అంబేద్కర్‌ వారసత్వం

మేధావి మరియు సామాజిక విప్లవ కారుడు అయిన డా|| బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ 125వ జయంతి సందర్భంగా మరీ ముఖ్యంగా హిందూ మితవాదులు ఆయనను సొంతం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఆయన చేసిన కృషి, వారసత్వంపై ఒక అంచనా.
స్వతంత్ర భారతదేశం అంబేద్కర్‌ 125వ జయంతి జరుపుకోవటానికి సిద్ధమవుతున్న సందర్భంలో ఆయన ఎన్నడూలేనంత ఎత్తుకు ఎదిగినట్లు కనిపిస్తున్నది. అనేక ముఖ్య ఘట్టాలలో, ఉద్యమాలలో నవభారత నిర్మాణం కోసం, ప్రజాస్వామ్యంకోసం, సామాజిక రుగ్మ తలు లేని దేశంకోసం అంబేద్కర్‌ కృషి చేశారు. ఎంతోమంది ఉద్దండులు, దేశవ్యాప్తంగా పేరొందిన ప్రముఖులు ఆయన సమకాలీనులు గానూ, ప్రత్యర్ధులుగాను ఉన్నారు. అంబేద్కర్‌ జీవితానుభవంలో గుర్తించిన సామాజిక రుగ్మతలు, జరిపిన ఉద్యమాలు, అధ్యయనం, ఆలోచనలను ప్రయోగాత్మకంగా పరిశీలించాలి. భారత సమాజం గురించి ఆయన లోతుగా పరిశీలన చేసి లేవనెత్తిన అనేక ప్రశ్నలు నేటికీ సజీవంగా నిలిచి ఉండటం, ఆయన కృషిని, ప్రాధాన్యతని నేటికీ గుర్తుచేస్తున్నాయి.
1871 ఏప్రిల్‌ 14వ తేదీన మధ్య భారతదేశంలో మౌ అనే ప్రాంతంలో , మతభా వాలను విశ్వసించే, పేద మెహర్‌ కుటుంబంలో భీమ్‌రావ్‌ అంబేద్కర్‌ జన్మించాడు. వీరి వంశంలో మిలటరీలో పనిచేసిన పరంపం ఉండటంతోపాటు, విద్యపట్ల అనూహ్యమైన ప్రీతి ఉన్నది. పాఠశాల విద్యాభ్యాసం సతారాలోను, ముంబైలోను, కళాశాల విద్యాభ్యాసం ముంబై లోను పూర్తిచేసిన అంబేద్కర్‌ 1913లోను మరియు 1917లో కొద్దికాలంపాటు బరోడా మహారాజుగారి దగ్గర సేవలుకూడా అందిం చాడు. లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌లో కొలంబియా విశ్వవిద్యాలయంలో, గ్రేస్‌ ఇన్‌ బాక్‌ విశ్వవిద్యాలయములో ఉన్నత విద్య అభ్యసించిన ఈ నవ యువకుడు ఆనాటి సమకాలీన రాజకీయనాయకులలో చాలా మందికి లేనటువంటి, అమోఘమైన పాండి త్యాన్ని సంపాదించాడు. జీవితానికి సంబంధిం చిన అన్ని అంశాలలో లోతైన అవగాహనను ఆర్జించిన ఘనత అంబేద్కర్‌కి దక్కుతుంది.
అప్పుడప్పుడే అందివస్తున్న అవకాశాలను అందిపుచ్చుకోవడంలో భీమ్‌రావ్‌ విశేష ప్రతిభను కనపరిచాడు. నిజానికి, తన కుటుంబంలో మరెవ్వరూ అందుకోలేనటువంటి, తన తోటి సమాజంలో అత్యధిక శాతం అందుకోలేనిది భీమ్‌రావ్‌ అందుకున్నాడు. అందులోకూడా ప్రతిఒక్క అంశం, అంటే పాండిత్యం, మేధస్సు, ఫ్రొఫెషనల్‌గా సాధించిన విజయాలన్నిటిలోను కష్టపడి, పోరాడి సాధించుకున్నవే తప్ప అప్పనంగా వచ్చినవికాదు. అందులోనూ ఆనాడు ఉన్నటువంటి సామాజిక అడ్డంకులు ముఖ్యంగా పక్షపాతవైఖరి, సామాజిక అణచివేతలు, కులపీడనలు వంటివి ఎదుర్కొని సాధించాడు. 1920లలో తొలి నాళ్ళకే అంబేద్కర్‌ ఎమ్‌.ఎ, పి.హెచ్‌.డి. ఎమ్‌.ఎస్‌.సి (అర్థశాస్త్రం), డి.ఎస్‌. సి (అర్థశాస్త్రం) మరియు బారిస్టర్‌ ఎట్‌ లా పూర్తిచేశాడు. తనకి 30 సంవత్సరాలు వచ్చే సరికే, ప్రముఖ విద్యావేత్తలు, అధ్యయన కారులు తమ జీవితకాలంలో సాధించలేనన్ని నిజ జీవిత అనుభవాలను అంబేద్కర్‌ గడించాడు.
నాలుగు దశాబ్దాల తన ప్రజా జీవితంలో అనేక వివాదాస్పద అంశాలలోనూ, అధిగ మించటానికి వీలులేనటువంటి అనేక సామాజిక సమస్యలమీద అంబేద్కర్‌ ఒక హీరోలాగా వెలుగొందాడు. అలెగ్జాండర్‌ గొల్డెన్‌పైసర్‌ 1916 మే నెలలో సామాజిక శాస్త్రాలపై సెమినార్‌ జరిపినప్పుడు, మొట్టమొదటి సారిగా అంబేద్కర్‌ ''భారతదేశంలో కులాల తీరు తెన్నులు, పుట్టుక మరియు అభివృద్ధి'' అనే అంశంపై చాలా అద్భుతమైన పత్రాన్ని సమర్పిం చాడు. పారదర్శకత, నిజాయితీ, పట్టుదల వంటి అపూర్వ గుణాలు కలిగిన ఉదారవాది డా|| అంబేద్కర్‌. తాత్వికంగా మొదట ఆదర్శవాదం (యుటిలిటేరియనిజం) వైపు మొగ్గినప్పటికీ, అంతిమంగా బుద్ధుని సిద్ధాంతంవైపు ఆకర్షితుడ య్యాడు. ఫ్రెంచ్‌ విప్లవ లక్ష్యాల నుండి స్ఫూర్తిని పొందాడు. భారతీయ ప్రజా సంస్కృతిలోని మానవీయ కోణాలు, నాగరికత, సామాజిక పురోగామి ఆలోచనలు ఆయనను ముందుకు నడిపించాయి. మార్క్సిజం పుస్తకాలను కూడా చాలా లోతుగా అధ్యయనం చేశాడు. అవి ఎంతగా అంటే 1938లో బాంబేలో చారిత్రా త్మక ఖాట్‌ వ్యతిరేక ఉద్యమం జరిగినప్పుడు ''ఇక్కడ ఉన్న కమ్యూనిస్టు నాయకులకన్నా నేను కమ్యూనిస్టు సిద్ధాంతం గురించి లెక్కలేనన్ని ఎక్కువ పుస్తకాలను చదివాను'' అని ఆయన ప్రకటించాడు. అయినా ఆయన ఏప్పుడూ విప్లవ సిద్ధాంతమైన మార్క్సిజం-లెనినిజంతో ప్రభావితం చేయబడలేదు, సోషలిజాన్ని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేయలేదు.
ఆయన కాంగ్రెస్‌ సిద్ధాంతాలను, గాంధీయిజాన్ని పూర్తిగా వ్యతిరేకించేవాడు. కాని కొన్ని సామాజిక అంశాలలో జవహర్‌లాల్‌ నెహ్రూ ఆలోచనలతో ఏకీభవించేవాడు. 1950ల్లో ఆయన న్యాయశాఖ మంత్రి గా ఉండి హిందూకోడ్‌ బిల్లు తెచ్చినప్పు డు, అదే జవహర్‌లాల్‌ నెహ్రూ ప్రధాన మంత్రిగా అంబేద్కర్‌ను ఘోరంగా దెబ్బతీశాడు.
సాహసవంతమైన
పరిశోధనాకారుడు అంబేద్కర్‌:
చిన్ననాటి నుండి అంబేద్కర్‌ ఎప్పుడూ విశ్రాంతి లేకుండా సాహసో పేతమైన పరిశోధ నలు చేస్తుండేవాడు. విలువల సమతుల్యం పాటించడంలో, పరిశీలించినవాటిలోని, ఆచరణాత్మక అంశాలలోని వ్యత్యాసా లను సరిచేయ డంలో కొన్ని సందర్భాలలో విఫలమ య్యాడు. సామాజికంగా అణగారిన వర్గానికి చెందినప్పటికీ, వివక్షకు గురయిన విద్యార్థిగా ఉన్నప్పటికీ, బరోడా రాజకుటుంబంతో సహా ఎవరైనా తన మీద జాలి చూపించినా, ఉద్ధరిస్తున్నట్లు ప్రవర్తించినా సహించేవాడు కాదు. బుద్ధిజం తీసుకున్న కొద్దికాలానికే వెళ్ళిపోయిన అంబేద్కర్‌ తన జీవితకాలంలో ఎప్పుడూ తనకంటూ ప్రత్యేకత, గుర్తింపు ఉండేలా జీవించారు. సతారాలో పాఠశాల విద్యార్థులు, వివక్షతో కూడిన అంటరాని తనంతో అంబేద్కర్‌ని క్రికెట్‌ ఆడనివ్వకుండా చేసినా, ఆయన ఎప్పుడు ఆటమీది నుండి దృష్టిమరల్చలేదు. ప్రజా జీవితంలో నితరంతరం సాధించగలిగేవి, ఆచరణలో సాధ్యమయ్యే లక్ష్యాలను మాత్రమే ఎంచుకున్నారు. సామాన్య ప్రజానీకం, ప్రత్యేకించి భారత సమాజంలోని అట్టడుగుస్థాయి ప్రజా సమస్యలపై స్పందించటానికి ఆయన స్థాయిగాని, లోతైన విశ్లేషణలుగాని, అధ్యయనం కాని, గ్రంధాలు కాని, పర్సనాలిటీగాని ఎన్నడూ ఆయనకి అడ్డంకిగా మారలేదు.
అంబేద్కర్‌ జీవించినంతకాలం, ఆయన ప్రత్యర్ధులు, విమర్శకులు మరీ ముఖ్యంగా కాంగ్రెస్‌ నాయకులు, ఆయన ఆ యుగంలోని వ్యూహాత్మక లక్ష్యాన్ని గుర్తించలేని వ్యక్తిగా పదే పదే అభివర్ణించేవారు. ఆ ప్రచారం బాగా ప్రాచుర్యం పొంది, ఆఖరికి మీడియాకూడా ఆయనను ఒక రెండో తరగతి దేశనాయకుడి గాను, షెడ్యూల్‌ కులాలకి పరిమితమైన నాయకుడిగా చీత్రీకరించింది. వస్తుగతంగా చూస్తే ఆయనంత మహోన్నతవ్యక్తి, సాహసోపేతమైన దేశనాయకులు చాలా తక్కువమంది ఉన్నారన్నది సుస్పష్టం. దురదృష్టవశాత్తు స్వాతంత్య్ర పోరాటంలోని కొంతమంది హీరోలు, సామాజిక విప్లవకారులు సైతం అంబేద్కర్‌ యొక్క లోతైన అధ్యయనం, దృఢచిత్తం, సామాజిక అంతరాలపై జరిపిన బలమైన పోరాటాలను పూర్తిగా విస్మరించారు. కొంతమందయితే ఆయన దేశభక్తిని కూడా శంకించి, నీచంగా మాట్లాడారు. కాని అలాంటివారిని ఈరోజు ఎవరు గుర్తుంచుకుంటారు? అందుకనే ఇంత వైవిధ్యభరితమైన, స్ఫూర్తివంతమైన స్వాతంత్ర పోరాట అనుభవాలను గమనిస్తే, అంబేద్కర్‌ సామాజిక అంశాలపై ఎంత ప్రశంసనీయమైన ప్రశ్నలు సంధించాడో కదా అని మనం అభినందించవచ్చు. అలాగే ఆయన విమర్శ కులు, శత్రువులవి శుద్ధ అబద్దపు వాదనలుగా మనం పరిగణించవచ్చు.
