అన్నిశాఖలపై ప్రపంచబ్యాంకు పెత్తనానికి యత్నం..

 ప్రపంచ బ్యాంకు ఈ నెల 14న 'అసెస్‌మెంట్‌ ఆఫ్‌ స్టేట్‌ ఇంప్లిమెంటేషన్‌ ఆఫ్‌ బిజినెస్‌ రిఫామ్స్‌' అనే నివేదికను విడుదల చేసింది. ఈ ఏడాది జనవరి 1-జూన్‌ 30 మధ్య పారిశ్రామిక, వ్యాపార సంస్కరణలకు సంబం ధించి 98 అంశాలను మదింపు చేసింది. ప్రపంచ బ్యాంక్‌ కీలక పాత్ర పోషించి రూపొం దించిన ఈ నివేదిక రూపకల్పనలో మేక్‌ ఇన్‌ ఇండియా, కెపియంజి, సిఐఐ, ఫిక్కీ ఉన్నాయి. ఇందుకు 285 ప్రశ్నలను రూపొందించి, వాటికి ఆయా రాష్ట్రాలు ఇచ్చిన సమాధా నాలు, ప్రస్తుత పరిస్థితిని పరిశీలించి ర్యాంకులు నిర్ణయిం చినట్లు నివేదికలో పేర్కొంది. ఈ ప్రశ్నలలో కార్మిక చట్టాల నియంత్రణకు సంబంధించినవి 51 కాగా, మరో 61 తనిఖీలకు సంబంధించినవి. మిగిలిన 112 ప్రశ్నలు ఫ్యాక్టరీలు, సంస్థలకు సంబంధించినవి. యజమానులు చెల్లించాల్సిన పన్నులకు సంబంధించి 44 ప్రశ్నలున్నాయి. అంటే కార్మిక సంక్షేమానికి సంబంధించినవిగాని, యజమానుల పన్నులపై ఉన్న తనిఖీకి సంబంధించినవిగాని 156 ప్రశ్నలున్నాయి. సగానికి పైగా వీటిపైనే కేంద్రీకరించారు. సాధారణంగా కొత్త పరిశ్రమ లేదా వ్యాపారం ఏర్పాటుకు మౌలిక వసతులు అత్యంత కీలకం. కానీ ఇందులో కేవలం 21 ప్రశ్నలపై మాత్రమే ప్రపంచ బ్యాంకు దృష్టి సారించింది. పరిశ్రమలు, వ్యాపారం ఏర్పాటు చేయడానికి దేశంలోని 32 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 71.14 శాతంతో గుజరాత్‌ మొదటి స్థానం లోనూ, 70.12 శాతంలో ఆంధ్రప్రదేశ్‌ రెండో స్థానంలోనూ, 63.09 శాతంతో జార్ఖండ్‌ మూడో స్థానంలో నూ ఉంది. మానవాభివృద్ధి సూచికల్లో ప్రథమ స్థానంలో ఉన్న కేరళ, ఈ నివేదికలో 22.87 శాతంతో 18వ స్థానంలో నిలిచింది. మహారాష్ట్ర ఎనిమిదవ స్థానంలోనూ, పంజాబ్‌ 16వ స్థానంలోనూ నిలిచాయి. తలసరి ఆదాయం తక్కువగా ఉన్న రాష్ట్రాలు సంస్కరణల వేగంలో ముందున్నాయని పేర్కొంది. వ్యాపారం నిర్వహించడానికి అనువైన రాష్ట్రాల్లో మొదటి స్థానంలో పంజాబ్‌, రెండో స్థానంలో ఎపి ఉన్నాయి. కార్మిక చట్టాలకు సంబంధించిన సంస్కరణల అమలులో జార్ఖండ్‌ మొదటి స్థానంలోనూ, ఆంధ్రప్రదేశ్‌ నాలుగో స్థానంలోనూ ఉందని పేర్కొంది. పన్నుల సంస్కరణల విషయంలో కర్ణాటక మొదటి స్థానం, ఆంధ్రప్రదేశ్‌ రెండో స్థానంలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌ ఏడు సంస్కరణలను అమలు చేసిందని, వాటిలో పన్నులు, భూమి, రిజిస్ట్రేషన్‌, సింగిల్‌ విండో కాగా, మూడు కార్మిక చట్టాలకు సంబంధించినవే. ఈ నివేదిక మొదటిదని, ముందుముందు అనేక సిఫార్సులతో నివేదికలు వస్తాయని మొదటి పేరాలోనే స్పష్టం చేసింది. అంటే పరిశ్రమలు, వ్యాపారం పేరిట అన్ని రాష్ట్రాల మీదా ప్రపంచ బ్యాంకు పెత్తనం చేస్తుందని అర్థం. పర్యావరణ సంబంధ విషయాల్లో గుజరాత్‌ మొదటి స్థానంలో ఉండగా, రెండో స్థానంలో ఆంధ్రప్రదేశ్‌ ఉంది. మౌలిక వసతుల కల్పనలో మహారాష్ట్ర మొదటిస్థానంలో ఉండగా, ఎపి ఐదో స్థానంలో ఉంది. కొత్త పరిశ్రమలు, వ్యాపారం ఏర్పాటు పేరుతో కార్మికులు, కార్మిక చట్టాలపై ఈ నివేదికలో తీవ్రమైన దాడి జరిగింది. కార్పొరేట్ల పన్నులను తగ్గించేందుకు సూచనలున్నాయి. దేశంలో పెట్టుబడులు పెట్టేవారికి, వ్యాపారులకు ప్రభుత్వ నియం త్రణ పెద్ద భారంగా ఉందని ప్రపంచ బ్యాంకు డైరెక్టర్‌ ఓనో రుల్‌ తన ముందు మాటలో తెలిపారు. చేపట్టవలసిన సంస్కరణల్లో మొదటి 10 అంశాలను పేర్కొన్నారు. అందు లో గ్రాట్యుటీ, కనీస వేతనాలు, షాప్‌ అండ్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌, పేమెంట్‌ ఆఫ్‌ వేజెస్‌, సమాన పనికి సమాన వేతనం, బోనస్‌ లాంటి చట్టాలను అమలు చేయడానికి జరిగే తనిఖీలను సంస్కరించాలని నివేదికలో పేర్కొన్నారు. పరి శ్రమ యజమాని ఇచ్చే స్వీయ నివేదికనే పరిగణనలోకి తీసు కోవాలని సూచించింది. భూములను కార్పొరేట్లకు చౌకగా ఇవ్వడానికి 'ల్యాండ్‌ బ్యాంక్‌ అవైలబులిటీ' ఆన్‌లైన్‌లో ఉండాలని పేర్కొన్నది. జిఐఎస్‌ విధానం ద్వారా దీనిని అమలు చేయాలని పేర్కొన్నారు. రైతుల దగ్గర బలవంతంగా భూ సేకరణ దీని కోసమేన న్నమాట. దేశంలో పరిశ్రమలకు, వ్యాపారానికి భూమి లభ్యత ఒక పెద్ద ఆటంకంగా ఉందని నివేదిక పేర్కొంది. అవసరానికి మించి సేకరించిన భూములు, ఖాళీగా ఉన్న సెజ్‌ల గురించి మాత్రం ఆ నివేదిక నోరు విప్పలేదు. భూమి కేటాయింపు, నిర్మాణ అనుమతుల మంజూరులో మధ్యప్రదేశ్‌ మొదటి స్థానంలో ఉండగా, ఆంద్ర óప్రదేశ్‌ ఐదో స్థానంలో ఉంది. సంస్కరణలు రాష్ట్ర స్థాయిలో అమలు జరగాలని, అందుకు రాష్ట్రాల స్థాయిలో ప్రభుత్వ నియంత్రణలను తగ్గించడం ముఖ్యమని తెలిపింది. సంస్క రణల ప్రభావం, దాని లబ్ధిదారులైన ప్రైవేటురంగం పూర్తిగా గుర్తించేటట్లు కార్యాచరణ ఉండాలని నివేదిక స్పష్టం చేసింది.
ప్రభుత్వ శాఖలు సమర్థవంతంగా వ్యవహరించ డంలేదని, సిబ్బంది తగినంతమంది లేరని, అన్ని సంస్థలను రెగ్యులర్‌గా పూర్తి స్థాయిలో తనిఖీ చేసే సామర్థ్యం లేదని తెలిపింది. పరిశ్రమలకు సొంత సర్టిఫికెట్‌తో అనుమతి వ్వాలని చెప్పింది. బాయిలర్‌లు, (ఫాక్టరీల తనిఖీలో బాయి లర్‌ ఇన్‌స్పెక్షన్‌ ఒక ముఖ్యమైన అంశం) ఇతర భద్రతలకు సంబంధించి తనిఖీలు కూడా లేకుండా థర్డ్‌పార్టీ సర్టిఫికెట్‌ ఆధారంగా అనుమతులు మంజూరు చేయాలని పేర్కొంది. మన స్వతంత్రతకు, రాజ్యాంగంలోని ఫెడరల్‌ స్ఫూర్తికి ఇది భిన్నం. ఇప్పటికే జార్ఖండ్‌లో సొంత సర్టిఫికెట్‌ ఆధారంగా రెన్యువల్‌, రిటర్న్స్‌ అనుమతిస్తున్నారు. 