అక్రమ అరెస్టులపై ఆగ్రహం

బందరు పోర్టుకు అనుబంధంగా పరిశ్రమల పేరుతో ఇచ్చిన భూ నోటిఫికేషన్‌పై ఆందోళన చేస్తున్న భూ పోరాట కమిటీ కన్వీనర్‌ కొడాలి శర్మసహా పలువురిని శనివారం అరెస్టు చేయడంపై ఆదివారం విజయవాడ, మచిలీపట్నాల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. అక్రమ అరెస్టులకు బెదిరేది లేదని, ప్రజలకు న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తామని సిపిఎం జిల్లా కార్యదర్శి ఆర్‌.రఘు స్పష్టం చేశారు. అక్రమ అరెస్టులకు నిరసనగా ఆదివారం సిపిఎం, సిపిఐ, వైసిపి ఆధ్వర్యంలో కోనేరుసెంటర్‌ నుండి నవకళ సెంటర్‌ వరకూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా రఘు మాట్లాడుతూ.. బందరు పోర్టు నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదన్నారు. అనుబంధ పరిశ్రమల పేరుతో ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్‌ దుర్మార్గమైన చర్యగా వర్ణించారు. సిపిఐ నాయకులు లింగం ఫిలిప్‌, కె సత్యనారాయణ, వైసిపి నాయకులు బూరగ రామారావు తదితరులు పాల్గొన్నారు. విజయవాడ పటమట ఎన్‌టిఆర్‌ సర్కిల్‌ వద్ద 'భూముల్ని తినే తోడేలు' దిష్టి బొమ్మను దగ్థం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం రాజధాని ప్రాంత సమన్వయ కమిటీ కన్వీనర్‌ బాబూరావు మాట్లాడుతూ.. బలవంతపు భూసేకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. మచిలీపట్నంలో అరెస్టు చేసిన నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి దోనేపూడి కాశీనాధ్‌, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వై.నరసింహారావు, ఐద్వా నగర కార్యదర్శి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు