అంగన్‌వాడీలకు వెన్నుపోటు..

అంగన్‌వాడీల విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమానవీయంగా ప్రవర్తిస్తూ వారి ఉసురు పోసుకుంటున్నాయి. మాతా శిశు సంక్షేమంలో, శిశు, బాలింత మరణాల నివారణలో ప్రపంచంలోనే అథమస్థాయిలో ఉండి కూడా వారికి కాస్తంత ఊరట కల్పిస్తున్న ఐసిడిఎస్‌ నిర్వీర్యానికి కేంద్రంలో బిజెపి సర్కారు కుయుక్తులు పన్నుతుండగా ఇక్కడ చంద్రబాబు ప్రభుత్వం అదే బాటలో నడుస్తోంది. అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణే కాకుండా క్షేత్ర స్థాయిలో ప్రభుత్వ కార్యక్రమాలను ఒంటి చేత్తో ఈదుతున్న అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లకు జీతాలు పెంచుతామని రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది నెలల క్రితం హామీ ఇచ్చి తప్పించుకు తిరుగుతోంది. అంగన్‌వాడీల దశలవారీ పోరాటాలతో అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన బాసను తప్పేందుకు కనిపించిన అడ్డదారులన్నీ తొక్కుతోంది. నిన్నటి వరకు వేతనాలు పెంచుతామని నమ్మిస్తూ వచ్చిన ప్రభుత్వం అంతలోనే మాట మార్చి కేంద్రంతో చర్చించి ఆ తర్వాత మరో కమిటీ వేసి అధ్యయనం చేసి వేతనాలు పెంచేదీ లేనిదీ నిర్ణయిస్తామని కప్పదాట్లకు పాల్పడుతోంది. కేంద్ర సాయంతో నడిచే పథకాలకు నీతి ఆయోగ్‌ నిధులను తగ్గించినందున రాష్ట్రంపై అదనపు భారం పడిందంటూ సాకులు వెతుకుతున్నది. ఇప్పుడు అదీ అంగన్‌వాడీలకు జీతాలు పెంచాల్సి వచ్చేసరికే నీతి ఆయోగ్‌ గుర్తొచ్చిందా? ప్రణాళికా సంఘానికి మోడీ ప్రభుత్వం చరమగీతం పాడి నీతి ఆయోగ్‌ను తెచ్చినప్పుడు అందరికంటే ముందు హర్షం వ్యక్తం చేసింది బాబే. పథకాలకు కేంద్ర నిధుల వాటాను నీతి ఆయోగ్‌ తగ్గించినప్పుడూ నోరెత్తలేదు. ఇప్పుడేమో ఐసిడిఎస్‌కు కేంద్ర నిధులు తగ్గాయని సన్నాయి నొక్కులు దేనికి? కేంద్రంపై ఒత్తిడి తెచ్చి నిధులు సాధించడానికేమో రాజకీయాలు, స్వార్ధ ప్రయోజనాలు అడ్డొస్తున్నాయి. స్వలాభం కోసం ఐసిడిఎస్‌ను, అంగన్‌వాడీలను దెబ్బతీయడం దుర్మార్గం. 
ప్రజల పథకాలకు, సబ్సిడీలకు కత్తెర పెట్టడంలో కేంద్రంలో గత కాంగ్రెస్‌, ప్రస్తుత బిజెపి ప్రభుత్వాలది ఒకటే బడి. పథకాలను కుదించాలని, నిధుల వాటాను తగ్గించాలని కాంగ్రెస్‌ ప్రయత్నించగా బిజెపి ఆ పని చేసి చూపింది. అందులో భాగంగా ఐసిడిఎస్‌కు గతంలో కేంద్రం 90 శాతం నిధులివ్వగా 60 శాతానికి తగ్గించింది. తగ్గించిన 30 శాతాన్నీ రాష్ట్రాలే పెట్టుకోవాలి. అసలే ఆర్థిక భారంతో సతమతమవుతున్న రాష్ట్రాలు అదనపు నిధులు ఎంత వరకు భరిస్తాయి? కాబట్టి పథకం నిర్వీర్యం చేయడానికే కేంద్రం ఈ చర్యకు పాల్పడిందనేది స్పష్టం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడబలుక్కొని ఈ దిశగా అడుగులు వేస్తున్నాయి. అంగన్‌వాడీ కేంద్రాల కుదింపు, ప్రైవేటీకరణ జరుగుతున్నాయి. ఐసిడిఎస్‌ను కాపాడుకొనేందుకు, వేతనాలు సాధించేందుకు అంగన్‌వాడీ మహిళలు సంవత్సరాల తరబడి వీరోచితంగా పోరాడుతూ ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి తాత్కాలిక ఉపశమనాలు పొందడం చిన్న విషయం కాదు. ఎపిలో అంగన్‌వాడీల ఆందోళనలపై ప్రభుత్వ నిర్భంధం, దమనకాండ కొత్తది కాకపోయినా మరింత పెచ్చి మీరింది. గతంలో బాబు జమానాలో మహిళలని సైతం చూడకుండా గుర్రాలతో తొక్కించి నీటి ఫిరంగులతో అమానుషంగా పోలీస్‌ దాడి జరిగింది. ప్రస్తుతం ఆ ఒరవడిని మరింత పచ్చిగా కొనసాగిస్తోంది. వారి ఐక్యతను విచ్ఛిన్నం చేసేందుకు, పోరాట పటిమను దెబ్బతీసేందుకు మంత్రులను నియమించి మరీ అమానవీయ పద్ధతుల్లో ఎత్తులు వేస్తోంది. 
అంగన్‌వాడీలు ఏం అడుగుతున్నారు? ఊళ్లడుగుతున్నారా లేక అలవిగాని కోర్కెలు కోరుతున్నారా? అధిక ధరలతో బతుకు సాగించలేకపోతున్నాం కాస్తంత జీతాలు పెంచమంటున్నారు. కనీస ఉద్యోగ భద్రత, సదుపాయాలు కల్పించమ ంటున్నారు. వాస్తవానికి వారు చేసే ఊడిగానికి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. పదో పిఆర్‌సి ఉద్యోగుల కనీస వేతనం రూ.14,175 ఇమ్మని సిఫార్సు చేసింది. ప్రభుత్వం పెంచుతామంటున్నది దానిలో సగం కూడా లేదు. ఆ మాత్రం దానికే రాజకీయాలు, ఆధిపత్యాలు, సవాలక్ష మర్మ విద్యలు. ఈ ఏడాది మార్చిలో సిఎం జీతాలు పెంచుతామన్నారు. తదుపరి ఆగస్టులో కేబినెట్‌ సబ్‌ కమిటీ కొన్ని సిఫా రసులతో సెప్టెంబర్‌ 1 నుంచి పెంచిన జీతాలు అమలు చేస్తామంది. వర్కర్‌కు రూ.4,200 నుంచి 7,100, హెల్పర్‌కు 2,200 నుంచి 4,600 ఇస్తామన్నారు. ఆ విధంగా పెంచితే సర్కారుపై రూ.359 కోట్లు భారం పడుతుందని తేల్చారు. తీరా ఇప్పుడేమో ఐసిడిఎస్‌కు కేంద్ర షేర్‌ తగ్గడం మూలంగా రూ.1,200 కోట్లు అదనపు భారం పడుతుంది కనుక వేతన భారం భరించలేమంటున్నారు. నిజానికి అంగన్‌ వాడీలకు పెంచే మొత్తం రాష్ట్ర ప్రభుత్వం బడా పారిశ్రామిక వేత్తలకు ఇస్తున్న రాయి తీల్లో పిసరంత. ప్రత్యేక హోదా కల్పిస్తామన్న విభజన హామీని సాధిస్తే అన్ని కేంద్ర పథకాలకూ 90 శాతం నిధులొస్తాయి. ఆ ఊసెత్తకుండా ప్యాకేజీలని మభ్యపె డుతూ నిధులు తగ్గాయనడం పెద్ద దగా. జీతాల పెంపుపై కేబినెట్‌లో సానుకూల స్పందన వస్తుందని ఆశించిన అంగన్‌వాడీలకు ప్రభుత్వం నిరాశే మిగిల్చింది. ఇప్పటికే మూడు సార్లు తప్పిన సర్కారు ఇకనైనా తానిచ్చిన హామీకి కట్టుబడి అంగన్‌వాడీలకు జీతాలు పెంచాలి. కనీస ఉద్యోగ భద్రత, సౌకర్యాలు కల్పించాలి.