విశాఖ ఉక్కు బ్లాస్ట్ ఫర్నేస్ 3ను పనిచేయించడానికి అవసరమైన చర్యలను కేంద్ర ప్రభుత్వం చేపట్టాలనికోరుతూ ఆంధ్ర ప్రదేశ్ పార్లమెంట్ సభ్యులకు సిపిఎం లేఖ.

విజయవాడ,

తేది : 19 డిసెంబర్‌, 2023.

ఆంధ్రప్రదేశ్‌ పార్లమెంటు సభ్యులకు సిపిఐ(యం) 

లేఖ

 

విషయం : విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌ బ్లాస్ట్‌ ఫర్నేస్‌ 3ను  పనిచేయించడానికి అవసరమైన చర్యలను కేంద్ర ప్రభుత్వం చేపట్టాలని, పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు నష్టపరిహారం ఆర్‌డఆర్‌ ప్రయోజనాలకు కేంద్రం నుండి నిధులు రాబట్టేలా చూడాలని కోరుతూ...

 

ఆర్యా,

‘విశాఖ ఉక్కు ` ఆంధ్రుల హక్కు’  అంటూ 32 మంది ప్రాణత్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటు పరం చేయడానికి గత మూడేళ్లకు పైబడి కేంద్ర ప్రభుత్వం కుయుక్తులు పన్నుతోంది. రాష్ట్ర ప్రజల అండతో కార్మికులు పోరాడి ఇప్పటి వరకు నిలబెట్టారు. కేంద్రం ఇప్పుడు ప్రయివేటుపరం చేయడానికి కొత్త మార్గాలు వెతుకుతున్నది. ఉత్పత్తికి కీలకమైన బ్లాస్ట్‌ ఫర్నెస్‌`3 పని చేసేందకు సుమారు 12 వేల కోట్ల రూపాయలు అవసరం. ఆ నిధులను మంజూరు చేయడమో లేక అప్పు తీసుకోవడానికి అవసరమైన ఏర్పాట్లు చేయడమో మాని కేంద్ర ప్రభుత్వం ప్రైవేటుకు అప్పగించాలని కుతంత్రాలు చేస్తోంది. జిందాల్‌ స్టీల్‌ యాజమాన్యంతో ఉన్నతాధికారులు గతవారంలో ఢల్లీిలో చర్చించినట్లు వచ్చిన వార్తలతో స్టీల్‌ప్లాంట్‌ కార్మికవర్గం తీవ్ర ఆందోళన చెందుతోంది. ఇప్పటికైనా బ్లాస్ట్‌ ఫర్నెస్‌ `3 పనిచేయించేందుకు నిధులు కేటాయించాలని లేదా ఆ పని చేయడానికి స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ అప్పగించాలని కోరవలసి ఉంది. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ బ్లాస్ట్‌ ఫర్నేస్‌ ` 3ను పని చేయించడం కోసం నిధులు ఏర్పాటు చేయడం లేదా ఆ బాధ్యత సెయిల్‌కు అప్పగించేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని కోరుతున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటు వారికి విశాఖ స్టీల్‌ లో ఎటువంటి అవకాశమూ కల్పించరాదని కోరుతున్నాను.

పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణం మూలంగా లక్షలాది కుటుంబాలు ముఖ్యంగా అత్యధిక గిరిజన కుటుంబాలు నిర్వాసితులవుతున్న విషయం మీకు తెలుసు. వారికి చెల్లించాల్సిన నష్టపరిహారం, పునరావాస పునర్నిర్మాణ సౌకర్యాల కల్పన కోసం ఇంకా దాదాపు 33 వేల కోట్ల రూపాయలు సమకూర్చవలసి ఉంది. కానీ కేంద్ర ప్రభుత్వం అందుకు సంబంధించిన నిధులను విడుదల చేయకుండా తాత్సారం చేస్తోంది. ముంపు ప్రాంతాలు పేరిట ఆయా గ్రామాల్లోని ప్రజలకు మౌలిక వసతులను సైతం కల్పించడానికి ప్రభుత్వాలు నిరాకరిస్తున్నాయి. చివరికి ఇటీవల సంభవించిన తుఫానువల్ల జరిగిన నష్టపరిష్కారాన్ని కూడా ఎన్యుమరేషన్‌ చేయలేదు. ఈ నేపథ్యంలో పోలవరం నిర్వాసిత ప్రజానీకానికి చెల్లించవలసిన నష్టపరిహారం ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్రయోజనాల కల్పనకు కావలసిన నిధులను కేంద్ర ప్రభుత్వం నుంచి రాబట్టేందుకు పార్లమెంటు సభ్యులుగా మీరు ఈ సెషన్‌లోనే లేవనెత్తి వారికి న్యాయం చేసేందుకు కృషి చేయాలని కోరుతున్నాం.

రాష్ట్రానికి కీలకమైన ఈ రెండు అంశాలపై మీరు గట్టిగా కృషి జరపాలని, ప్రస్తుతం జరుగుతున్న సెషన్‌లోనే లేవనెత్తి కేంద్రాన్ని నిలదీసి రాష్ట్రానికి న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నాను.

అభివందనములతో...

 

(వి.శ్రీనివాసరావు)

రాష్ట్ర కార్యదర్శ