అంబేద్కర్‌ లేవనెత్తిన
ముఖ్యమైన సామాజిక అంశాలు :
భారతస్వాతంత్య్ర పోరాటంలో అతి ముఖ్యమైన బలహీనత అంబేద్కర్‌ లేవనెత్తిన సామాజిక అంశాలను పూర్తిగా నిర్లక్ష్యం చేయటం లేదా సర్దుబాటు ధోరణిని అనుసరించటం. ఈ అంశాలు ప్రభావితం చేయగలిగేవి కాదనే తప్పుడు అవగాహన, ముఖ్యంగా సనాతన ధర్మం అనే అంశంపై మౌనం వహించారు.
సామాజిక అంశాలపై, పోరాటాలపై లోతైన పార్శ్వాలన్నీ తట్టిచూపిన అంబేద్కర్‌ ఆశయాన్ని ఇప్పుడన్నా గుర్తించాల్సిన సమయం వచ్చింది. కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నడిచిన స్వాతంత్య్ర పోరాటంలో దీనికి తగినంత ప్రాధాన్యత ఇవ్వబడలేదు. దేశరాజకీయ దృక్పథంలో ఎప్పుడూ నికరంగా కేంద్రస్థానం వహిస్తూ, తీవ్రవాదశైలితో, సామాజిక అంశా లలో ఎటువంటి సర్దుబాటు ధోరణి ప్రదర్శించ కుండా ఎన్నో ఉద్యమాలకు నాయకత్వం వహించారు అంబేద్కర్‌. సమాజంలోని అసమా నతలు, మతాలలో ఇమిడిఉన్న అణచివేత ధోరణులు, సాంప్రదాయ వారసత్వాలు, మెజారిటీ సమాజం రుద్దిన విలువలను గమనించిన అంబేద్కర్‌ సామాజిక, ఆర్థిక న్యాయం కోసం తన సొంత ఆదర్శాలను రచించుకున్నాడు.
ఆయన తనకు నూతన అవగాహన ఇవ్వగలిగిన వర్గ విశ్లేషణను వదిలివేశాడు. భారతదేశంలో కులానికి వర్గానికి మధ్య ఉన్న సంబంధాన్ని ఒడిసిపట్టాడు. గుర్తింపదగిన అంశం ఏమిటంటే, సామాజిక న్యాయంకోసం, భయమెరుగని పోరాటం జరిపిన ఈ ధీరుడు తననెప్పుడూ రాజకీయ ఉదారవాదిగానే భావించాడు కాని అతని ప్రత్యర్ధులు మటుకు స్వాతంత్య్ర పోరాటంలోని కీలక ఘట్టాలన్నింటి లోను అతనిని పక్కన పెట్టే ప్రయత్నం చేశారు. ఆశ్చర్యకరమైన అంశమేమిటంటే, ఆయన తన రాజకీయ జీవితంలోనూ, ప్రజా జీవితంలో విరామం లేకుండా లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాల కోసం భారతదేశం అన్వేషిస్తుం డగా, ఆయనను అనునసరించే అనేకమంది మద్దతుదారులు నేటికీ స్వతంత్ర భారత దేశంలో విస్తరించి ఉన్నారు.
సిద్ధాంత పరంగా అంబేద్కర్‌ మధ్యేవాద మితవాదిగా ఉన్నప్పటికీ కొన్ని సందర్భాలలో రెండోవైపుకు, తీవ్రవాదపక్షం వైపుకు బాగానే మొగ్గాడు. ప్రత్యేకించి, శక్తివంతమైన ప్రజా ఉద్యమాలు ఆయన భావాలకు, ఉద్యమాలకు, రాజకీయ నిర్మాణ కృషికి దన్నుగా సాగినప్పుడు, ఉదాహరణకు 1938లో బొంబాయిలో కార్మికులు సమ్మె వ్యతిరేక బిల్లుకు వ్యతిరేకంగా నడిపిన పోరాటం వంటి సందర్భాలలో ఇది జరిగింది. ఆయన ఇండిపెండెంట్‌ లేబర్‌ పార్టీ నిర్మాత. ఈ పార్టీ అఖిలభారత స్థాయిలో వేళ్ళూనుకొనలేకపోయినప్పటికీ, దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలకు ప్రయోజనకరమైన రాజకీయ, సిద్ధాంత, నిర్మాణ పరమైన గుణపాఠాలను అందించింది.
అంబేద్కర్‌ రాజ్యాంగ సభలో, రాజ్యాంగ ముసాయిదా రూపకల్పన కమిటీకి అధ్యక్షత వహించి, ప్రధాని నెహ్రూ నేతృత్వంలోని కేంద్రకేబినెట్‌లో కొంతకాలం ఉండినప్పటికీ, భారత రాజకీయాలలో కాంగ్రెసేతర, కాంగ్రెస్‌ వ్యతిరేక భావధారకు ఆయననే ఆద్యుడిగా పరిగణించవచ్చు. ఒకవంక సామాజిక సమానత్వం, పౌరస్వేచ్ఛల కోసం ముందు పీటీన నిలబడి వత్తాసు పలుకుతూ, బడావ్యాపార వేత్తలు, భూస్వాముల పెత్తనాన్ని విమర్శిస్తూ, సామాజిక, ఆర్థికహక్కుల కోసం, ప్రజా స్వామ్యం కోసం ఉద్యమిస్తూనే, ఆయన మరోవైపు మార్క్సిజం లెనినిజానికి, కమ్యూని జానికి చైతన్యపూరిత సిద్ధాంత, రాజకీయ ప్రత్యర్ధిగానే ఉండిపోయాడు.
కాశ్మీరు, జాతీయత, భాషలు, పౌరసత్వం, జాతి మొదలయిన సంక్లిష్టమైన, చిక్కుముడులతో కూడుకొని ఉన్న జాతీయ సమస్యలపై ఆయన పలు ఆసక్తికరమైన అభిప్రాయాలను వెలి బుచ్చాడు. భారతదేశంలో సహకార పూరిత ఫెడరలిజం, కేంద్ర రాష్ట్ర సంబంధాల విషయంలో ఆయన విశ్లేషణ ఆ రంగంలో ఒక సముచితమైన ప్రజాస్వామిక అవగాహనకు వెలుగుబాటను వేసింది. ఇక అంతర్జాతీయ సమస్యలపైన, విదేశాంగ విధానంపైన, ఆయన అలీనవాదం నుండి, నెహ్రూ భావజాలం నుండి, వామపక్ష ప్రాపంచిన ధృక్పధం నుండి విభేదించే వైఖరిని తీసుకున్నారు.
ఆయన నాయకత్వంలో నడిచిన ఒక సమూహపు సామాజిక వర్గ పునాది, సమాజాన్ని గురించి ఆయన లేవనెత్తిన ప్రశ్నల తీవ్రవాద స్వభావము, ఆధునిక, శాస్త్రీయ హేతుబద్ద భావాలను స్వీకరించడానికి ఆయన సంసిద్ధత, ఆయన ధృడమైన లౌకికవాదం, అనేక సమస్యలపట్ల, ప్రత్యేకించి మహిళల పరిస్థితి, భవిష్యత్తుపైనా, ఒక నాగరిక సమాజ నిర్మాణా నికి కావాల్సిన దేమిటి వంటి సమస్యలపై ఆయనకు పురోగామి భావాలున్నాయి. అమోఘమైన ఆయన మేధాసంపత్తి, నిరంతర అన్వేషణాశీలత, విస్తృత రంగాలలో అభివృద్ధి కరమైన భావాలు, సాధించగల్గిన, ఆచరణాత్మక మైన లక్ష్యాలపై కేంద్రీకరంచగలిగిన ఆయన సమర్ధత, వాస్తవాల పట్ల ఆయన నిర్మాణాత్మక దృష్టి, ఈ లక్షణాలు ఆయనను ఒక అసమాన నాయకునిగా నిలబెట్టాయి.
