రాజ్యాంగబద్దంగా పని చేయాల్సిన ఎన్నికల కమిషన్‌ను శాసించేలా బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు లేఖ రాయడం గర్హనీయం. ఇది ఎన్నికల కమిషన్‌ స్వతంత్రతను దెబ్బ తీయడమే.

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 06 ఏప్రిల్‌, 2024.

 

రాజ్యాంగబద్దంగా పని చేయాల్సిన ఎన్నికల కమిషన్‌ను శాసించేలా 

బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు లేఖ రాయడం గర్హనీయం.

ఇది ఎన్నికల కమిషన్‌ స్వతంత్రతను దెబ్బ తీయడమే.

 

కీలక స్థానాల్లో ఉన్న 22 మంది ఐపీఎస్‌లను బదిలీచేసి, వారి స్థానంలో ఎవర్ని నియమించాలో కూడా పేర్లను సూచిస్తూ ఎన్నికల కమిషన్‌కి బిజెపి లేఖ రాయడాన్ని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నది. ఈ విధంగా రాజ్యాంగ వ్యవస్థలను బ్లాక్‌మెయిల్‌ చేయడాన్ని సిపిఐ(యం) నిరసిస్తున్నది.

కొంత మంది అధికారులకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేస్తూ వారి స్థానంలో ఎవరెవరిని నియమించాలో కూడా సూచిస్తూ లేఖ రాయటం అనుచితం. ఒక రకంగా అనధికారిక సిఫారసు చేయడమే. ఎన్నికలు సజావుగా జరగాలన్న ఆలోచన కన్నా దురుద్దేశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. 

కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఇప్పటికే సిబిఐ, ఈడీ, ఐటి లాంటి సంస్థలను ప్రతిపక్ష నాయకులపై ఉసిగొల్పి దుర్వినియోగం చేస్తున్నది. అదే దారిలో బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు కేంద్రంలో అధికారాన్ని అడ్డుపెట్టుకొని లేఖరాయడం, అధికార దురహంకారంతో శాసించే ప్రయత్నం చేయడం అప్రజాస్వామికం. ఇలాంటి అప్రజాస్వామ్యామిక చర్యలను చైతన్యవంతమైన ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు తిప్పికొట్టాలని సిపిఐ(యం) విజ్ఞప్తి చేస్తున్నది.

 

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి