(వ్యాసకర్త హైకోర్టు న్యాయవాది)