రేణిగుంట కరకంబాడి ఎర్రగుట్టపై పేదలపై లాఠీచార్జి , అరెస్టులకు ఖండన

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు),

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ,

విజయవాడ,

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

తేది : 27 ఫిబ్రవరి, 2024.

 

రేణిగుంట కరకంబాడి ఎర్రగుట్టపై గుడిసెలు వేసుకుని జీవిస్తున్న 5వేల మంది పేదలపై లాఠీచార్జి చేసి గుడిసెలను తొలగించడాన్ని, అరెస్టులను  సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిరచింది. అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని, పేదలకు ఇళ్ళ స్థలాలు ఇచ్చి పట్టాలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నది.

రేణిగుంట మండలంలో సర్వే  నెం. 153/1 నందు కరకంబాడి ఎర్రగుట్టపై 5 వేలమంది పేదలు 33 రోజులుగా జీవనం సాగిస్తున్నారు. మంగళవారం ఉదయం 5 గంటలకు జిల్లా కలెక్టర్‌, ఎస్పీ నాయకత్వంలో పేదల గుడిసెలు తొలగించడం, వారిపై లాఠిచార్జి చేయడం దుర్మార్గం.

ఈ రోజు అరెస్టు అయిన వారిలో ఇళ్ల స్థలాల సాధన పోరాట కమిటీ అధ్యక్షులు రాజశేఖర్‌, రాధిక, మునిబాబు, అభి, మస్తాన్‌, రమేష్‌, అరుణ్‌ లను అరెస్టు చేసి, ఏ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారో కనీస సమాచారం కూడా ఇవ్వలేదు. పోలీసులు చేసిన లాఠీఛార్జిలో మహిళలకు గాయాలయ్యాయి. అదే విధంగా తిరుపతిలో కందారపు మురళి, శ్రీకాళహస్తిలో అంగేరి పుల్లయ్య, రేణిగుంటలో హరినాథ్‌, నరసింహారెడ్డిని గృహ నిర్భంధం చేయడం అన్యాయం. 

ఒకవైపు రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఇళ్ళు నిర్మించి ఇస్తానని ప్రగల్భాలు పలుకుతున్న వైసిపి ప్రభుత్వం, మరోవైపు పేదలు వేసుకున్న గుడిసెలను తొలగిస్తూ నిరంకుశంగా వ్యవహరిస్తోంది. 

రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గుడిసెలు తొలగించిన పేదలకు ఇళ్ళ స్థలాలు ఇచ్చి పట్టాలు అందివ్వాలని సిపియం డిమాండ్‌ చేస్తున్నది.

 

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి