రాష్ట్ర రాజధానిని నిర్మించడం కోసం ఈ సరికే 30 వేలకు పైగా ఎకరాల పంట భూములు సేకరించిన ప్రభుత్వం తాజాగా పేదలు సాగుచేసుకుంటున్న అటవీ భూములపై డేగ కన్నేయడం అమానుషం. భూములను సొంతం చేసుకోవడానికి వీలుగా అడవులను డీనోటిఫై చేయడమే కాక లక్ష ఎకరాలను కార్పొరేట్లకు, పెట్టుబడి దారులకు, ప్రభుత్వ అనుకూల పెద్దలకు పందేరం చేయ పూనుకోవడం దాని వర్గనైజాన్ని తెలియజేస్తోంది. అనేక కష్టాలకోర్చి అటవీ భూమిని సాగుకు అనువుగా మార్చిన రైతన్న పొట్ట కొట్టే కుట్రలు పన్నడం దుర్మార్గపూరితం. రాజధాని ముసుగులో పచ్చటి పంట పొలాలు దారాదత్తం చేయడానికి పాల్పడిన పాలకులు ఇప్పుడు ఏకంగా రాజధాని ప్రాంతంలోని అరవై శాతం అడవిని ధ్వంసం చేయ చూడడం దురదృష్టకరం. దీనికోసం చంద్రబాబు సర్కారు నిబంధనలను కూడా లెక్క చేయకుండా పర్యావరణానికి హాని కలిగిస్తోంది. చట్టాల ప్రకారం అటవీ భూములను కన్వర్షన్‌కు మాత్రమే ఉపయోగించాలి. అంతకు రెండింతల భూమిని అటవీశాఖకు అప్పగించాలి. అది అనుకూలంగా లేని పక్షంలో అందుకు ఖరీదు చెల్లించాలి. కష్టాల్లో వున్నామని, అంత భూమి తమ దగ్గర లేదని కేంద్రం దగ్గర మొర పెట్టుకొని భూమిని ఎగవేసే ప్రయత్నం చేస్తున్నారు సీఎం. రాజధాని నిర్మాణం పేర కల్లబొల్లి కబుర్లతో పేదల జీవికతోనే కాదు పర్యావరణంతోనూ చెలగాట మాడుతున్నారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి హరిత రాజధానిని నిర్మిస్తామని చెప్తే నిజమే కాబోలనుకున్నారు ప్రజలు. విశ్వ రాజధానిని కట్టిస్తానంటే ఔననుకున్నారు అమాయకంగా. ఆయన ఎక్కిన ప్రతి వేదిక మీదా దక్షిణ కొరియా, జపాన్, చైనా, సింగపూర్ దేశాల గురించి చేసిన వర్ణనలను వినీ వినీ తమకూ అలాంటి రాజధానిని నిర్మిస్తారనుకున్నారు. ఆచరణకొచ్చేసరికే అందుకు విరుద్ధంగా వుంది! ఆయన నిత్యం జపించే దక్షిణ కొరియాలో డెబ్బై ఏళ్ల కిందట కేవలం 15 శాతం పచ్చదనం మాత్రమే వుండేది. ఇవాళ దాన్ని వారు 85 శాతానికి పెంచారు. ఫలితంగా వర్షపాతం పెరగడమే కాక వాతావరణం మెరుగైంది. మన సీఎం రివర్స్‌గేర్‌లో అటవీ భూములను కాంక్రీటు అరణ్యాలుగా మార్చడానికి సిద్ధమైపోయారు. భూవిస్తీర్ణంలో 33 శాతం అడవులు వుండాలన్న నిబంధనలను తుంగలో తొక్కేశారు. ఈ చర్య వల్ల పర్యావరణానికి ప్రమాదం వాటిల్లుతుందని, జీవ వైవిధ్యం దెబ్బ తింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నా లెక్క చేయకుండా వేలాది ఎకరాల అటవీ భూమిని పారిశ్రామికీకరణ, ఇతర పథకాల పేరుతో పెద్దలకు కట్టబెట్టజూస్తోంది. సామాన్యులకు సైతం సులువుగా అర్థమయ్యే ఉదాహరణలు కళ్ల ముందు వుండగా శాస్త్రవేత్తల దాకా ఎందుకు? జులై మాసంలో చిరుజల్లులతో చల్లగా వుండాల్సిన రాష్ట్రం ఉష్ణ తాపంతో, ఉక్కపోతతో అల్లాడిపోవడానికి కారణమేంటి? పచ్చదనం లేపించడమే! ఇది ఇప్పటి వరకు పచ్చటి చెట్లను నిలువునా నరికిన పాప ఫలితం. ఇకమీదట అడవులను నేలకూల్చడం వల్ల మరింత తీవ్ర పరిణామాలు చోటు చేసుకోనున్నాయి. గత కొద్ది వారాల్లో 46 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతనే చూశాం. అది యాభై డిగ్రీలకు, ఆ పైకి పెరిగిపోయి నరకాన్ని చూపిస్తుంది. అన్నిటినీ మించి పచ్చదనం లోపించడంతో వర్షపాతం తగ్గుతుంది. వానలు సరిపడినంతగా లేకపోతే వర్షాధారిత పంటలు మాత్రమే కాక మొత్తం వ్యవసాయమే దెబ్బతినే ప్రమాదం వుంది. భూగర్భ జలాలూ తరిగిపోతాయి.
