అంబేద్కర్‌ గురించి RSS అబద్ధాల పునశ్చరణ!

 'సంబంధిత ప్రజలను మానసికంగా సరైన రీతిలో అర్థంచేసుకుని, సరిపడినంతగా పునశ్చరణ చేస్తే చతురస్రాన్ని వృత్తంగా నిరూపించటం దుస్సాధ్య మేమీ కాదు' అని జోసెఫ్‌ గోబెల్స్‌ చెప్పాడు. మద్రాసు ఐఐటిలోని 'అంబేద్కర్‌-పెరియార్‌ స్టడీ సర్కిల్‌' 'గుర్తింపును రద్దు' చేయటానికి వ్యతిరేకంగా దేశం లోపలా, బయటా నిరసనలు వెల్లువెత్తాయి. ఆ సందర్భంగా ఆర్‌ఎస్‌ఎస్‌ పత్రిక 'ఆర్గనైజర్‌' ఆగ్రహపూరితంగా నిరసనకారులను కమ్యూనిస్టులుగా పేర్కొంటూ 'తొలిగిన బూటకపు అంబేద్కరిస్టుల ముసుగు' అనే శీర్షికతో గందరగోళపరిచే సంపాదకీయం రాసింది. అంబేద్కర్‌ హిందూ మతానికి అనుకూలుడని, కమ్యూనిస్టులకు వ్యతిరేకి అనే విషయం ఆ నిరసనకారులకు తెలియదని ఆ పత్రిక ఆరోపిస్తూ 'అంబేద్కర్‌-పెరియార్‌ స్టడీ సర్కిల్‌' గుర్తింపును రద్దు చేయటాన్ని సమర్థించింది. ఆసక్తికరమైన విషయమేమంటే అంబేద్కర్‌ రాసిన 'కుల నిర్మూలన' గ్రంథంలోని కొన్ని వాక్యాలను ఉటంకిస్తూ ఆ సంపాదకీయం మొదలవుతుంది. లావు అక్షరాలతో రాసిన ఆ వాక్యాలు ఇవి : 'హిందూమతాన్ని చెడగొట్టిన విషం బ్రాహ్మణవాదం. మీరు బ్రాహ్మణవాదాన్ని అంతంచేయ గలిగితే హిందూమతాన్ని రక్షించగలుగుతారు'.
              ఏ విధంగానైనా ఒక అబద్ధాన్ని పదేపదే చెప్పాలనే గోబెల్స్‌ తరహా ఆలోచన ఉండటం అటుంచి హిందూ మతం పట్ల ఏమాత్రం సానుభూతిలేని ఉటంకింపును ఎంచుకోవటం ఆశ్చర్యకరం. 
              హిందూ మతాన్ని పీడిస్తున్న రోగం బ్రాహ్మణవాదం అని 1936లో సంస్కరణాభిలాషులైన హిందువులను ఉద్దేశించి అంబేద్కర్‌ చెప్పాడు. ఇక్కడ ఎదురయ్యే ప్రశ్న ఏమంటే : 'హిందూ మతం నుంచి బ్రాహ్మణవాదాన్ని వేరు చేయటం సాధ్యమా?' అంబేద్కర్‌ వేరే చోట చెప్పినట్లు అవి రెండూ పర్యాయపదాలు. చారిత్రకంగా చూస్తే హిందూ మతం లాంటిది ఏమీ లేదు. అది బ్రాహ్మణవాదానికి మధ్య యుగాలనాటి పరిభాష. అది సింధూ నదికి ఆవల ఉన్న మతం. అంబేద్కర్‌ రచనల సంకలనం 'రైటింగ్స్‌ అండ్‌ స్పీచెస్‌' మొదటి సంపుటిలోని 78వ పేజీలోని వాక్యాలను ఉటంకించే ముందు అదే గ్రంథంలో ఆయన 'ముందుమాట' లో రాసిన 'భారతదేశంలోని రోగగ్రస్తులమని, తమ రోగం ఇతర భారతీయుల ఆరోగ్యానికి, ఆనందానికి ప్రమాదకరంగా పరిణమించిందని హిందువులు గ్రహించగలిగేలా చేస్తే నేను సంతృప్తి చెందుతాను' అన్న వాక్యాలను 'ఆర్గనైజర్‌' సంపాదకుడు గ్రహించగలిగితే బాగుండేది.
              హిందువుల గురించి, హిందూ మతాన్ని గురించి అంబేద్కర్‌ ఏమనుకున్నాడో తెలుసుకోవటానికి ఇది సరిపోతుంది. జీవిత చరమాంకం వరకూ తన అభిప్రాయాలను సరిచూసుకున్న అంబేద్కర్‌ ఆలోచనలను ఆర్‌ఎస్‌ఎస్‌ ఇంకా వినాలనుకుంటే ఆయన 'పాకిస్తాన్‌ ఆర్‌ పార్టిషన్‌ ఆఫ్‌ ఇండియా' గ్రంథంలోని విషయాలను ఉటంకిస్తూ అంబేద్కర్‌ను ఒక ముస్లిం ద్వేషిగా చిత్రించాలని ఆర్‌ఎస్‌ఎస్‌ తెగ ఉబలాటపడుతుంటుంది. 'హిందువుల రాజ్యం ఒకవేళ నిజమైతే ఈ దేశానికి అంతకంటే వినాశనం ఏమీ ఉండదనడంలో సందేహం అక్కరలేదు. హిందువులు ఏమి చెబుతున్నప్పటికీ హిందూ మతం స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాలకు ప్రమాదకారి. ఆవిధంగా హిందూ మతం ప్రజాస్వామ్యానికి సరిపడదు. హిందువుల రాజ్యాన్ని ఎటువంటి త్యాగాలకైనా వెరవక నిరోధించాలి ('రైటింగ్స్‌ అండ్‌ స్పీచెస్‌' సంపుటి 8, పేజీ 358).
              హిందూమత తత్వశాస్త్రంలో అంబేద్కర్‌ హిందూ మతం విలువను 'ఒక జీవన విధానంగా', 'స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం'లకు వ్యతిరేకమైన దానిగా, న్యాయం, ఉపయోగం- రెండూ లేనిదానిగా అభివర్ణించాడు. అయితే గోబెల్స్‌ అనుయాయులను ఇవేమీ నిరుత్సాహపరచలేదు కాబట్టి వారు అబద్ధాలను ఆపకుండా అంబేద్కర్‌ను ఒక గొప్ప హిందువుగా చిత్రీకరిస్తూనే ఉన్నారు. 'అంబేద్కర్‌-పెరియార్‌ స్టడీ సర్కిల్‌' నిషేధాన్ని నిరసించేవారందరూ కమ్యూనిస్టు లని పేర్కొనటం ఆ సంపాదకీయం వేసిన మరో మూర్ఖపు ఎత్తుగడ. మద్రాసు ఐఐటి డైరెక్టర్‌ అప్రజాస్వామిక చర్యలకు వ్యతిరేకంగా ఆయనకు లేఖరాసిన దేశంలో పేరెన్నికగన్న శాస్త్రజ్ఞులు 'కమ్యూనిస్టులా'? అమెరికాలో 'ఉదారవాది'ని కమ్యూనిస్టుగా భావించినట్లు 'హేతువాదుల్ని, ప్రజాస్వామిక వాదుల్ని' ఆర్‌ఎస్‌ఎస్‌ 'కమ్యూనిస్టు'లనుకుంటుంది. ఆర్‌ఎస్‌ ఎస్‌ అవగాహనకు భిన్నంగా భారతీయ విశ్వవిద్యాలయాలు కమ్యూనిస్టులకు నెలవులు కావు. అవి అలానే ఉండి ఉంటే ఆర్‌ఎస్‌ఎస్‌ తన కుహరం దాటి బయటకు వచ్చి ఉండేది కాదు. అయితే అంబేద్కర్‌ కమ్యూనిస్టు వ్యతిరేకి అని అది మళ్ళీ చెప్పదలుచుకున్న అసలు విషయం.
              అంబేద్కర్‌ స్వయంగా తాను కమ్యూనిస్టు వ్యతిరేకినని చెప్పటం నిజం. అయితే ఆయన అలా ఎందుకన్నాడో ఆర్‌ఎస్‌ఎస్‌ తెలుసుకుంటే మంచిది. మార్క్సిస్టు పడికట్టు పదాలను వల్లెవేస్తూ, కులం అనే సామాజిక వాస్తవికతను చూడ నిరాకరిస్తున్న బ్రాహ్మణ స్వభావం గల యువకుల బృందమే మార్క్సిస్టులని ఆయన భావించటమే ఆయన అలా చెప్పటానికి కారణం. అయినప్పటికీ 1938లో జరిగిన చారిత్రక సమ్మెలో పాల్గొనటం ద్వారా అంబేద్కర్‌ కమ్యూనిస్టులకు సహకరించాడు. అయితే ఆ విభేదం సమసి పోలేదు. ఆ తరువాత 1952 ఎన్నికల్లో కమ్యూనిస్టులు బహిరంగంగా అంబేద్కర్‌ను వ్యతిరేకించారు. ఆయన వారిని కమ్యూనిస్టు వ్యతిరేక పదజాలంతో నిందించాడు.
              కులం విషయంలో కమ్యూనిస్టుల ఆచరణ అంబేద్కర్‌ లో కమ్యూనిస్టు వ్యతిరేకతను ప్రభావితం చేసింది. అందుకు ప్రతిగా కమ్యూనిస్టుల పట్ల ఆయన సానుభూతిని సూచించే ఉదాహరణలు ఆయన రచనల్లో అనేకం కనిపిస్తాయి. తొలి దినాలలో ఫేబియన్‌ సోషలిజంతో లోతుగా ప్రభావితుడైన అంబేద్కర్‌ మార్క్సిస్టు కాదన్నది నిజం. తనకు మార్క్సిజంతో ఉన్న విభేదాలను వ్యక్తపరిచాడు. అయితే గతితార్కిక భౌతికవాదం, చారిత్రక భౌతికవాదం, శాస్త్రీయ సోషలిజాలకు సంబంధించిన మౌలిక ప్రతిపాదనల స్థాయిలో ఆయన ఎన్నడూ చర్చించలేదు. ఆయన కులానికి సంబంధించి కమ్యూనిస్టు ఆచరణను ప్రభావితం చేసిన 'పునాది-ఉపరితలం' సైద్ధాంతిక ప్రతిపాదనను కూడా సవాలు చేయలేదు. అంతేకాక తనకు తానుగా అంబేద్కర్‌ ఒక ఉచ్చులో చిక్కుకున్నాడు. అదేమంటే రాజకీయ విప్లవాలు సంభవించటానికి ముందు ఎల్లప్పుడూ మత సంబంధిత విప్లవాలు వస్తాయనే విషయాన్ని నిరూపించటానికి చాలా కష్టపడ్డాడు. ఆవిధంగా ఆయన వాస్తవంలో కులం ఉపరితల క్షేత్రంలో ఉందని అంగీకరించాడు.
              ఒకే ఒక్కసారి సాపేక్షంగా అంబేద్కర్‌ మార్క్సిజంపై సవివరమైన చర్చ చేశాడు. తాను మరణించటానికి కేవలం ఒక నెల ముందు ఖాట్మండులో జరిగిన ఒక సమావేశంలో ఆయన మార్క్సిజాన్ని బౌద్ధంతో పోల్చాడు. మార్క్సిజం, బౌద్ధం లక్ష్యాలు ఒక్కటేనని ఆయన స్పష్టంగా చెప్పాడు. అయితే ఆ లక్ష్యాలను చేరుకోవటానికి వారు ఎంచుకున్న పద్ధతులలో తేడా ఉందని అంబేద్కర్‌ పేర్కొన్నాడు. రెండు విషయాలలో ఆయన మార్క్సిజాన్ని తప్పుపట్టాడు. మొదటిది, మార్క్సిస్టు పద్ధతిలో హింస ఒక భాగం. రెండవది, మార్క్సిజానికి ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదు. ఆయన మార్క్సిస్టు ఆచరణపైనేగాని సిద్ధాంతంపై తన దృష్టిని కేంద్రీకరించలేదు. ఆవిధంగా అంబేద్కర్‌ మార్క్సిజంతో ఇబ్బంది పడ్డాడు. లక్ష్యాల విషయంలో అంబేద్కర్‌కు మార్క్సిజంతో ఎటువంటి బేధాభిప్రాయం లేదు. మార్క్సిజంతో సమానమైది, దానికున్న లోపాలులేని ప్రత్యామ్నాయాన్ని ఆయన బౌద్ధంలో చూశాడు. అంబేద్కర్‌ను కమ్యూనిస్టు వ్యతిరేకిగానూ, కాషాయానికి అనుకూలి డిగానూ చిత్రిస్తే అది ఆర్‌ఎస్‌ఎస్‌కే ఎదురవుతుందని ఇప్పటికైనా తెలుసుకుంటే మంచిది.
              ఒకవైపు అంబేద్కర్‌ను కాషాయానికి అనుకూలుడుగా మలచుకోవాలని ఆర్‌ఎస్‌ఎస్‌ నానాతంటాలు పడుతున్నది. కానీ మరోవైపు అంబేద్కర్‌-పెరియార్‌ స్టడీ సర్కిల్‌ ఉదంతం ప్రతిబింబించినట్లు ఆయన రాడికల్‌ భావాలను భరించ టానికి సిద్దంగాలేదు. ప్రభుత్వ ఆదేశాలు తీసుకోని ఒక స్వయంప్రతిపత్తి సంస్థ అంబేద్కర్‌-పెరియార్‌ స్టడీ సర్కిల్‌పై క్రమశిక్షణా చర్యను తీసుకోవడాన్ని సమర్థించటానికి ఆ సంపాదకీయం ప్రయత్నించింది. భారతీయ జనతా పార్టీకి చెందిన మానవ వనరుల శాఖామంత్రి స్మృతి ఇరానీ అవిశ్వస నీయ పద్ధతుల గురించి భారత ప్రజలకు తెలియదని అనుకో వటం ఒక అవమానకర చర్చ. ఒక ఊరూపేరూలేని వ్యక్తి చేసిన ఫిర్యాదును ఆమె పట్టించుకోవటం, ఆ తరువాత ఐఐ టి-మద్రాసు 'అంబేద్కర్‌-పెరియార్‌ స్టడీ సర్కిల్‌' గుర్తిం పును అత్యుత్సాహంతో రద్దుచేయటం వంటి చర్యకు దిగటం రొటీన్‌గా జరిగిన పాలనా సంబంధ చర్య కాదనేది సుస్పష్టం.
ఈ విషయంపై ఆందోళనలు కొనసాగుతుండగా దానికి సంబంధించిన విషయాలన్నీ బయటకు వచ్చాయి. 'అంబేద్కర్‌-పెరియార్‌ స్టడీ సర్కిల్‌' మార్గదర్శకాలను ఉల్లఘించిందనే సాకు నిషేధాన్ని సమర్థించుకోవటానికి ఉపయోగించిందే తప్ప మరొకటి కాదు. 'అంబేద్కర్‌-పెరి యార్‌ స్టడీ సర్కిల్‌' వివాదాస్పద సమావేశం జరిగిన తరువాత నాలుగు రోజులకు ఏప్రిల్‌ 18న మార్గదర్శకాలు జారీఅయ్యాయి. గుర్తింపును రద్దుచేసిన డీన్‌ అంతకు ముందు అంబేద్కర్‌, పెరియార్‌ల పేర్లు ఉండటం పట్ల అభ్యంతరపెట్టి తన బ్రాహ్మణవాద భావజాలాన్ని ప్రదర్శించాడు. ఇక్కడ అసలు వాస్తవం ఏమంటే విద్యార్థులను కుల, మత ప్రాతిపదికన చీలుస్తున్న వివేకానంద స్టడీ సర్కిల్‌, ఆర్‌ఎస్‌ఎస్‌ శాఖలు, హరేరామ హరేకృష్ణ, వందేమాతరం, ద్రువ వంటి ప్రగతి నిరోధక విద్యార్థి సంఘాలను ఐఐటి అధికారులు ప్రోత్సహిస్తున్నారు. హిందూత్వ సంస్థల పలుకుబడితో ప్రత్యేక శాకాహార మెస్‌ను ప్రారంభించాలనే ఐఐటి-మద్రాసు నిర్ణయం విద్యార్థులను చీల్చటం లేదా? నిజానికి ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా 2014లో 'మాంస లేక శాకాహారం ఏదైనా మమ్ముల్ని విడదీయకండి' అనే ప్రచారాన్ని 'అంబేద్కర్‌-పెరియార్‌ స్టడీ సర్కిల్‌' చేపట్టింది. ఏమైనప్పటికీ, ఎంతో అపకీర్తిని మూటగట్టుకుని 'అంబేద్కర్‌-పెరియార్‌ స్టడీ సర్కిల్‌' గుర్తింపును ఐఐటి అధికారులు పునరుద్ధరించవలసి వచ్చింది. ఇది ఆర్‌ఎస్‌ఎస్‌ ఫాసిస్టు కుట్రలకు నిరసన తెలిపినవారి చర్యలు సరైనవని నిరూపించింది.
              వివిధ విశ్వవిద్యాలయాలలో స్టడీ సర్కిల్స్‌ను ప్రారం భించటానికి, హిందుత్వవాదాన్ని ప్రతిఘటించటానికి ఎపిఎస్‌సి విజయం ఉత్తేజపరిచింది. ఒక హిందూత్వవాది నియామకానికి వ్యతిరేకంగా ప్రఖ్యాత ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూట్‌లో నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి. విద్యార్థు లారా! మీరే దేశానికి మంచి రోజులు(అచ్చే దిన్‌) తేగలరు.
ఆనంద్‌ తెల్‌తుంబ్డే