అభివృద్దికి పేదలు అడ్డుకాదు..

అభివృద్ధికి పేదల గుడిసెలు అడ్డంకి కాదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌. బాబూరావు అన్నారు. భవానీపురం కరకట్ట సౌత్‌ ప్రాంతమైన భవానీఘాట్‌ నుండి పున్నమి హాోటల్‌ వరకు సిపిఎం ఆధ్వర్యంలో ఆదివారం పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాబూరావు మాట్లాడుతూ కరకట్ట వాసులు వారం రోజుల్లోగా ఇళ్లను ఖాళీచేసి జెఎన్‌యుఆర్‌ఎం ఇళ్లకు తరలివెళ్లాలని నగరపాలకసంస్థ అధికారులు నోటీసులు జారీచేయటం సిగ్గుచేటన్నారు. దాదాపుగా 40 సంవత్సరాలుగా నగరానికి దగ్గరగా వుండి ఏదోఒక పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని, అలాంటి వారిని ఏక్కడో దూరంగా పడేస్తే వారి జీవన భృతి కష్టతరంగా మారుతుందన్నారు. ఎన్‌టి రామారావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొందరికి రిజిస్ట్రేషన్‌ పట్టాలు కూడా ఇచ్చారని తెలిపారు. ఏళ్ళతరబడి నివసించేవారికి ఒకేసారి జెఎన్‌యుఆర్‌ఎం ఇళ్లకు 66 వేలు కట్టాలనటం హేయమైన చర్య అన్నారు. ఇంతకుముందు జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం ఇళ్లు కేటాయించిన వారికి సరైన సదుపాయాలు కూడా కల్పించలేదన్నారు. మీకు అధికారులు నోటీసులు ఇవ్వటానికి వస్తే తీసుకోకుండా తిరస్కరించాలని సూచించారు.