కృష్ణపట్నం పోర్టు కంటైనర్‌ టెర్మినల్‌ కార్యకలాపాలను యధావిధిగా కొనసాగించాలని కోరుతూ..

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు),

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ,

విజయవాడ,

 తేది : 16 ఫిబ్రవరి, 2024.

శ్రీయుత వై.ఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి గారికి,  

గౌరవ ముఖ్యమంత్రి,   

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం,

అమరావతి.

 

విషయం:   కృష్ణపట్నం పోర్టు కంటైనర్‌ టెర్మినల్‌ కార్యకలాపాలను యధావిధిగా కొనసాగించాలని కోరుతూ..

 

శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని ముత్తుకూరు మండలంలో ఉన్న అదానీ కృష్ణపట్నం పోర్టులోని కంటైనర్‌ కార్యకలాపాలు గత సంవత్సర కాలంగా అదానీ పోర్టు యాజమాన్యం వారి ప్రయోజనాలకోసం ఒక ప్రణాళిక ప్రకారం తమిళనాడులోని వారి స్వంత పోర్టులకు తరలిస్తున్నారు. దీని మూలంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం ఆదాయాన్ని కోల్పోతుంది. దీనివలన సుమారుగా ఐదువేల మందికి పైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కోల్పోతారు. పరోక్షంగా వేలమంది జీవన భృతి కోల్పోతారు. పోర్టు పరిసర ప్రాంతాల్లో దానిపై ఆధారపడిన ఎగుమతులు, దిగుమతులు దెబ్బతింటాయి. జిల్లాలో ఇప్పటికే నిర్మితమైన కంటైనర్‌ ఆధారిత పరిశ్రమలు, గోదాములు, కోల్డ్‌స్టోరేజీల, ట్రాన్స్‌పోర్టు వ్యాపారాలపైనా తీవ్ర ప్రభావం పడుతుంది. ఈ నిర్ణయం వలన పరిశ్రమలు తరలిపోతాయి. ఇది రాష్ట్ర అభివృద్ధికి నష్టదాయకం.

పోర్టు యాజమాన్యం నిబంధనలకు విరుద్ధంగా పోర్టు బెర్తులను వాడుకోవడం వలన పరిసర ప్రాంతాల్లో కాలుష్యం తీవ్రత పెరిగింది. ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. పంటభూముల్లో పంట దిగుబడులు తగ్గాయి. మరికొన్ని ప్రాంతాల్లో పంటలు దెబ్బతింటున్నాయి. నీరు, గాలి కలుషితమైపోతున్నాయి. పోర్టు యాజమాన్యం అనుసరిస్తున్న విధానాలతో జిల్లా కాలుష్యపు కోరల్లో చిక్కుకునే ప్రమాదం, కార్మికులు, ఉద్యోగులు, చిరువ్యాపారులు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఉన్నది. 

పోర్టు యాజమాన్యం కె.పి.సి.యల్‌ కంపెనీకి 2004 సెప్టెంబర్‌ 17న ప్రభుత్వం ఇచ్చిన రాయితీ అగ్రిమెంట్‌ ప్రకారం సంరక్షకుడి పాత్ర మాత్రమే పోషించాలి. 30 ఏళ్ల అగ్రిమెంట్‌ కాలపరిమితి తరువాత పోర్టును ప్రభుత్వానికి అప్పగించాలి. కానీ అదానీ సంస్ధ వ్యవహారం చూస్తూంటే వారి పోర్టులను అభివృద్ధి చేసుకునేందుకు ఈ పోర్టును పావుగా వాడుకుంటున్నారు. అగ్రిమెంట్‌ కాలపరిమితి పూర్తయ్యే నాటికి కృష్ణపట్నం పోర్టును నిర్వీర్యం చేసేలా ఈ సంస్థ వ్యవహరిస్తుంది.

నెల్లూరు జిల్లాలో దీనిపై ప్రజల్లో ఆందోళన వుంది. కార్మికులు నిరసనలు చేపట్టారు. కావున తమరు తక్షణం స్పందించి కృష్ణపట్నం పోర్టు పరిరక్షణకు చర్యలు చేపట్టాలని కోరుతున్నాను. కంటైనర్‌ టెర్మినల్‌ని యధావిధిగా కృష్ణపట్నం పోర్టులోనే కొనసాగించేలా సత్వర చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాను.

 

అభివందనములతో...

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి