ఎస్మా రద్దు.. .జీతాలు పెంపు

ఎస్మా రద్దు.. .జీతాలు పెంపు

  • రౌండ్‌టేబుల్‌ సమావేశం డిమాండ్‌
  • వివిధ పార్టీలు, ప్రజాసంఘాల ఏకగ్రీవ తీర్మానం
  • సంక్రాంతిలోపు తేల్చకపోతే ప్రత్యక్ష కార్యాచరణ
  • నేడు రాస్తారోకోలు, ప్రదర్శనలు

అంగన్‌వాడీలపై విధించిన ఎస్మాను తక్షణమే రద్దుచేయాలని, అదేవిధంగా అంగన్‌వాడీలతో పాటు మున్సిపల్‌, సర్వశిక్ష కార్మికుల జీతాలను పెంచాలని వివిధ రాజకీయ పార్టీలు డిమాండ్‌ చేశాయి. సంక్రాంతిలోపు ఈ డిమాండ్లను పరిష్కరించాలని, లేని పక్షంలో ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతామని హెచ్చరించాయి. ఉద్యోగ కార్మిక సంఘాల సమ్మెలకు మద్దతుగా సిపిఎం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యాన సోమవారం ఉదయం విజయవాడ బాలోత్సవ భవన్లో జరిగిన రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీంవగా తీర్మానం చేశారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో టిడిపి, సిపిఐ, కాంగ్రెస్‌, న్యూడెమోక్రసీ, ఎస్‌యుసిఐసితోపాటు సిఐటియు, విద్యార్థి యువజన, మహిళా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా సభకు అధ్యక్షత వహించిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న అబద్దాలకు అంతు లేకుండా పోయిందని అన్నారు. ఎస్మా ప్రయోగించినా కార్మికులు పట్టువీడటం లేదంటే వారి బాధ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. అంగన్‌వాడీలు అత్యవసర విభాగం అని భావిస్తే ఇన్ని రోజులు ఎందుకు సమస్యను పరిష్కరించలేదని ప్రశ్నించారు. ఈ విషయంలో జగన్‌కు శృంగభంగం తప్పదని, మహిళలే తగిన బుద్దిచెబుతారని హెచ్చరించారు. ఆందోళనలు చేస్తుంటే అరెస్టులు చేయడం తెలివితక్కువతనమని పేర్కొన్నారు. సర్వశిక్ష అభియాన్‌లో సిబ్బంది గొడ్డుచాకిరీ చేస్తున్నారని అన్నారు. సంక్రాంతిలోపు సమ్మెలో ఉన్న కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే అన్ని పార్టీలు ప్రత్యక్ష ఆందోళనకు దిగడంతోపాటు, రాష్ట్ర బంద్‌ చేపడతామని హెచ్చరించారు.

టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మాట్లాడుతూ కార్మికులకు ఏమి కావాలో తెలుసుకోకుండా భయభ్రాంతులకు గురిచేయడం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వానికి సరైన ఆర్థిక విధానం లేదని, సమస్యపైనా అవగాహన లేదని విమర్శించారు. ఇన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నా మంత్రులకు పట్టకపోవడం విడ్డూరంగా ఉందని అన్నారు.

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మాట్లాడుతూ ఎమ్మెల్యేలను ట్రాన్స్‌ఫర్‌ చేసేందుకు గంటల సమయం తీసుకుంటున్న ముఖ్యమంత్రి 26 రోజులుగా సమ్మె చేస్తున్న మహిళలతో చర్చించేందుకు గంట సమయం కేటాయించకపోవడం అన్యాయమని అన్నారు. చిన్న ఉద్యోగులపై బ్రహ్మాస్త్రం ప్రయోగించడం సరికాదని పేర్కొన్నారు. ఇష్టం వచ్చినట్లు చేస్తే చూస్తు ఊరుకోవడానికి ఇది పాలెగాళ్ల రాజ్యం కాదని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు సుంకర పద్మశ్రీ మాట్లాడుతూ ఒక్క అవకాశం అని అధికారంలోకి వచ్చిన తరువాత ఓటేసిన వారిని ముప్పుతిప్పలు పెడుతున్నారని అన్నారు. అంగన్‌వాడీలు, మున్సిపల్‌ కార్మికులు, ఎస్‌ఎస్‌ఎ సిబ్బంది పట్టువదలకుండా ఆందోళన కొనసాగిస్తున్నారని అభినందించారు.

