అభివృద్దికి నోచని ఉత్తరాంధ్ర : కృష్ణమూర్తి

నవ్యాంధ్రప్రదేశ్‌లోనూ ఉత్తరాంధ్ర పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎం కృష్ణమూర్తి ఆవేదన వ్యక్తంచేశారు. ఉత్తరాంధ్రను సమగ్రంగా అభివృద్ధి చేయాలనే డిమాండ్‌తో సిపిఎం ఆధ్వర్యాన ఉత్తరాంధ్ర అభివృద్ధి సదస్సు రణస్థలంలోని దేవిశ్రీ కల్యాణ మండపంలో సోమవారం జరిగింది. ఇందులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఉత్తరాంధ్రలోనే అత్యధిక వర్షపాతం, 16 జీవనదులు, మరెన్నో జీవగెడ్డలు ఉన్నాయని, అయినా, పాలకుల నిర్లక్ష్యం వల్ల ఈ ప్రాంతం కరువుపీడిత ప్రాంతంగా ఉందని తెలిపారు. ఉత్తరాంధ్రలో జ్యూట్‌, ఫెర్రోఎల్లాయీస్‌ పరిశ్రమలు మూతపడి 30 వేల మందికి ఉపాధి పోయిందన్నారు. ఉత్తరాంధ్రలో విపరీతమైన కాలుష్యం వెదజల్లే పరిశ్రమలను మాత్రమే నెలకొల్పుతున్నారని తెలిపారు.శ్రీకాకుళం జిల్లాలో థర్మల్‌, అణువిద్యుత్‌, రసాయన పరిశ్రమలు పెట్టి ఉత్తరాంధ్రను డంపింగ్‌ యార్డుగా మారుస్తున్నారని విమర్శించారు.