అఖిల భారత కిసాన్ సభ సర్వే

 దేశంలో రోజురోజుకు రైతుల ఆత్మహత్యలు పెరుగుతుండడంతో వారి బలవన్మరణాలకు గల కారణాలను తెలుసుకునేందుకు సిపిఎం రైతు విభాగమైన అఖిల భారత కిసాన్ సభ (ఎఐకెఎస్) ఒక సర్వే నిర్వహిస్తున్నది. దేశంలో గత రెండు దశాబ్దాలలో మూడు లక్షల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని కిసాన్ సభ తెలిపింది. ‘రైతుల ఆత్మహత్యల పట్ల ఎఐకెఎస్ ఆందోళన చెందుతోంది. గత రెండు దశాబ్దాలలో సుమారు మూడు లక్షల మంది రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఇలా ఎందుకు జరుగుతోంది, వీరి ఆత్మహత్యల వెనుక గల కారణాలు ఏంటి వంటి వాటిని తెలుసుకునేందుకు, ఈ ఆత్మహత్యలను నిరోధించడానికి తీసుకోవాల్సిన చర్యల గురించి అధ్యయనం చేయడానికి మేము సర్వే చేస్తున్నాము’ అని ఆ సంఘం ప్రధాన కార్యదర్శి హన్నన్ మొల్లా ఆదివారం పిటిఐ వార్తాసంస్థకు చెప్పారు. రైతుల ఆత్మహత్యలు ఎక్కువగా జరిగిన 11 రాష్ట్రాలలో తమ బృందాలు ఆత్మహత్యకు పాల్పడిన రైతుల ఇళ్లకు వెళ్లి వారి బలవన్మరణాలకు గల కారణాలను తెలుసుకుంటాయని ఆయన వివరించారు. ఈ బృందాల్లో తమ సంఘం జాతీయ నాయకులతో పాటు ఆయా రాష్ట్రాల నాయకులు ఉంటారని తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న రైతు పేరు, అతని గ్రామం, అతనికున్న వ్యవసాయ భూమి విస్తీర్ణం, ఏ పంటలు సాగు చేశాడు, సంభవించిన పంట నష్టం, అతను ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు వంటి ప్రశ్నలకు ఈ సర్వేలో సమాధానాలు సేకరిస్తామని ఆయన వివరించారు.
తమ బృందాలు సేకరించిన సమాచారం ఆధారంగా జూలై చివరి నాటికి తాము ఒక నివేదిక తయారుచేస్తామన్నారు. ఈ తీవ్రమైన సమస్యను ఎదుర్కోవడం ఎలా? అనే అంశంపై చర్చకు తాము ఒక చార్టర్‌ను కూడా తయారు చేస్తామని సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యుడు కూడా అయిన హన్నన్ మొల్లా తెలిపారు. రైతుల ఆత్మహత్యలను నిరోధిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని ఆయన విమర్శించారు. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకు రావడానికి తమ సంఘం ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించిందని ఆయన తెలిపారు.