ముఖ్యమంత్రి తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి..

ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాడేవారిని, ప్రజా సమస్యలపై ఆందోళన చేసే వారిని సంఘ వ్యతిరేక శక్తులుగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అభివర్ణించడం సిపిఐ(యం) రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు తీవ్రంగా ఖండిరచారు. ఈ మేరకు పార్టీ అభిప్రాయాన్ని ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసేవారి గొంతునొక్కడానికి, ప్రతిపక్షాలను అణచి వేయడానికి చేసే ప్రయత్నంలో భాగమే ఇటువంటి ప్రేలాపనలు. పోలీసు అమరవీరుల సభను దీనికి ఉపయోగించుకోవడం దురదృష్టకరం. ఈ నిర్వచనాలు ప్రజాస్వామ్యానికే ప్రమాదం. మోడీని వ్యతిరేకించేవారందరూ దేశ ద్రోహులుగా  బిజెపి చిత్రీకరించినట్లుగా, మీడియా సంస్థలు వైర్‌, న్యూస్‌క్లిక్‌ పై దాడులు చేసి జర్నలిస్టులను ఉగ్రవాదులుగా ముద్ర వేసినట్లుగా, రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం కూడా మోడీని అనుసరిస్తున్నట్లుగా అనుమానం కల్గుతోంది. అసాంఘిక శక్వుల నిర్వచనాన్ని మార్చాలని ఆయన చేసిన ప్రతిపాదన సంఘ వ్యతిరేక శక్తులకే తోడ్పడుతుంది. దాడులు చేస్తున్నవారు, హత్యలు చేస్తున్నవారు, అత్యాచారాలు చేస్తున్నవారు, ప్రజాధనాన్ని లూటీ చేసే వారిని వదిలేసి ప్రజా సమస్యలపై పోరాడేవారిని అసాంఘిక శక్తులతో కలిపి ముఖ్యమంత్రి పునర్‌ నిర్వచించాలని పిలుపివ్వడం ప్రజాస్వామ్యానికే కళంకం. ముఖ్యమంత్రి తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలి. నిరసనలను, భిన్నాభిప్రాయాలను గౌరవించే ప్రాథమిక హక్కుల పరిరక్షణ కోసం ముందుకు రావాలని ప్రజాస్వామ్యవాదులకు, మేధావులకు ఆయన విజ్ఞప్తి చేశారు.