జైభారత్‌ నేషనల్‌ పార్టీ అధ్యక్షులు వి.వి.లక్ష్మీనారాయణ మాట్లాడుతూ అంగన్‌వాడీలకు రక్షణ లేకుండా పోయిందని తెలిపారు. అత్యవసర సేవల కింద వారిని చేరిస్తే వెంటనే సమస్యను పరిష్కరించాలని, గ్రాట్యుటీ పెంచాలని కోరితే కోర్టులో కంటెంప్ట్‌ వేసుకోమంటున్నారని, దానికి ప్రభుత్వం ఎందుకని అన్నారు. న్యూడెమెక్రసీ నాయకులు కె.పొలారి, రామకృష్ణ మాట్లాడుతూ కార్మికుల విషయంలో ప్రభుత్వం మూర్ఖంగా వ్యవహరిస్తోందని, విస్తృత పోరాటాల ద్వారానే తగిన బుద్దిచెప్పాలని అన్నారు. ఎంసిపిఐయు నాయకులు ఖాదర్‌భాషా మాట్లాడుతూ పిల్లలకు అన్నం పెట్టే మహిళలను రోడ్డుపై నిలబెట్టిన ఘనత జగన్‌కే దక్కుతుందన్నారు. అమ్‌ఆద్మీ నాయకులు ఫణిరాజు మాట్లాడుతూ ఎస్మా నోటీసు ఇచ్చిన తరువాత న్యాయ సలహా తీసుకోవడం ప్రభుత్వ నిర్లక్ష్యపు పాలనకు నిదర్శనమని అన్నారు.

సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌.నరసింగరావు మాట్లాడుతూ అంగన్‌వాడీలపై ఎస్మా ప్రయోగం ప్రజలు, ప్రజాతంత్ర హక్కులపై దాడి అని అన్నారు. వెనక్కు తీసుకోకపోతే లక్షన్నర మండి మహిళలు తగిన బుద్ది చెబుతారని హెచ్చరించారు. ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి.రమాదేవి మాట్లాడుతూ అంగన్‌వాడీల సమ్మె వెనుక ఐదు లక్షల మంది మహిళల భాగస్వామ్యం ఉందని అన్నారు. మహిళా సమాఖ్య నాయకులు పి.దుర్గాభవాని మాట్లాడుతూ జగన్‌ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఐలు నాయకులు సంపర దుర్గా శ్రీనివాసరావు మాట్లాడుతూ సంక్షేమంలో భాగస్వాములైన అంగన్‌వాడీలను సంక్షోభంలోకి నెట్టారని మండిపడ్డారు. రైతు సంఘం నాయకులు వి.కృష్ణయ్య, కౌలు రైతు సంఘం నాయకులు హరిబాబు మాట్లాడుతూ ప్రస్తుత ఆందోళనలపై బహిరంగంగా చర్చించి ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకోవాలని అన్నారు. ప్రొఫెషనల్‌ ఫోరం నాయకులు నేతి మహేశ్వరరావు మాట్లాడుతూ ప్రభుత్వం సంక్షేమం పేరుతో రాజకీయ పథకాలు ప్రవేశపెట్టి ప్రజలను మోసం చేస్తోందని అన్నారు.

వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దడాల సుబ్బారావు మాట్లాడుతూ కార్మికుల సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు చేపడతామని అన్నారు. అంగన్‌వాడీ సంఘం నాయకులు రమాదేవి మాట్లాడుతూ జీతాలు పెంచమని కోరుతుంటే ప్రభుత్వ ఉద్యోగులు కాదని చెబుతున్నారని, అలాంటప్పుడు ఎస్మా ఎలా ప్రయోగించారని ప్రశ్నించారు. ఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు ఓ.నల్లప్ప, డివైఎఫ్‌ఐ నాయకులు రామన్న, ఇన్సూరెన్స్‌ సంఘాల నాయకులు పాత్రుడు, విద్యార్థి సంఘ నాయకులు ప్రసన్న తదితరులు మాట్లాడారు.