అడిగితే తప్పా?

ఇంట్లో పోలీస్‌ కవాతు బయట డిజిటల్‌ డాబుసరి.. ఇదీ చంద్రబాబు పాలనలో ఆంధ్రప్రదేశ్‌లో తిష్ట వేసిన తాజా దృశ్యం. విశ్వనగరంగా అమరావతిని అభివర్ణిస్తూ ప్రచారం లంకించుకున్న ముఖ్యమంత్రి, శంకుస్థాపన అదరగొడతామని హోరెత్తిస్తున్నారు. కాగా ఈ అట్టహాసాల మాటున ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు, జనం ఆందోళనలను తొక్కేసేందుకు అన్ని రకాల కుయుక్తులకు పాల్పడుతున్నారు. శంకుస్థాపన దగ్గర పడే కొద్దీ రాజధాని గ్రామాల్లోనూ, రాష్ట్ర వ్యాప్తంగా కూడా పౌరుల కదలికలపై ప్రభుత్వం ఆంక్షలు విధించి అణచిపెట్టాలని తాపత్రయ పడటం ప్రజాస్వామ్యానికి విఘాతం. గత చంద్రబాబు జమానాలో జార్జిబుష్‌, ఉల్ఫెన్‌ సన్‌, టోనీ బ్లేయర్‌ పర్యటనల సందర్భంగా ప్రయోగించిన నిర్భందం ప్రజలింకా మర్చిపోలేదు. అమరావతి శంకుస్థాపనలోనూ బాబు గత కాలంనాటి అణచివేత పద్ధతులను ప్రవేశపెడుతున్నారు. రాజధాని శంకుస్థాపనకు సింగపూర్‌, జపాన్‌ సహా 180 దేశాల ప్రతినిధులు వేంచేస్తారని, మన దేశంలోని అతిరథ మహారథులందరూ హాజరవుతారని ప్రభుత్వం ఎత్తుకున్న ప్రచారానికి ఆకాశమే హద్దు. ఏర్పాట్లపై చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదు. అంతటి మహత్తర కార్యక్రమం తమ చెంత నిర్వహిస్తున్నారని సంతోష పడాలో లేక ఈ పేరుతో తమపై అక్రమంగా రుద్దుతున్న షరతులకు బాధ పడాలో అర్థం కాని స్థితిలో ప్రజలున్నారు. భూసమీకరణ సమయంలో రాజధాని గ్రామాల్లో పోలీస్‌ రాజ్యం నడిచింది. పచ్చని పంట పొలాలతో అలరారే చోట ఖాకీల బూట్ల శబ్దం ప్రతిధ్వనించింది. శంకుస్థాపన తేదీ ప్రకటించారో లేదో అప్పటి నుంచి గ్రామాల్లో మళ్లీ పోలీసు పహారా, తనిఖీలు, నిఘా, చెక్‌పోస్టులు, రహదారుల మూసివేత, వంటి అనేకానేక ఆంక్షలు జనాన్ని నిద్ర పోనీయడం లేదు. ప్రజల భాగస్వామ్యంతో ప్రజా రాజధాని నిర్మాణమే తమ సంకల్పంగా చెప్పుకొనే తెలుగుదేశం ప్రభుత్వానికి ఎందుకింత ఉలికిపాటు? నీడను చూసి కూడా ఎందుకు భయపడుతున్నట్లు? ఈ విపత్కర దృశ్యాలతో ప్రజలందరి ఆమోదం లభించిందంటే ఎలా?
రాజధాని ప్రాంత ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. వాటిని తూతూ మంత్రం చేసి శంకుస్థాపనకు భారీ ఏర్పాట్లు చేస్తుంటే తమ సంగతేంటని జనం ప్రశ్నించడమే సర్కారుకు పెద్ద నేరంగా, ఘోర అపరాధంగా కనబడింది. ప్రజల సమస్యలు పరిష్కరించాలని సిపిఎం పాదయాత్ర చేస్తే పోలీసులు నాయకులను గ్రామాలకు రాకుండా అడ్డుకొని పాశవికంగా అరెస్టులు చేశారు. తుళ్లూరులో గురువారం నాడు సిపిఎం నేతలను పాదయాత్ర చేయకుండా అడ్డుకుని అరెస్టు చేశారు. ఇస్తామన్న పింఛన్లను అర్హులైన వారందరికీ ఇవ్వమనడమూ తప్పేనా? అసైన్డ్‌, సీలింగ్‌ భూముల సాగుదార్లకు పరిహారం కోరుతున్నారు. డీ-నోటిఫై చేసిన అటవీ భూముల్లో నివాసముంటున్న పేదలకు పట్టాలు అడుగుతున్నారు. ఉపాధి కల్పించమంటున్నారు. 
మురికివాడలను శుభ్రం చేయమంటున్నారు. గ్రామాలుంటాయో లేదోనన్న భయాందోళనలు అలముకున్న వేళ ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ నూటికి నూరు పాళ్లు నెరవేర్చి ఉంటే ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయొచ్చు కదా! ఆ పని చేయకుండా పాదయాత్రలను నిలువరించడాన్ని ఎలా సమర్ధించు కుంటుంది? పాదయాత్ర అనేది ప్రజాస్వామ్యంలో ఒక ప్రచార రూపం. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉండగా ప్రజల బాధలు తెలుసుకోడానికి రాష్ట్ర మంతా నెలల తరబడి పాదయాత్ర చేశారు. ఆయన చేయగా లేంది మరో పార్టీ చేస్తే తప్పు ఎలా అవుతుంది?
రాష్ట్రంలో ఒకే పార్టీ అదీ పాలిస్తున్న తమ పార్టీనే ఉండాలన్నట్లు చంద్రబాబు వ్యవహరించడం ప్రజాస్వామ్యానికి చేటు. ప్రతిపక్షాల పేరు చెబితే చాలు చీమలు జెర్రులు పాకుతున్నట్లుంది. ప్రజా, కార్మిక, ఉద్యోగ, విద్యార్థి సంఘాలంటే వ్యతిరేకత మూటగట్టుకుంటోంది. అరెస్టులు, నిర్భందాలు, 144 సెక్షన్లు, అణచివేత పద్ధతులన్నింటినీ ప్రయోగిస్తోంది. అనంతపురం జిల్లా ఎన్‌పి కుంట మండలంలో సోలార్‌ పార్క్‌ కోసం భూములు కోల్పోయిన నిర్వాసితుల బాగోగులు విచారించబోతే సిపిఎం రాష్ట్ర కార్యదర్శి మధును అరెస్ట్‌ చేశారు. పోలాకిలోనూ ఇలానే చేశారు. వామపక్షాల, ప్రజాసంఘాల ఆందోళనలకు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారు. ప్రధాన ప్రతిపక్ష నేత జగన్‌ ప్రత్యేక హోదా కోసం దీక్ష చేస్తానంటే పొంతన లేని సాకులు వెతికి ఇబ్బందులు కలిగించారు. భోగాపురం, మచిలీపట్నం ప్రతి చోటా ఉక్కుపాదమే. పైగా సమస్యలు ఎత్తిచూపితే అభివృద్ధి నిరోధకులని ఎదురుదాడి చేస్తోంది. పదిహేను లక్షల ఎకరాలు సేకరించి కార్పొరేట్లకు పందేరం చేస్తున్నందన ప్రజాస్వామ్య విలువలను మంటగలుపుతున్నందునే ప్రపంచబ్యాంక్‌ ఎపికి రెండో ర్యాంక్‌ ఇచ్చినట్లుంది. ఆ ప్రపంచబ్యాంక్‌ను, కార్పొరేట్లను సంతృప్తి పర్చేందుకే చంద్రబాబు నియంతగా మారినట్లున్నారు. నియంతృత్వ ప్రభుత్వాలెన్నో అడ్రస్‌ లేకుండా కాలగర్భంలో కలిసిపోయాయి. చరిత్ర నిర్మాతలు ప్రజలు మినహా పాలకులు కాదని ఇప్పటికైనా చంద్రబాబు తెలుసుకుంటే మంచిది.