సిపిఐ(యం) అగ్రనాయకులు మాకినేని బసవపున్నయ్య కోడలు శ్రీమతి మాకినేని త్రిపుర సుందరిగారి మృతికి సంతాపం

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు),

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 18 మార్చి, 2024.

త్రిపుర సుందరిగారి మృతికి సంతాపం

శ్రీమతి మాకినేని త్రిపుర సుందరి అనారోగ్యంతో ఈరోజు హైదరాబాదులో మరణించారు. త్రిపుర సుందరి గారు సిపిఐ(యం) అగ్రనాయకులు మాకినేని బసవపున్నయ్య కోడలు. ప్రజా వైద్యులు డా॥ జశ్వంత్‌ మోహన్‌ భార్య, గుంటూరు వైద్యులు డా॥ కళాధర్‌ చెల్లెలు. వారి మృతికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, కార్యదర్శి వర్గ సభ్యురాలు  డి.రమాదేవి సంతాపం తెలియజేశారు. గత 12 సంవత్సరాలుగా పార్కన్సన్‌తో అనారోగ్యంగా ఉన్నారు. రెండు రోజులు క్రితం హాస్పిటల్లో అడ్మిట్‌ అయ్యారు. ఈరోజు సాయంత్రం తుది శ్వాస విడిచారు. ఆమె వైద్యురాలిగా ప్రజాసేవ చేయడమేగాకుండా కమ్యూనిస్టు అభిమానిగా జీవిత చరమాంకం వరకు ఉన్నారు.                  

త్రిపుర సుందరి గారు రేపల్లె తాలూకా పెదపులివర్రు  గ్రామంలో జన్మించిన త్రిపుర సుందరి గుంటూరు మెడికల్‌ కాలేజీలో డాక్టర్‌ చదివి గైనిక్‌ లో స్పెషలైజేషన్‌ చేశారు. నెల్లూరు ప్రజా వైద్యశాలలో నాలుగు సంవత్సరాలు పనిచేశారు. కామ్రేడ్‌ మాకినేని బసవపున్నయ్య కుమారుడు జశ్వంత్‌తో వివాహం జరిగింది. కామ్రేడ్‌ జశ్వంత్‌, సుందరి, డాక్టర్‌ వెంకటరత్నం  గారి భార్య డాక్టర్‌ విజయకుమారి గారలు కలిసి గుంటూరు సాంబశివపేటలో ప్రజావైద్యశాల ప్రారంభించారు. డాక్టర్‌ జశ్వంత్‌ చైనా వెళ్లి ఆక్యుపంక్చర్‌లో శిక్షణ పొందారు. తిరిగి వచ్చిన తర్వాత 1982లో విజయవాడలో ప్రాక్టీస్‌ ప్రారంభించారు. డాక్టర్‌ సుందరిగారు విజయవాడలో కొంతకాలం స్వతంత్రంగా ప్రాక్టీస్‌ చేసి ఆ తర్వాత మాకినేని రామారావు గారి ప్రజా వైద్యశాలలోనూ తదనంతరం నాగార్జున హాస్పిటల్‌లో డాక్టర్‌ జగన్‌తో కలిసి కొంతకాలం పనిచేశారు.

ఆమె మితభాషి. పుట్టినింట, మెట్టినింట కమ్యూనిస్టు రాజకీయాల ప్రభావం ఉండేది. రాజకీయాలను పరిశీలించేవారు. బసవపున్నయ్య గారి భార్య జగదాంబ గారు చివరి వరకు ఆమె దగ్గరే ఉన్నారు. సహృదయత, సేవాదృక్పథం ఆమె వ్యక్తిత్వానికి వన్నె తెచ్చాయి. ఆమె చిన్న కుమారుడు శిశిర్‌ ఆమెతో ఉంటూ ఈ కాలమంతా ఆమె ఆరోగ్యం యెడల అత్యంత శ్రద్ధ తీసుకున్నారు. పెద్ద కుమారుడు వసంత్‌ అమెరికాలో ఉంటున్నాడు. ఎల్లుండి (20) ఉదయం అంత్యక్రియలు హైదరాబాద్‌లో జరుగుతాయి. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

 

(జె.జయరాం)

ఆఫీసు కార్యదర్శి