అంగట్లో అమ్మకం..

విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డిఐ)పై నిబంధనలను మరింతగా సడలించిన కేంద్రంలోని ఎన్‌డిఎ సర్కారు దేశాన్ని అంగట్లో నిలబెట్టి అమ్మేందుకు బరితెగించింది. దీపావళి పండుగ వేళ ఎఫ్‌డిఐలపై పరిమితులు సరళీకరించి విదేశీ కార్పొరేట్లకు వెలుగులు అందించిన మోడీ ప్రభుత్వం ఇప్పటికే 'సంస్కరణ'ల భారాలతో మసకబారిన మన ప్రజల బతుకుల్లో చీకట్లు నింపింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పదిహేను కీలక రంగాల్లో ఎఫ్‌డిఐలకు తలుపులు బార్లా తెరిచి విదేశీ సంస్థల దోపిడీకి లైసెన్స్‌లు ఇవ్వడం ఆందోళనకరం. రక్షణ, బ్యాంకింగ్‌, పౌర విమానయానం, ఉద్యానవనాలు, చిల్లర వర్తకం, నిర్మాణ, రైల్వే, మీడియా, తదితర రంగాల్లో ఎఫ్‌డిఐలు స్వైర విహారం చేసేందుకు ఇంకా మిగిలి ఉన్న కొద్దిపాటి స్పీడ్‌ బ్రేకర్లను తొలగించింది. వీటితో దేశంలో తయారీ రంగానికి మహర్దశ వస్తుందనీ, వృద్ధి పరుగులు పెడుతుందనీ, పెట్టుబడులు పెరుగుతాయనీ, ఉద్యోగావకాశాలు మెరుగవుతాయనీ కేంద్ర పెద్దలు చెబుతున్ను మాటలు శుద్ధ అబద్ధం. ఇప్పటికే ప్రభుత్వం వేగం పెంచిన నయా-ఉదారవాద ఆర్థిక విధానాలు ప్రజలనెంతగా అవస్థలపాల్జేస్తున్నాయో అనుభవపూర్వకంగా తెలిసొచ్చింది. ఇంకా ఆ 'సంస్కరణ'లకు అడ్డూ అదుపు లేకుండా పోతే జనం పరిస్థితి పెనం మీది నుంచి పొయ్యిలో పడుతుంది. ఎఫ్‌డిఐలకు అనుమతి మన మార్కెట్‌ను, ప్రజలను, వనరులను విదేశీ సంస్థల హస్తం చేసే కార్యక్రమం. విసృంఖల దోపిడీకి అవకాశం. విదేశీ కంపెనీలు భారత్‌లో వ్యాపారం చేయడాన్ని సులభతరం చేసే లక్ష్యమని బహిరంగంగానే ప్రభుత్వం ప్రకటించింది. ఇంతకుముందు వరకు 'సంస్కరణ'లు చేపట్టే స్థాయి నుంచి విదేశీ సంస్థల దోపిడీకి నిరభ్యంతర ధ్రువీకరణ ఇస్తున్నామని వక్కాణించే స్థాయికి చేరుకోవడం సర్కారు విచ్చలవిడి తనానికి నిదర్శనం. 
బీహార్‌ ఎన్నికల్లో ఘోర పరాభవం చవి చూసిన మోడీ సారధ్యంలోని బిజెపి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక 'సంస్కరణ'లపై తాత్కాలికంగా దూకుడు తగ్గిస్తుందని ఆశ పడ్డ వారికి ఎఫ్‌డిఐల ఉదంతంతో కళ్లు బైర్లు కమ్మాయి. పారిశ్రామిక వేత్తల్లో ఎక్కడ ఆందోళనలు నెలకొంటాయోనన్న దుగ్ధతో నూటికి నూరు శాతం 'సంస్కరణ'లు చేసి తీరతామని సర్కారు భరోసా ఇచ్చింది. మన్మోహన్‌సింగ్‌ ప్రభుత్వం చిల్లర వర్తకంలో ఎఫ్‌డిఐలను అనుమతించినప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బిజెపి నానా యాగీ చేసింది. అక్కడికి తానేదో నిఖార్సయిన జాతీయవాది అయినట్లు, స్వదేశీ వర్తకులను ఆదుకుంటున్నట్లు ఫోజు పెట్టింది. తీరా అధికారంలోకి రాగానే కాంగ్రెస్‌ను మించిపోయింది. తాజాగా ఎఫ్‌డిఐలపై పరిమితుల సడలింపులే అందుకు ప్రత్యక్ష ఉదాహరణ. గతంలో రూ.3 వేల కోట్లకు పైబడిన ఎఫ్‌డిఐలకు విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎఫ్‌ఐపిబి) అనుమతి తప్పనిసరి. ఆ పరిమితిని రూ.5 వేల కోట్లకు పెంచారు. ఈ చర్య ఒక్కటీ సరిపోతుంది విదేశీ కార్పొర్పేట్లకు ఎంతగా కేంద్రం ఊడిగం చేస్తోందో అర్థం కావడానికి. ఈ సారి పలు రంగాల్లో ఆటోమేటిక్‌గా, ఎలాంటి ముందస్తు అనుమతులూ అక్కర్లేకుండా ఎఫ్‌డిఐలకు ఆస్కారం కల్పించారు. రక్షణ రంగంలో ఎఫ్‌డిఐలు దేశ సమగ్రత, సార్వభౌమాధికారానికి పెను ప్రమాదమని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతుండగా ఆ రంగంలో 49 శాతం ఎఫ్‌డిఐలకు ఆటోమేటిక్‌ పద్ధతి ప్రవేశపెట్టారంటే దేశ భద్రతపై సర్కారుకు ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో తెలియజేస్తుంది. ప్రైవేటు బ్యాంకింగ్‌లో 74 శాతం పోర్టుఫోలియో పెట్టుబడులను అనుమతించి పభుత్వరంగాన్ని నిర్వీర్యం చేస్తోంది. ప్రజల డిపాజిట్లకు కనీస భద్రత లేకుండా చేసింది. 
మీడియాలో ఎఫ్‌డిఐలకు ఎర్ర తివాచీ మరీ దారుణం. ఎఫ్‌డిఐలు వంద శాతం వరకు అనుమతించారు. అందులోనూ 49 శాతం వరకు ఆటోమెటిక్‌ పద్ధతి. టీవి చానెళ్లు, ఇతర మాధ్యమాలు విదేశీ గుత్త సంస్థల చేతుల్లోకిపోవడం అత్యంత ప్రమాదకరం. సమాచార సాంకేతిక రంగంలో ఎన్ని కొత్త ఆవిష్కరణలు జరిగినా, మోడీ డిజిటల్‌ ఇండియా సామాన్యులకు అందుబాటులోకి రావు. పైగా సమాచారంపై విదేశీ శక్తుల ఆధితపత్యం వెర్రి తలలు వేస్తుంది. కాఫీ, రబ్బరు, యాలకులు, పామాయిల్‌, ఆలివ్‌ తోటలతో పాటు వ్యసాయం, పశుపోషణలో ఎఫ్‌డిఐలు వచ్చి పడితే ఇప్పటికే సంక్షోభంలో చిక్కుకొని ఆత్మహత్యలు చేసుకుంటున్న రైతుల బతుకులు ఇంకా ఛిద్రమవుతాయి. చిల్లర వర్తకంలో ఎఫ్‌డిఐల పరంపర స్థానిక మార్కెట్‌ను అతలాకులం చేస్తుంది. త్వరలో పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలుండగా, కనీసం కేబినెట్‌ ఆమోదం కూడా లేకుండా ఎఫ్‌డిఐలపై ప్రధాని మోడీ ఏక పక్ష నిర్ణయాలు తీసుకొని ప్రజాస్వామ్యాన్ని, చట్టసభలను, రాజ్యాంగాన్ని తుంగలో తొక్కారు. విదేశీ పెట్టుబడిదారులకు నమ్మకం కలిగించడం కోసం మోడీ తన బ్రిటన్‌, జి-20, మలేసియా, సింగపూర్‌ పర్యటనల ముందు ఎఫ్‌డిఐలపై ప్రకటన చేశారు. బీహారు ప్రజల తీర్పు తరువాత కూడా బిజెపీ సర్కారు బుద్ధి తెచ్చుకోలేదని దాని ధోరణి తెలియజేస్తోంది. ప్రజలు, ప్రజాతంత్ర వాదులు ఏకతాటిపైకొచ్చి 'సంస్కరణల' దూకుడుకు కళ్లేం వేయాలి.