అప్పుల ఆడంబరం..

ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత సామెత రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి నప్పుతుంది. పూట గడిస్తే చాలన్నట్లు విత్త సమస్య అఘోరిస్తున్నా సర్కారు అట్టహాసాలకు ఆడంబరాలకు తక్కువేం లేదు. మొన్న గోదావరి పుష్కరాలు నిన్న నదుల అనుసంధానం నేడు అమరావతి శంకుస్థాపన హద్దు మీరిన ప్రభుత్వ ప్రచార పటాటోపానికి మచ్చు తునకలు. అమరావతి భూమి పూజ, సంకల్ప దీక్ష వగైరా వగైరా ఉండనే ఉన్నాయి. నీరు-చెట్టు, రైతు భరోసా, స్వచ్ఛ భారత్‌ వంటి అనేకానేక ఆర్భాట కార్యక్రమాలకు కొదవే లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ అని పిలిపించుకోవడం ఇష్టం. ఈవెంట్‌ మేనేజర్‌ అంటే మరీ ఇష్టం. ఆ 'ఘన కీర్తి' కోసం విషయం చిన్నదా పెద్దదా అనే విచక్షణ లేకుండా హంగు ఆర్భాటాలకు పోయి చేతులు కాల్చుకున్న ఉదంతాలు అనేకం. గత తొమ్మిదిన్నరేళ్ల ఏలుబడిలో అత్యధిక రోజులు ఓవర్‌ డ్రాఫ్టు (ఒడి)కు వెళ్లిన కఠోర సత్యం జనానికి పరిచయమే. కాగా విభజన సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్రానికి సిఎం అయిన బాబు గత ఆర్భాట జాఢ్యాలను వదిలిపెట్టకపోగా ఇంకా రెచ్చిపోతున్నారు. టిడిపి సర్కారు ఈ ఏడాదిలో ఇప్పటికే వేస్‌ అండ్‌ మీన్స్‌ను దాటి ఓవర్‌ డ్రాఫ్ట్‌ (ఓడీ)కి వెళ్లడం ఆర్థికపరంగా అనారోగ్యం. వేస్‌ అండ్‌ మీన్స్‌ అంటే చేబదులు. రూ.770 కోట్లు ఆ విధంగా సర్దుబాటు చేసుకోవచ్చు. అ పరిమితికి దాటితే ఓడీనే దిక్కు. ఓడీ తీసుకుంటే ఐదు శాతం వడ్డీ కట్టాలి. రెండు వారాల్లో వడ్డీ చెల్లించాలి. నిర్ణయించిన కాల పరిమితి లోపు కట్టకుంటే సర్కారు చెల్లింపులన్నింటినీ ఆర్‌బిఐ నిలిపేస్తుంది. ఎక్కువ తడవలు ఓడీకి వెళితే రాష్ట్ర పరపతి రేటింగ్‌ పడిపోతుంది. ఈ సమస్య నుంచి బయట పడేందుకు బహిరంగ మార్కెట్‌లో సెక్యూర్టీ బాండ్లు అమ్మి రుణ సమీకరణ చేస్తోంది. ఇలా ఒక అప్పు నుంచి బయట పడటానికి మరో కొత్త అప్పు చేస్తే ప్రభుత్వం మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటుందనేది ప్రతిపక్షాల విమర్శే కాదు ఆర్థిక నిపుణుల హెచ్చరిక కూడా. ప్రభుత్వం అప్పులు చేస్తున్నది వివిధ వర్గాల ప్రజలను ఉద్ధరించడానికి కాదు. అనేక షరతులతో సామాజిక పింఛన్లకు కోత పెట్టింది. రేషన్‌కార్డులను ఏరివేసేందుకు బయోమెట్రిక్‌ వంటి వడపోతలతో పేదల నోట్లో మట్టి కొడుతోంది. ప్రధాన హామీ రుణ మాఫీకి పెట్టిన షరతులు అన్నీ ఇన్నీ కావు. రైతు రుణ మాఫీ రెండో కిస్తీ అతీగతీ లేదు. నిరుడు ఖరీఫ్‌లో కరువొస్తే ఈ ఖరీఫ్‌లో రైతులకు పెట్టుబడి రాయితీ విడుదల చేసింది. హుదూద్‌ పునరావాస చర్యలు ఘోరం. ఇలా చెప్పుకుంటూ పోతే వివిధ వర్గాల ప్రజలకు హామీలిచ్చి నెరవేర్చని వాటి జాబితా చాంతాడంత. మరి వేస్‌ మీన్స్‌, ఓడీ, బహిరంగ రుణాలు ఎవరి కోసం? ఖజానాలో డబ్బుల్లేనప్పుడు సంకల్పదీక్షకు బస్సులు పెట్టి జనాన్ని తరలించడం, రాజధానికి భూమి పూజ ఒకసారి, శంకుస్థాన ఇంకోసారి ఎందుకు? రాష్ట్రంలోనే ప్రత్యేక విమానాల్లో చెక్కర్ల మాటేంటి? రాజు వెడలె... అనే రీతిలో పటాలాన్ని వెంటబెట్టుకొని జపాన్‌, సింగపూర్‌ పర్యటనలు అవసరమా? సిఎం కోసం అత్యాధునిక బస్సు కొనుగోలుకు కోట్లు తగలేయాలా? ఎన్నడూ లేని రీతిలో కృష్ణా డెల్టాను ఎండబెట్టి నదుల అనుసంధాన సభకు ఆడంబరాలెందుకు? కేబినెట్‌ హోదాలిచ్చి మరీ పదుల సంఖ్యలో సలహాదారులెందుకు? అధ్యయనాల పేర మంత్రులు, అధికారుల విదేశీ, స్వదేశీ పర్యటనలు, స్టార్‌ హోటళ్లల్లో విడిది వృధా ఖర్చులేగా? రూ.వందలు వేల కోట్ల ఈ వ్యయాలను కట్టడి చేస్తే ఓడీ అవసరం ఉండదుగా? ఉద్యోగుల జిపిఎఫ్‌, కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాలు, పిఆర్‌సి అమలు నిలిపేసి ఆర్భాట ఖర్చులా?
సర్కారు అప్పులు ఎప్పుడో బడ్జెట్‌ను మించాయి. 2015-16 బడ్జెట్‌ మొత్తం రూ.1.13 లక్షల కోట్లు కాగా అప్పు రూ.1.46 లక్షల కోట్లు. బాబు గద్దెనెక్కిన ఒక్క సంవత్సరంలో రూ.17 వేల కోట్ల అప్పులయ్యాయి. విభజన వలన లోటు ఈ ఏడాది రూ.17 వేల కోట్లకు మించుతుందని అంచనా. పరిస్థితి ఇంత క్లిష్టంగా ఉన్నా బాబు సర్కారుకు అప్పు చేసి పప్పుకూడు తినాలన్న రంధి. కేంద్ర పన్నులు, గ్రాంట్లు, సహాయం అంతకంతకూ తగ్గుతోంది. గతేడాది రూ.45 వేల కోట్లు వస్తాయనుకుంటే ఆశాభంగమైంది. దీంతో ఈ సంవత్సర అంచనాలను రాష్ట్రం రూ.40 వేల కోట్లకు కుదించుకుంది. వీటిలో ఎన్ని వచ్చాయో చెప్పలేని స్థితిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలున్నాయి. రాష్ట్రానికి అదనపు సాయం మాట అటుంచి సాధారణంగా ఇచ్చే నిధులు సైతం కేంద్రం ఇవ్వట్లేదు. అయినా టిడిపి సర్కారు నోరు మెదపట్లేదు. పైగా మోడీ సర్కారు ఎపికి అన్నీ చేస్తోందని వెనకేసుకొస్తోంది. వస్తు సేవా పన్ను (జిఎస్‌టి) అమల్లోకొస్తే కేంద్ర వాటా మరింత తగ్గుతుంది. కాగా ఈ కాలంలో ప్రజలపై పన్నులు మాత్రం బాదుతూనే ఉంది. మొదటి ఆర్నెల్లలో రాష్ట్ర పన్ను వసూళ్లు తక్కువేం కాదు. టార్టెట్లూ గత ఏడాది కంటే ఎక్కువే. ఒక వ్యక్తికి కుటుంబానికే కాదు రాష్ట్రానికి కూడా ఆర్థిక క్రమశిక్షణ అవసరం. అది లేకుంటే ఇబ్బందులు తప్పవు. విభజనతో సతమతమవుతున్న ఎపి మరింత జాగ్రత్త పడాలి. స్నోలు, పౌడర్ల వంటి పైపై మెరుగులపై ఉన్న శ్రద్ధ ఆస్తుల సృష్టిపైనా, ప్రజల సంక్షేమంపైనా లేదనే విమర్శ బాబు పార్టీ ఎదుర్కొని పదేళ్లు ప్రతిపక్షానికి పరిమితమైంది. మళ్లీ అదే దారిలో వెళ్లడం విజ్ఞతెలా అవుతుంది?