హిందూ మితవాదం, రాజకీయంగా, సామాజికంగా బాగా పైచేయి సాధించడం, మెజారిటీ మత మౌఢ్యం, సామాజిక అభివృద్ధి నిరోధకత్వాలు సాగిస్తోన్న రాజకీయ, సిద్ధాంత ఎదురుదాడి ప్రస్తుత దేశ పరిస్థితికి అద్దం పడుతున్నాయి. అంబేద్కర్‌ వారసత్వాన్ని స్వంతం చేసుకోవడానికై హిందూత్వవాదులు చరిత్రసారాన్ని వక్రీకరించి మరీ ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇటువంటి పరిస్థితులలో కులవ్యవస్థపైనా, చాతుర్వర్ణ, సనాతన ధర్మాలపైనా, అంటరానితనాన్ని మార్పులేకుండా యథాతథంగా నిలిపి ఉంచే సామాజిక దొంతరలపైనా హిందూ ధర్మశాస్త్రాల అధిపత్యం వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలు, వీటిపై రాజీకి తావులేకుండా సాగే ఆయన విశ్లేషణలను తప్పనిసరిగా చదవాలి. పదేపదే అధ్యయనం చేయాలి. దేశవ్యాప్త వాదోపవాదాలలో అంతర్భాగం చేయాలి. ఈ పైన పేర్కొన్న సమస్యలపై ఆయన చేసిన ప్రముఖ సిద్ధాంత విశ్లేషణ 1936లో ఆయన చేసిన అధ్యక్షోపన్యాసంలో భాగమే. అది పెద్ద ఎత్తున వాదోపవాదాలకు, ''కులానిర్మూలన'' అనే ఆయన రచనకూ దారితీసింది. రచయిత అరుంధతీ రారు ఇటీవలనే ఈ కులనిర్మూలనకు సుదీర్ఘమైన తన పరిచయ వ్యాసంలో తాజా భాష్యాన్ని, సమయ సందర్భాలను వివరించారు. రిపబ్లికన్‌ రాజ్యాంగ రూపకల్పనలో బాబా సాహెబ్‌ గారి అమోఘమైనట్టి, ధర్మబద్దంగా కీర్తింపబడినట్టి కృషితో సమానస్థాయిలోనే ఆయన భారత నిర్మాణానికి చేసిన మేధోపరమైన కృషిని కూడా తప్పనిసరిగా గుర్తించాలి.
ఈ రచనలో అంబేద్కర్‌ అధర్మపూరితమైన ఈ సామాజిక వ్యవస్థయొక్క సమాజవ్యతిరేక, ప్రగతి నిరోధక స్వభావాన్ని, అలాగే దాని బలప్రయోగానికి, సిద్ధాంతానికి, రాజకీయ అధికార బలానికి ఉన్న అనుసంధానాన్ని బయటపెట్డాడు. ఆయన విశ్లేషణ ప్రకారం కులవ్యవస్థ సౌభ్రాతృత్వానికి వ్యతిరేకంగా ఉంటుంది. సంఘటితమవ్వడం, పరస్పర సహకారాన్ని అందించుకోవడం, దాతృత్వ భావనకు దారితీస్తుంది. విశాల ప్రాతిపదికగల నీతి, నైతిక ధృతులను సంభవాలుగా చేస్తుంది. కులపునాదిగా ఉన్న వ్యవస్థ స్థానంలో ఆయన చెప్పే ''ఆదర్శ సమాజం'' గురించి స్పష్టం చేయాలని ఆయన విమర్శకులు చేసిన సవాలుకు ఆయన ఇలా బదులిచ్చారు. ''స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రా తృత్వం పునాదిగా ఉండే సమాజమే నా ఆదర్శం.'' తన ఆదర్శ సమాజం చలనశీల మైనదని, సామాజిక సమానత్వం ఉంటుందని ఆయన నొక్కి చెప్పారు. సౌభ్రాతృ త్వం ప్రజా స్వామానికి మరో పేరు తప్ప మరేమీకాదని, ప్రజాస్వామ్యం అంటే ప్రాథమికంగా కలగలిసి జీవించే ఒక విధానం, సరస్పరం అంది పుచ్చు కునే అనుభవాన్ని సంధానించి, తోటి మానవుల పట్ల గౌరవాభి మానాలు చూపే వైఖరిని పెంచి పోషించే ఒక విధానం అని అన్నారు.
ప్లాటో యొక్క రిపబ్లిక్‌ ఏకారణం వల్ల వైఫల్యాన్ని ఎదుర్కొందో, సరిగ్గా అదే కారణం మూలంగానే ''చాతుర్వర్ణ వ్యవస్థ'' తప్పని సరిగా వైఫల్యాన్ని ఎదుర్కొంటుంది అని సామాజిక తిరుగుబాటు దారుడైన, ఈ పీడిత వర్గ మేధావి హెచ్చరించారు. ఈ దుర్మార్గ వ్యవస్థ మూలంగా హిందువులలోని దిగువ వర్గాలు ప్రత్యక్షంగా కార్యాచరణలోకి దిగకుండా పూర్తిగా నిస్స హాయులుగా చేయబడ్డారు అని ఆయన వేలెత్తిచూపారు. ''ఇంతకంటే నీచమైన సామాజిక వ్యవస్థ మరొకటి రాబోదు'' అని చెప్పారు. ఈ వ్యవస్థ ప్రజలను పరస్పర సహాయ కార్యకలాపాలు చేయనివ్వకుండా కుంటుపరిచి, వారిని నిస్సహాయులుగా, చచ్చుబడిన వారిలా చేస్తుందని తెలిపారు. ఆయన సామాజిక, ఆర్థిక, ప్రజాస్వామ్యం కోసం ఉద్యమిస్తూనే ఈ వ్యవస్థ రాజకీయరంగంలో కలుగచేసే ప్రభావాలపై దృష్టి సారించి కృషిచేశారు. ధర్మశాస్త్రాల అనుంఘల్లనీయతపై ఉన్న విశ్వాసాన్ని సర్వనాశనం చేయడం, వాటి పునాదిగా గల కులపరమైన నిరంకుశత్వాన్ని నాశనం చేయడమే దీనికి వాస్తవ పరిష్కారమని అంబేద్కర్‌ భావించారు.
ఇటువంటి విషయాలలో రాజీపడేవాడుగా పేరుమోసిన గాంధీ, అర్ధ శతాబ్దికి ముందే, ''డాక్టర్‌ అంబేద్కర్‌ హిందూమతానికి ఓ సవాలు'' అని ప్రకటించాడంటే అందులో ఆశ్చర్య మేమీలేదు. ఆయన ఈనాటికీ ఒక సవాలుగానే నిలిచిఉన్నారు. అందువల్లనే హిందూత్వ వాదులు, రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఫ్‌ు కూటమికి చెందిన కొన్ని శక్తులు నేడు ఆయనను నిర్లక్ష్యం చేయలేని స్థితిలో ఉన్నాయి.
సామాజిక పురోగతిని నిరోధించటానికి పూనుకున్నవారిని వ్యతిరేకిస్తూ, సామాజిక ఛాందసవాదం, అవకాశవాద రాజకీయాలపై సాగించిన యుద్ధాలు 1940 దశకం చివరినాళ్ళు, 1950 దశకం తొలినాళ్ళలో హిందూకోడ్‌ బిల్లుపై సాగించిన పోరాటం, రాజ్యాంగ రూపకర్తలలో ఒక ముఖ్యుడై, ప్రగతిశీలకంగాను, సమానత్వం ప్రాతిపదికన ఉండి, హిందూకోడ్‌ బిల్లును ప్రవేశపెట్టే ప్రయత్నాలకు నాయకత్వం వహించాడు. కాని ఛాందసవాదశక్తులు ఈ ప్రయత్నానికి వెన్నుపోటు పొడిచాయి. హేతువాది, ప్రగతి కాముకుడిని అని చెప్పుకొనే నెహ్రూ ఉన్నప్పటికీ కాంగ్రెస్‌ పార్టీ ఈ బిల్లుకు మద్దతు ఇవ్వడానికి నిరాకరించింది. పురోగామి దృష్టిగల ఈ చట్టానికి నీళ్ళొదలటం అంటే, అటువంటి కీలక సమస్యలపై అంబేద్కర్‌ దృక్పధానికి ద్రోహం చేయడమే.
రాజ్యాంగ రూప కల్పనలోనూ, సంస్థల నిర్మాణంలోను ఆయన ఘనమైన కృషి అలా ఉండగా, ఒక నిజమైన జీవన విధానంగా ప్రజాస్వామ్యం గురించి, పౌర హక్కుల గురించి, నిరంకుశ ధోరణుల గురించి, అంతేకాక ఆరోగ్యవంతమైన ప్రజాస్వామిక, రాజకీయ వ్యవస్థ గురించి కూడా ఆయన ఎంతో విలువైన అభిప్రాయాలను వెలిబుచ్చారు. ''వారసత్వం, వంశపారంపర్య పాలననూ, ఏకపార్టీ వ్యవస్థను ఆయన ద్వేషించారు'' ఒకే పార్టీ ప్రజామోదమైన ప్రభుత్వాన్ని నడపటం అంటే, నిరంకుశత్వం తెరవెనుక నుండి పాలన సాగించే ఒక రూపంగా ప్రజాస్వామ్యం తయారవ్వడాన్ని అనుమతించడమే అన్నది అంబేద్కర్‌ ప్రముఖ సూత్రీకరణల్లో ఒకటి. ''నిరంకుశత్వం ఎన్నికయినదయినప్పటికీ, అది నిరంకుశత్వం కాకమానదు. నిరంకుశత్వం కూలదోయబడే అవకాశం ఉండటం, దానినితోక ముడిచేటట్లు చేయగల అవకాశం ఉండటం, దాని ప్రత్యర్ధిపార్టీ దాని స్థానంలో అధికారంలోకి వచ్చే అవకాశం ఉండటమే నిరంకుశత్వానికి వ్యతిరేకంగా నిజమైన గ్యారంటీ'' అని ఆయన హెచ్చరించారు. ఏకపార్టీ పాలన ప్రాతిపదికన గాని, లేదా ''నిద్రపోయే హక్కులని నిద్రపోనీ'' అనే సామాజికతత్వ ప్రాతిపదికగా కాని ఉండే రాజకీయ సుస్థిరత అంబేద్కర్‌ గిట్టని విషయం.
అంబేద్కర్‌ దూరదృష్టితో వెలిబుచ్చిన రాజకీయ భావాలలో రెండు నేటి కాలానికీ వర్తిస్తాయి. ''రాజకీయ స్వేచ్ఛలను ఒక గొప్పవ్యక్తి పాదాల క్రింద ఉండనివ్వకండి,'' ''రాజకీయా లలో భక్తి లేదా వీరాధన అంటే అథోపతనానికి దారి'' అని చెప్పారు. రాజకీయ ప్రజాస్వామ్యాన్ని సామాజిక ప్రజాస్వామ్యంగా తీర్చిదిద్దండి. వైరుధ్యాలను పరిష్కరించండి, లేకపోతే అవి ప్రజాస్వామ్య పునాదుల్ని నాశనం చేస్తాయి''. అని గొప్పగా శెలవిచ్చారు అంబేద్కర్‌.
- ఎన్‌. రామ్‌
రచయిత హిందూ దినపత్రిక
మాజీ సంపాదకులు
(అనువాదం. యల్‌.యస్‌. భారవి)