ఇన్ని విపత్తులను విజ్ఞులనదగిన వారెవరూ కోరి స్వాగతించరు. అయినా సరే రాష్ట్రంలోని అటవీ భూములను రాజధాని నిర్మాణానికి ఉపయోగిస్తానంటున్నారు రాష్ట్ర పాలిక. కేంద్ర పర్యావరణ, అటవీ శాఖా మంత్రి సైతం అందుకు పచ్చజెండా ఊపేశారు. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 8 అందుకు అనుకూలంగా వుండగా మరెవరి అంగీకారాలూ అవసరం లేదు. అవన్నీ లాంఛనప్రాయపు అనుమతులే. ఇప్పటికే కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వేలాది ఎకరాల అటవీ భూమిని డీనోటిఫై చేసేందుకు రంగం సిద్ధమైంది. అటవీ భూమికి సంబంధించిన రూట్ మేప్ సిద్ధం చేయవలసిందిగా అటవీ రెవెన్యూ అధికారులకు జిల్లా కలెక్టర్లు ఉత్తర్వులు ఇచ్చేశారు. రాజధానిలో ప్రభుత్వ నిర్మాణాలు, పరిశ్రమలు, విద్యా సంబంధ కట్టడాలకు ఆ భూమిని వినియోగించనున్నారు. రాజధాని నిర్మాణంలో చంద్రబాబు అవలంభిస్తున్న చాణక్య నీతి అర్థం కావాలంటే మొదటి నుంచి జరుగుతున్న భూసేకరణను ఓసారి మననం చేసుకుంటే చాలు. ముందుగా రాజధాని కోసం అవసరమైతే రైతులు, ప్రజలు త్యాగాలు చేయాలన్నారు. వారితో చర్చించి భూ సేకరణ చేశారు. అవి ఇంకా ఓ కొలిక్కి రాకముందే భూమి తీసుకున్న రైతులకు పూర్తిగా ప్రత్యామ్నాయ భూమిని చూయించక ముందే, ఇస్తామన్నది ఇవ్వక ముందే అవసరమైతే మరింత భూమి తీసుకుంటామని కూడా అన్నారు. రైతుల నుంచి సేకరించిన భూముల్లోనే రాజధాని నిర్మించుకునే అవకాశం వున్నా ఆ పని చేయలేదు. అతి తెలివిగా విదేశీ పెట్టుబడిదారులకు, కార్పొరేట్లకు చవగ్గా అప్పగించి పక్కా దళారీలా వ్యవహరించారు. వారిని సంతృప్తి పరచాక ప్రభుత్వ అవసరాల కోసం ల్యాండ్ కావాలంటూ అటవీ భూములపై తెగపడ్డారు. క్రయవిక్రయాలకు అనువుగానిది కనుక ముందుగా వాటిపై ప్రభుత్వ ముద్ర వేస్తారు. ఆ తర్వాత ఏం జరిగేదీ అందరికీ తెల్సిందే.
పర్యావరణ పరంగా చూసుకున్నా, రైతుల వైపు నుంచి ఆలోచించినా అటవీభూముల విషయంలో ఏలికలు అనుసరిస్తున్న విధానం ఏమాత్రం సరైనది కాదు. ఆ నేలనే నమ్ముకుని బతుకులీడుస్తున్న కుటుంబాలను వీధుల పాల్జేయడమే. పేద రైతుల పొట్ట కొట్టి పెద్దలకు పంచభక్ష్య పరమాణ్ణాలు వడ్డించడమే. ఇంత అన్యాయం జరుగు తుంటే ఎంత బలహీనులైనా తప్పక సంఘటితమౌతారు. చలిచీమల చేత చిక్కిన బలవంతమైన సర్పముకే గతి పట్టునో సుమతీకారుడు ఏనాడో సెలవిచ్చాడు. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఇప్పటికైనా తెగ బలిసిన వారికి అటవీ భూములను కట్టబెట్టే ఆలోచన మానుకోవడం మంచిది.