మెగా డిఎస్సీ నిర్వహించాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్‌

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)

ఆంధ్ర ప్రదేశ్ కమిటీ

ప్రచురణార్ధం/ప్రసారార్ధం :

విజయవాడ,

తేది : 04 ఫిబ్రవరి, 2024.

 

మెగా డిఎస్సీ కోసం లక్షలాది మంది నిరుద్యోగులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి గారు చేసిన వాగ్దానాన్ని అమలు చేస్తారని ఎదురు చూసిన వారికి తాజా ప్రకటన నిరాశపరిచింది. వెంటనే మెగా డిఎస్సీ నిర్వహించాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేస్తున్నది. రాష్ట్రంలో ఇప్పటికే సుమారు 25 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉండగా కేవలం 6,100 పోస్టులు మాత్రమే భర్తీ చేస్తామని ప్రకటించడం నిరుద్యోగులను మోసం చేయడమే. కాబట్టి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, విద్యా అనుబంధ రంగాల పోస్టులన్నీ భర్తీకి తక్షణమే నోటిఫికేషన్‌ విడుదల చేయాలని సిపిఐ(యం) రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నది.

ప్రతిపక్షనేతగా జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర సందర్భంగా వైసిపి అధికారంలోకి వస్తే మెగా డిఎస్సీ ప్రకటించి నిరుద్యోగులకు కానుకగా ఇస్తామని ప్రకటించారు. నిరుద్యోగ యువత ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. కానీ రాష్ట్ర చరిత్రలో ఏనాడు లేని విధంగా ఈ ఐదు సంవ్సతరాల కాలంలో ఒక్క డిఎస్సీ కూడా ప్రకటించలేదు. సుదీర్ఘకాలంగా యువజన సంఘాలు, నిరుద్యోగ యువత పోరాడిన ఫలితంగా కంటి తుడుపు చర్యగా 6,100 పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించారు. ఇవి కూడా అన్ని జిల్లాలు, కేటగిరీలను సమగ్రంగా రూపొందించలేదు.

డిఎస్సీ ప్రకటించిన వాటిలో కూడా అనేక నిబంధనలు పెట్టారు. ఎప్పుడో రద్దు చేసిన అప్రెంటిస్‌ విధానాన్ని పున:ప్రవేశపెట్టి రెండేళ్ళు గౌరవ వేతనం ఇస్తామని ప్రకటించడం అన్యాయం. గడిచిన నాలుగు ఏళ్ళుగా కొత్తగా ఉద్యోగాలకోసం రాష్ట్రంలో సుమారు 10 లక్షల మంది అభ్యర్థులు లక్షలాది రూపాయలు ఖర్చుపెట్టి కోచింగ్‌లు తీసుకొని నోటిఫికేషన్‌ కోసం ఎదురుచూస్తున్నారు. కానీ ప్రభుత్వం ప్రకటించిన సంఖ్యను చూసి లక్షలాది మంది యువత నిరుత్సాహం చెందుతున్నారు. రాష్ట్రంలో వివిధ రకాల ఉపాధ్యాయ పోస్టులు సుమారు 25 వేలు ఉన్నాయి. ఇవిగాక రానున్న జూన్‌లో మరిన్ని పోస్టులు ఖాళీ అవుతున్నాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని సుమారు 32 వేల పోస్టులు ఖాళీగా ఉండొచ్చు. కాబట్టి మెగా డిఎస్సీ ప్రకటించాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేస్తున్నది. అభ్యర్థుల వయోపరిమితిని సడలించాలని, అదే విధంగా పోస్టుల భర్తీకోసం న్యాయబద్దంగా ఆందోళన చేసిన యువజన సంఘాల నాయకులు, అభ్యర్థులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని సిపిఐ(యం) రాష్ట్ర కమిటీ డిమాండ్‌ చేస్తున్నది.

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శి