అక్టోబర్ విప్లవ శత వార్షిక సభ..

మార్క్సిస్టు సిద్ధాంతాన్ని ఆచరణాత్మకమైన శాస్త్రీయ సామ్యవాద సిద్ధాంతాన్ని అక్టోబరు విప్లవం నిరూపించిందని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు మంతెన సీతారాం అన్నారు. రష్యన్ విప్లవం శత వార్షిక ఉత్సవాలను పురష్కరించుకుని సిపిఎం ఏలూరు నగర కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఉద్దరాజు రామం భవనంలో జరిగిన అక్టోబర్ విప్లవ శత వార్షిక సభ నగర కార్యదర్శి పి.కిషోర్ అధ్యక్షతన జరిగింది.ఈ సందర్బంగా సీతారాం మట్లాడుతూ కార్మికవర్గం తొలి రాజ్యాధికారం అక్టోబర్ విప్లవం ద్వారా సాధ్యమైందన్నారు. అక్టోబర్ విప్లవ ఫలితంగా ఆవిర్భవించిన సోవియెట్ యూనియన్ హిట్లర్ ఫాసిజాన్ని మట్టికరిపించిదని, ఫాసిజానికి వ్యతిరేకంగా జరిగిన యుద్ధంలో సోవియెట్ యూనియన్ 4 కోట్ల మంది సైన్యం , పౌరులను త్యాగం చేసిందన్నారు. అక్టోబర్ విప్లవ స్ఫూర్తి, ప్రభావంతో ప్రపంచ వ్యాపితంగా సోషలిస్టు విప్లవాలు , జాతి విముక్తి పోరాటాలు పెద్దఎత్తున సాగి విజయాలు పొందాయని , ఆయా దేశాలు విముక్తి సాధించాయన్నారు. ప్రపంచ వ్యాపితంగా సోషలిస్టు దేశాలకు, తృతీయ ప్రపంచ దేశాలకు సోవియెట్ యూనియన్ పెద్దఎత్తున సహాయం చేసిందన్నారు. ప్రాపంచ వ్యాపితంగా సామ్రాజ్యవాదుల దుశ్చర్యలకు , దాడులు, యుద్ధాలను సోవియెట్ యూనియన్ నిలువరించిందన్నారు. అక్టోబర్ విప్లవం ఫలితంగా ప్రపంచంలోని అన్ని పెట్టుబడిదారీ దేశాలలో ప్రజా సంక్షేమ పధకాలు, కార్మిక, శ్రామిక, ఉద్యోగ వర్గాలకు చట్టాలు వచ్చాయని తెలిపారు. ప్రపంచానికి రెండే రెండు మార్గాలున్నాయని అవి పెట్టుబడి దారీ విధానమా ?సోషలిజమా ? అని ప్రపంచవ్యాపితంగా చర్చ జరుగుతోందన్నారు. సోషలిజమే మార్గమని అక్టోబర్ విప్లవం నిరూపించిందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు డి.ఎన్.వి.డి.ప్రసాద్ , నరసింహారావు, సోమయ్య, శ్రీనివాసరావు, చింతాడ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.