అభివృద్ధికి అడ్డం చంద్రబాబే

అభివృద్ధికి అడ్డం వస్తే అణిచివేస్తానంటూ చంద్రబాబు ప్రకటనలు చేస్తున్నారని, అభివృద్దికి అడ్డం వస్తుందే చంద్రబాబని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు ఎస్‌ పుణ్యవతి విమర్శించారు. కార్మికులు తమ హక్కులు కాపాడుకోవడం కోసం, ప్రభుత్వ రంగాన్ని రక్షించుకునేందుకు సెప్టెంబర్‌ రెండున దేశవ్యాప్తంగా సమ్మె చేపడుతున్నారని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చిన ఏడాదికాలంలో కార్మికుల శ్రమను దోచి కార్పోరేట్‌ వర్గాలకు అప్పగించేందుకు ప్రయత్నం చేశారని విమర్శించారు. చంద్రబాబు వచ్చిన ఏడాదిలో 1600 మంది ఉద్యోగులకు తొలగింపు ఉత్తర్వులు ఇచ్చారని పేర్కొన్నారు. ఉద్యోగులు, కార్మికులు కనీసవేతనాలు అడిగితే చంద్రబాబు డబ్బులు లేవంటున్నారని, విదేశాలకు తిరగడానికి రూ.కోట్లు తగలబెడుతున్నారని దుయ్యబట్టారు. ఎవ్వడబ్బ సొమ్మని విదేశాలు తిరుగుతున్నావని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు మహిళల శ్రమను దోచుకుంటున్నారని దుయ్యబట్టారు. అంగన్‌వాడీలకు రెండు వేల వేతనం ఇచ్చి వెట్టిచాకిరీ చేయిస్తున్నారని పేర్కొన్నారు. మధ్యాహ్న భోజనం కార్మికులకు అదే పరిస్థితి అని చెప్పారు. విదేశాలు తిరుగుతున్న చంద్రబాబు ఏ దేశంలోనైనా రెండు వేలకు పని చేయించుకుంటున్నారా అని ప్రశ్నించారు. ఇలాంటి విధానాలను అవలంబిస్తున్న పాలకులను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. సెప్టెంబర్‌ రెండున జరిగే సమ్మెను విజయవంతం చేయాలని కోరారు.