ఆంధ్రప్రదేశ్‌ ఏజెన్సీ నిరుద్యోగులకు ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో న్యాయం చేయండి...

(ప్రచురణార్థం: సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్యమంత్రికి వ్రాసిన లేఖను ప్రచురణార్ధం పంపుతున్నాం. - జె.జయరాం, ఆఫీసు కార్యదర్శి)

 

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు),

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ,

విజయవాడ,

 తేది : 19 ఫిబ్రవరి, 2024.

శ్రీయుత వై.ఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి గారికి,  

గౌరవ ముఖ్యమంత్రి,   

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, 

అమరావతి.

విషయం :  ఆంధ్రప్రదేశ్‌ ఏజెన్సీ నిరుద్యోగులకు ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో న్యాయం చేయండి...

అయ్యా!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం 6100 టీచర్‌ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇందులో ఎస్టీలకు 1025 పోస్టులు కేటాయించారు. 5వ షెడ్యూల్‌ ఏరియాలో 500 పోస్టులు భర్తీ చేస్తామని జనరల్‌ డిఎస్సీ నిబంధనలో పేర్కొన్నారు. రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ అమలు చేయడం వల్ల ఆదివాసీలకు తీవ్రమైన అన్యాయం జరుగుతోంది.

    పాడేరు ఏజెన్సీ ప్రాంతంలో 175 పోస్టులు గాను ఎస్టీలకు 07 పోస్టులు, రంపచోడవరం, చింతూరు ఏజెన్సీ కి 205 పోస్టులు గాను 10 పోస్టులు ఎస్టీలకు, సీతంపేట ఏజెన్సీ ప్రాంతాల్లో 35 పోస్టులకు గాను 06 మాత్రమే ఎస్టీలకు, కెఆర్‌పురం ఐటిడిఏ పరిధిలో 70 పోస్టులకు గాను 8 పోస్టులు మాత్రమే ఆదివాసీలకు కేటాయించారు. ఏజెన్సీ ప్రాంతానికి 500 టీచర్‌ పోస్టులు భర్తీ చేస్తామంటూ చివరికి ఆదివాసీ నిరుద్యోగులకు కేవలం 38 పోస్టులు కేటాయించడం సరికాదని, రాష్ట్ర ప్రభుత్వం పునర్‌ పరిశీలన చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను.

నాన్‌ షెడ్యూల్డ్‌ ఏరియాలో ఎస్టీలకు 300 పోస్టులను కేటాయించింది. గిరిజన గురుకులం (బైలా) నిబంధనలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం జనరల్‌ డిఎస్సీ లో గురుకులం పోస్టులను విలీనం చేసింది. గిరిజన గురుకులానికి ఉన్న స్వయం ప్రతిపత్తిని కూడా లెక్కచేయకుండా  ఏకపక్షంగా ప్రభుత్వం పిజిటి 58 పోస్టులు, టిజిటి 446 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేయడం దారుణం. గిరిజన గురుకులంలో జోనల్‌ వ్యవస్థ ద్వారా ఉద్యోగాలు భర్తీ చేస్తారు. కాని జనరల్‌ డిఎస్సీ మాత్రం జిల్లా యూనిట్‌గా నోటిఫికేషన్‌ జారీచేసియున్నారు. గత 20 సంవత్సరాల నుండి విధులు నిర్వహిస్తున్నా రెగ్యులర్‌ చేయకుండా జనరల్‌ డిఎస్సీ ద్వారా స్కూల్‌ ఔట్‌సోర్సింగ్‌ ఉపాధ్యాయులైన ఆదివాసీలను గెంటి వేయొద్దని కోరుతున్నాను.

ఏజెన్సీ ప్రాంతంలో 100% శాతం ఉద్యోగ రిజర్వేషన్‌ కల్పిస్తున్న  జీఓ నెంబర్‌ 3 ను సుప్రీంకోర్టు రద్దు చేయడంపై  2020లో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుండి మొత్తం 17 రివ్యూ పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలై ఉన్నది. మరోపక్క ఏజెన్సీ ప్రాంత ఆదివాసీలకు ఉద్యోగ రిజర్వేషన్‌కు తమ రాష్ట్ర ప్రభుత్వం 5వ షెడ్యూల్డ్‌ క్లాజ్‌ (2) ప్రకారం చట్టబద్ధత కల్పిస్తామని ట్రైబల్‌ అడ్వైజర్‌ కౌన్సిల్‌(టిఏసి) లో తీర్మానం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి గిరిజన సంక్షేమశాఖ సిఫార్సు చేసింది. టి.ఏ.సి తీర్మానాన్ని కూడా తమ రాష్ట్ర ప్రభుత్వం కనీసం గౌరవించలేదు. మరోపక్క జనరల్‌ డిఎస్సీ నోటిఫికేషన్‌తో ఆదివాసీ నిరుద్యోగులకు తీవ్రమైన ఆభద్రత భావం, ఆందోళన కలిగిస్తోంది. 

జీ.ఓ నెంబర్‌ 3 రద్దు చేసిన తర్వాత అనేకమార్లు తమ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు నిర్వహించింది. కానీ ఏనాడు ఆదివాసులకు 100% శాతం ఉద్యోగ రిజర్వేషన్‌ కు చట్టబద్ధత గూర్చి ప్రస్తావన చేయలేదు. పునరుద్ధరణకు కనీసం ఎటువంటి చర్యలకు ఉపక్రమించకపోవడంతో ఆదివాసీ యువతకు తీవ్ర అన్యాయం జరుగుతోంది.

రాజ్యాంగంలో 5వ షెడ్యూల్‌ ఏరియాలో ఆదివాసులకు భద్రత, రక్షణ, పరిపాలన బాధ్యత గూర్చి స్పష్టంగా పేర్కొనబడినది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే ఏ ఉత్తర్వులైనా 5వ షెడ్యూల్‌ క్లాజ్‌ (1)(2) ప్రకారం గవర్నర్‌, టి.ఏ.సి అనుమతి తప్పకుండా తీసుకోవాలి. కానీ జనరల్‌ డిఎస్సీ నోటిఫికేషన్‌ జారీపై ఇటువంటి ప్రక్రియను దిక్కరించడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్దం.

ఆదివాసులకు ప్రత్యేక భాష సంస్కృతి ఉంది. గిరిజన భాష రాని ఉపాధ్యాయులను ఏజెన్సీలో నియమించడం వల్ల ఆర్టికల్‌ 29, 32 ఉల్లంఘించినట్లు అవుతుంది. ఇటివల కాలం లో 1998, 2008లో సుమారు 400 G 280 ఎస్సీటీ పోస్టులను పాడేరు ఏజెన్సీ ప్రాంతంలో మినిమం టైమ్స్‌ స్కేల్‌ ప్రాతిపదికన స్థానికేతరులతో తమ ప్రభుత్వం భర్తీ చేయడం వల్ల ఆదివాసీలు ఉద్యోగం పొందుతామనే ఆశ, నమ్మకం కోల్పోయి ఆసాంఘిక కార్యకలాపాలవైపు మొగ్గుచూపుతున్నారు. తమ ప్రభుత్వం చర్య వల్ల ఇప్పటివరకు ఉపాధి పొందుతున్న గిరిజన గురుకులంలో ఔట్‌సోర్సింగ్‌ ఉపాధ్యాయులు 504 మంది, గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో సిఆర్‌టి ఉద్యోగం నిర్వహిస్తున్న 521 మంది ఉద్యోగం కోల్పోయి వారి స్థానంలో గిరిజనేతరులతో తమ ప్రభుత్వం భర్తీ చేస్తోంది.

1/70 చట్టం ప్రకారం స్థిర నివాసానికి అనుమతులు లేని వారు 2% శాతం మాత్రమే ఉన్న గిరిజనేతరులకు 95% పోస్టులు భర్తీ చేయడం, 98 శాతం మంది వున్న ఆదివాసుల కోసం కేవలం 5 శాతం పోస్టులు మాత్రమే కేటాయించి భర్తీ చేయడం తగదు. తమ ప్రభుత్వం వెంటనే జనరల్‌ డిఎస్సీ నోటిఫికేషన్‌ను పునర్‌ పరిశీలించి ఏజెన్సీ ప్రాంత ఆదివాసీ నిరుద్యోగులకు భద్రతా, భరోసా కల్పించి ఉపాధ్యాయ పోస్టులు భర్తీకి తగిన చర్యలు తీసుకొవాలని కోరుతున్నాను. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన నిరుద్యోగులకు న్యాయం చేయడానికి వెంటనే ప్రత్యేక డిఎస్సీ ప్రకటించాలని అందుకు ఆర్డినెన్సు జారీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను.

అభివందనములతో...

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి