ఫిబ్రవరి 1 నుండి ఇంటింటా సిపిఎం ప్రజానిధి క్యాంపెయిన్‌

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)
ఆంధ్ర ప్రదేశ్ కమిటీ
ప్రచురణార్థం/ ప్రసారార్థం :
విజయవాడ,
తేది : 31 జనవరి, 2024.

వాహన ఫిట్‌నెస్‌ కేంద్రాలను ప్రభుత్వమే నిర్వహించాలి
ప్రైవేటీకరిస్తే రవాణా యంత్రాంగం నిర్వీర్యం, యజమానులపై పెనుభారం
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విమర్శ
ఇసుక మద్యానికి తోడు రవాణా
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పెద్దలకు కాంట్రాక్టు
గల్లా జయదేవ్‌ విమర్శలకు బిజెపి నాయకులు సమాధానం చెప్పాలి
విఓఏల ఆందోళనకు సంపూర్ణ మద్దతు
ఫిబ్రవరి 1 నుండి ఇంటింటా సిపిఎం ప్రజానిధి క్యాంపెయిన్‌

        వాహనాల ఫిట్‌నెస్‌ తనిఖీ పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో పెద్దలు,
వారి కుటుంబ సభ్యులు పెద్దఎత్తున దోపిడీకి సిద్ధమయ్యారని సిపిఎం రాష్ట్ర
కార్యదర్శి వి.శ్రీనివాసరావు, కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు
విమర్శించారు. బుధవారం విజయవాడ బాలోత్సవ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల
సమావేశంలో వారు మాట్లాడారు. ఆటోమేటెడ్‌ టెస్టింగ్‌ స్టేషన్ల పేరుతో పెద్ద,
చిన్న వాహనాల ఫిట్‌నెస్‌ను తనిఖీ చేసి సర్టిఫికెట్‌ ఇచ్చేందుకు రాష్ట్ర
ప్రభుత్వం బిడ్డింగ్‌కు ఆహ్వానించిందని, బిడ్డింగుల్లో  ఎక్కువ చెల్లించే
వారికి కేటాయిస్తామని నిబంధన పెట్టారని, అంటే ఆ భారాన్ని వాహన యజమానుల
నుండి వసూలు చేయాల్సి ఉంటుందని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో
పలుకుబడి కలిగిన కొంతమంది పెద్దలు వారి కుటుంబ సభ్యులు, బినామీల పేరుతో
నిబంధనలకు విరుద్ధంగా టెండర్లు దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని
అన్నారు. ఈ ఏడాది అక్టోబరు నాటికి బిడ్డింగ్‌ పూర్తి చేయాలని కేంద్రం గవువు
విధించినా నిబంధన పెడితే రాష్ట్ర ప్రభుత్వం ఒకడుగు ముందుకేసి ఇప్పడే
టెస్టింగ్‌ సెంటర్లకు జాతీయ రహదారుల పక్కన స్థలాలు కేటాయించే పనిచేస్తోందని
విమర్శించారు. ఎన్నికల ముందే వాహన యజమానుల నుండి పెద్దఎత్తున దండుకునేందుకు
సిద్ధమయ్యారని తెలిపారు. యాక్సిడెంట్లు జరుగుతున్నాయని కేంద్రం ఇచ్చిన
నివేదిక అధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంటున్నారని, వాస్తవంగా
రోడ్లు సరిగా లేవని, డివైడర్లు నిబంధనల ప్రకారం ఏర్పాటు చేయడం లేదని,
అత్యంగ వేగవంతమైన వాహనాలు నడిపేందుకు వీలుగా రోడ్లు లేవని, డ్రైవర్లకు
తగిన శిక్షణ కూడా లేదని అందువల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని వివరించారు. ఈ
విషయాలు పక్కనబెట్టి క్లచ్చులు, బ్రేకులు, ఇంజన్ల తనిఖీ పేరుతో దోపిడీ
చేయడమే పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే రవాణాశాఖ
అధికారుల వేధింపులకు గురవుతున్న వాహన యజమానులకు ఇదొక భారంగా మారనుందని
వివరించారు. ముఖ్యంగా ఇంటర్‌సిటీ నగరాల మధ్య తిరిగే వాహనాలకు అధికభారం
పడటంతోపాటు వేధింపులూ పెరుగుతాయని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం
స్పందించి బిడ్డింగు రద్దుచేసి అన్ని రకాల రవాణా యాజమాన్య సంఘాలతో
సంప్రదింపులు జరిపిన తరువాతే నిర్ణయం తీసుకోవాలని కోరారు. అప్పటిదాకా
దాన్ని అమల చేయరాదని కోరారు. ఇవేమీ చేయకుండా నేరుగా అమల్లోకి తేవడం అంటే
దోచుకోవడం తప్ప మరొకటి కాదని వివరించారు. అవినీతికి అరికట్టాల్సిన
ప్రభుత్వమే ఇసుక మద్యం బాటలో దాన్ని వ్యవస్థీకృతం చేస్తోందని అన్నారు.
ప్రజలపై వేలకోట్ల అదనపు భారం వేస్తోందని పేర్కొన్నారు. ఇప్పటి వరకూ
రవాణాశాఖను నిర్వీర్యం చేసి ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు ప్రైవేటు వ్యక్తులు
ఇస్తారని తెలిపారు. 25 జిల్లాలకు సంబంధించి టెండర్లు పిలిచారని, ఇప్పటి
వరకూ టూవీలర్లకు ఫిట్‌నెస్‌ అవసరం లేదని, ఇక నుండి ఏడాదికి ఒకసారి వారు
కూడా తనిఖీ చేయించుకోవాల్సి ఉంటుందని తెలిపారు. దీనికోసం ప్రైవేటు సంస్థకు
రూ.600, ప్రభుత్వానికి రూ.200 చెల్లించాలని, 15 సంవత్సరాలు దాటితే రూ.1900
చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇది నిర్ణీత ఫీజు మాత్రమేనని,
ప్రైవేటు వ్యక్తులు ఎంత వసూలు చేస్తారో అద్దూఅదుపు లేదని పేర్కొన్నారు.
భారీ వాహనాలకు రూ.920 ఏడాదికి చెల్లించాలని, 15 ఏళ్లలోపు ఉంటే రూ.1800, 15
సంవత్సరాలు దాటితే రూ.15 వేలు కట్టాల్సి ఉంటుందని అంటే 1400 శాతం ధరలు
పెంచారని వివరించారు. టూవీలర్లు కాకుండా 13,25 లక్షల వాహనాలు ఉన్నాయని, ఇవి
కాకుండా లక్షల సంఖ్యలో టూవీలర్లు ఉన్నాయని వివరించారు. రిజిస్ట్రేషన్లను
కూడా రూ.400 నుండి రూ.3000, రూ.5000కు పెంచారని విమర్శించారు. ఇదే పద్ధతి
కొనసాగితే వాహన యజమానులపై పెనుభారం పడుతుందని విమర్శించారు. దీన్ని
అడ్డుకోవాలని వారు కోరారు. ఇప్పటికే మద్యం, ఇసుక పేరుతో దోచుకుంటున్న
పెద్దలకు రవాణా వాహనాలు కూడా తోడయ్యాయని అన్నారు.
ఫిబ్రవరి 1 నుండి  ప్రజానిధి వసూలు
        ఫిబ్రవరి 1 నుండి పదోతేదీ వరకూ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటా సిపిఎం
ప్రజానిధి క్యాంపెయిన్‌ నిర్వహిస్తోందని వారు తెలిపారు. ప్రజల సమస్యల
పరిష్కారం కోసం చేస్తున్న ఉద్యమాల నిర్వహణ కోసం ప్రజల వద్ద నుండే డబ్బులు
అడుగుతున్నామని వివరించారు.  ఎన్నికల సమయంలో అన్ని పార్టీలూ ఓట్లు
కొనుక్కోవడానికి ఏదో ఒకరంగా డబ్బులు పంచేందుకు సిద్ధమవుతున్న సమయంలో సిపిఎం
ప్రజల నుండి డబ్బులు అడుగుతోందని, ఇది సాహసోపేత నిర్ణయమని తెలిపారు. ప్రధాన
ప్రతిపక్ష పార్టీలు  శాసనసభ నియోజకవర్గానికి రూ.25 కోట్ల నుండి 35 కోట్ల
వరకూ అభ్యర్థుల నుండి వసూలు చేస్తున్నారని, ఎన్నికల్లో రూ.100 కోట్ల వరకూ
ఖర్చు చేయాలని ఇంత డబ్బు వారికి ఎక్కవ నుండి వస్తుందని ప్రశ్నించారు.
వారందరికీ కార్పొరేట్‌ కంపెనీలు నిధులు సమకూరుస్తున్నాయని, అనంతరం దోపిడీ
చేసుకుంటున్నాయని,  గెలిచిన అభ్యర్థులు కార్పొరేట్లకు వ్యతిరేకంగా
పల్లెత్తు మాట అనకుండా సహకరిస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నికల బాండ్ల
పేరుతో నిధులు తీసుకోనిది సిపిఎం ఒక్కటేనని, అదానీ, అంబానీ లాంటి కంపెనీల
నుండి వస్తున్న 85 శాతం బాండ్లు బిజెపికి వెళుతున్నాయని పేర్కొన్నారు. తాము
రాష్ట్రంలో అనేక పోరాటాలు నిర్వహిస్తున్నామని, ముఖ్యంగా పోలవరం, అధిక ధరలు,
కరెంటు ఛార్జీలకు వ్యతిరేకంగా ప్రజల తరుపున పనిచేశామని వివరించారు. ప్రజలను
విరాళాలు అడిగే హక్కు సిపిఎంకు మాత్రమే ఉందని ఆయన ప్రకటించారు.
విఓఏలకు మద్దతు
        ఆందోళన చేస్తున్న విఓఏలు, ఆర్‌పిల సమస్యలు పరిష్కరించాలని శ్రీనివాసరావు
కోరారు. మూడేళ్లు దాటిని వారిని తీసేయాలని రాష్ట్రం సర్క్యులర్‌ ఇవ్వడం
దుర్మార్గమని పేర్కొన్నారు. అధికారపార్టీ తమ మనుషులను పెట్టుకునేందుకే ఈ
సర్క్యులర్‌ ఇచ్చారని వివరించారు. ఈ నేపథ్యంలో ఆందోళన చేస్తున్న విఓఏలకు
పూర్తి మద్దతు తెలుపుతున్నామని పేర్కొన్నారు.
జయదేవ్‌కు బిజెపి సమాధానం చెప్పాలి
        ప్రత్యేక హోదాపై అడిగినందుకే తనపై వేధింపులకు దిగారని బహిరంగంగా చెప్పిన
టిడిపి ఎంపి గల్లా జయదేవ్‌ వ్యాఖ్యలకు బిజెపి నాయకులు సమాధానం చెప్పాలని,
హోదా ఇస్తారా, లేక అడ్డుకుంటున్నారా స్పష్టం చేయాలని అన్నారు. హోదా ఇప్పటి
వరకూ ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని ప్రశ్నించారు. జయదేవ్‌లాగా బిజెపి
వేధింపులకు ఎందరో రాజకీయంగా బలయ్యారని ఆయన విమర్శించారు.