14 కార్మిక చట్టాలకు సంబంధించిన అన్ని తనిఖీలూ ఎత్తివేసి ఐదేళ్లకొకసారి, ఒక్కరోజునే తనిఖీ చేసేలా విధానం రూపొందించడం ఆదర్శమని నివేదిక ప్రశంసించింది. ఫ్యాక్టరీ లైసెన్సులను దీర్ఘకాలం చెల్లుబాటయ్యేలా మంజూరు చేయాలని చెప్పింది. విద్యుత్‌ కనెక్షన్‌ ఇవ్వడానికి ముందు డిస్కం లేదా ప్రభుత్వ అధికారులు తనిఖీలు చేయకుండా, దానిని కూడా థర్డ్‌ పార్టీకి అప్పగించాలని పేర్కొంది. చెక్‌పోస్టుల్లో ప్రతి వాహనాన్నీ తనిఖీ చేయడం కష్టమని, వ్యాపారులు 'వే బిల్స్‌' జనరేట్‌ చేసి ఆన్‌లైన్‌లోనే పన్ను కట్టే విధానాన్ని అమలు చేయాలని పేర్కొంది. అప్పుడప్పుడు, అక్కడక్కడా తనిఖీలు చేస్తే సరిపోతుందని సూచించింది. ఇలా అయితే రవాణాకు సమయం కూడా కలిసొస్తుందని చెప్పింది. కేవలం ఫిర్యాదు వచ్చిన పరిశ్రమలు, వ్యాపారాల పైనే తనిఖీలు నిర్వహించాలని సూచించింది. తనిఖీ చేయడానికి ఆ శాఖ ఉన్నతాధికారుల ముందస్తు అనుమతి పొందాలని కూడా పేర్కొంది. ఇలా అయితే ఇన్‌స్పెక్టర్లపై పని భారం తగ్గు తుందని సలహా ఇచ్చింది. కార్మిక శాఖలో 10 రకాల తనిఖీ లను విడివిడిగా కాకుండా, ఒకేసారి చేయాలని సూచించింది. దీనివల్ల పరిమితంగా ఉన్న ఇన్‌స్పెక్టర్లపై పనిభారం తగ్గుతుందని తెలిపింది. 
ప్రపంచ బ్యాంకు చేపట్టిన ''డూయింగ్‌ బిజినెస్‌'' రిపోర్టు ప్రకారం 189 దేశాల్లో భారత్‌ 142వ స్థానంలో ఉంది. విచిత్రమేమిటంటే 2014లో 140వ స్థానంలో ఉన్నదల్లా 2015కు మరో రెండు స్థానాలు దిగజారిపోగా, 2017 కల్లా ఏకంగా 50వ స్థానానికి ఎగబాకడం అజెండాగా పెట్టుకు న్నామని నివేదిక పేర్కొంది. సింగిల్‌ విండో విధానం పంజాబ్‌లో మాత్రమే పూర్తి స్థాయిలో అమలవుతోంది. దీన్ని అన్ని రాష్ట్రాల్లో నిర్దిష్ట కాల వ్యవధిలో అనుమతులిచ్చేలా విధానాలు రూపొందించాలని పేర్కొంది. భూమి రికార్డులు డిజిటలైజ్‌ చేయాలని, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో జోనల్‌ స్థాయి వరకు ప్రణాళికలు రూపొందించాలని చెప్పింది. డిజిటలైజ్‌ భూమి రికార్డులు సబ్‌ రిజిస్ట్రార్‌, రెవెన్యూ, మున్సిపల్‌ ఆఫీసుల్లో అందుబాటులో ఉండాలని పేర్కొంది. ఈ మూడు డేటా బేస్‌ల ఇంటిగ్రేషన్‌ ఇంకా మన దేశంలో జరగాల్సి ఉందని తెలిపింది. ప్రధానంగా మున్సిపల్‌ స్థాయిలో ఇంటిగ్రేషన్‌ విషయంలో చాలా వెనకబడి ఉన్నా మని, మహారాష్ట్ర, రాజస్థాన్‌లలోనే మూడు విభాగాల ఇంటిగ్రేషన్‌ పూర్తయిందని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌ సహా మరో 11 రాష్ట్రాల్లో రెవెన్యూ, రిజిస్ట్రార్‌ కార్యాలయాల డేటా బేస్‌ ఇంటిగ్రేట్‌ అయ్యాయి. నివేదిక పేరుతో ర్యాంకులిచ్చి అన్ని రాష్ట్రాల్లో సంస్కరణల అమలు వేగాన్ని పెంచడానికి ప్రపంచ బ్యాంకు ప్రయత్నిస్తోంది. పాలన వ్యవహారాల్లో కూడా ప్రపంచ బ్యాంకు చొరబడాలని చూస్తోంది. గతంలో అప్పులు తీసుకున్న రాష్ట్రాలకు, అది కూడా ఆ ప్రాజెక్టు సంబంధిత శాఖలతోనే వ్యవహరించే ప్రపంచబ్యాంకు, సంస్కరణల అమలు పేరుతో రాష్ట్రాల్లోని అనేక శాఖలపై పెత్తనం చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించింది. 
- పెనుమల్లి మధు