వైసిపి, టిడిపి, జనసేన పార్టీలు పౌరసత్వ సవరణ చట్టంపై నోరు మెదపరేం..

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు),

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 13 మార్చి, 2024.

 

వైసిపి, టిడిపి, జనసేన పార్టీలు 

పౌరసత్వ సవరణ చట్టంపై నోరు మెదపరేం

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ప్రశ్న

ముస్లిం మైనార్టీల ఉనికిని దెబ్బకొట్టి వారి భవిష్యత్తును అంధకారబంధం చేస్తున్న సిఎఎ (పౌరసత్వ సవరణ చట్టానికి) రూల్స్‌ నోటిఫై చేసి దేశాన్ని ప్రమాదంలోకి నెట్టిన బిజెపి కుతంత్రాలపై రాష్ట్రంలో వైసిపి టిడిపి జనసేన పార్టీలు నోరు మెదపడం లేదు ఎందుకని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు ప్రశ్నించారు. రాష్ట్రంలో సిఎఎను అమలు చేయబోమని వైసిపి ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.

మైనారిటీలను ఉద్ధరిస్తానని రోజు రాగాలు తీసే సిఎం జగన్మోహన్‌ రెడ్డి ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారు?

సిఏఏ ద్వారా ముస్లిం మైనార్టీల ఉనికిని దెబ్బతీయటంలో బిజెపిని బలపరచిన తెలుగుదేశం నేరస్థురాలు కాదా?

రాష్ట్రంలో మైనార్టీలపై మెజార్టీ మతస్తులను రెచ్చగొట్టి ఉద్రిక్తతలను సృష్టించాలనుకుంటున్న బిజెపితో కలిసి తెలుగుదేశం లౌకికవాదం ఎలా కాపాడుతుంది?

బిజెపి దురాగతాలను ప్రశ్నించకుండా వైసిపి మైనార్టీలను ఎలా రక్షిస్తుందో చెప్పాలనీ వి శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు.

రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14 ప్రకారం కులం, మతం, రంగు, జాతి, ప్రాంతం, భాష ఆధారంగా ఎవరిపట్ల వివక్ష ఉండకూడదు. కాని సిఎఎ మత ప్రాతిపదికన వివక్ష పాటిస్తుంది.

రాజ్యాంగంలోని 19వ అధికరణం మతపరమైన స్వేచ్ఛ ఇస్తున్నప్పుడు ముస్లిములకు తప్ప ఇతరులకే పౌరసత్వం ఇస్తామని చెప్పడం రాజ్యాంగ ఉల్లంఘన కాదా? శ్రీలంకలో దశాబ్దాలుగా మతపరమైన హింసను ఎదుర్కొంటున్న శ్రీలంక హిందువులను ఎందుకు మినహాయించారని ప్రశ్నించారు.

పొరుగు దేశాల్లో మతపరమైన హింసకు గురవుతున్న ప్రజలను ‘మానవతా దృష్టితో’ ఆదుకునేందుకే ఈ చట్టం తెచ్చినట్టయితే కేవలం మూడు దేశాలకే ఎందుకు పరిమితం చేయాల్సి వచ్చింది? మన పొరుగున ఉన్న మయన్మార్‌లో మైనార్టీలైన రొహింగ్యా ముస్లింలు, హిందువులు  శ్రీలంకలో క్రైస్తవ తమిళులు తీవ్రమైన హింసాకాండకు గురయ్యారు. వారిని ఎందుకు ఈ చట్టంలో చేర్చలేదు అంటే ప్రభుత్వం వద్ద సమాధానం లేదు. చివరికి పాకిస్తాన్‌ ముస్లింలలో అనేక మైనార్టీ తెగలు తీవ్రమైన హింసాకాండకు గురవుతున్నారు. మరి బిజెపి ప్రభుత్వ ‘మానవతా’ జాబితాలో వారు ఎందుకు చేరలేదు? వీటన్నిటి బట్టి  చూస్తే దీని వెనుక ‘మానవత’ లేదనీ, ఒక రాజకీయ వ్యూహంతో ఇదంతా చేస్తున్నదనీ అర్ధమవుతోందని అన్నారు.

వామపక్షల మద్దతుతో ఇండియా బ్లాక్‌ అధికారంలోకి వస్తే సిఎఎ అమల్లోకి రాదు. అదే మైనార్టీలకు రక్ష. మత సామరస్యానికి గ్యారెంటీ అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు చెప్పారు.

 

  (జె.జయరాం)

ఆఫీసు కార్యదర్శి